మనోళ్లు తెగ చదివేశారు

ABN , First Publish Date - 2020-10-14T05:23:52+05:30 IST

కరోనా కష్టనష్టాలు పక్కన పెడితే... దానివల్ల కొన్ని మంచి అభిరుచులు కూడా అలవడ్డాయి నవతరంలో!..

మనోళ్లు తెగ చదివేశారు

కరోనా కష్టనష్టాలు పక్కన పెడితే... దానివల్ల కొన్ని మంచి అభిరుచులు కూడా అలవడ్డాయి నవతరంలో! ప్రత్యేకించి లాక్‌డౌన్‌లో దాదాపు 30 లక్షల మంది భారతీయ యువతీయువకులు ఆన్‌లైన్‌లో చదవడానికి అలవాటుపడ్డారట. అంతేకాదు తమకు నచ్చింది రాస్తూ గడిపినవారూ ఇదే స్థాయిలో ఉన్నారట. రోజుకు సగటున 37 నిమిషాలకు తక్కువ కాకుండా ఆన్‌లైన్‌లో పఠనం, రచనకు కేటాయించినట్టు యూజర్‌ జనరేటెడ్‌ స్టోరీ్‌సకు వేదికైన ‘వాట్‌ప్యాడ్‌’ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా లాక్‌డౌన్‌ సమయంలో తమ వేదికను సందర్శించినవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని పేర్కొంది.


భారత్‌ నుంచి అయితే ఈ పెరుగుదల ఏకంగా 50 శాతం ఉంది. ఉన్నట్టుండి నెలలకు నెలలు ఇళ్లకే పరిమితం కావాల్సిరావడం, సాధారణ జీవనానికి దూరమవడం వల్ల ప్రజలు తమ అభిరుచులకు సమయం వెచ్చించారు. అధిక సంఖ్యాకులు స్టోరీ టెల్లింగ్‌తో కాలక్షేపం చేశారు. మరికొంతమంది తమలోని రచయితను నిద్ర లేపారు. అనూహ్య పరిణామాలను కథలుగా మలిచారు. పేరున్న రచయితలైతే తమ అభిమానులతో అనుబంధాన్ని పెంచుకున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఇది ఒక ఆశావహ పరిణామంగా వర్ణించింది ‘వాట్‌ప్యాడ్‌’. 


ఏదిఏమైనా ప్రపంచవ్యాప్తంగా కరోనా దెబ్బకు ‘వాట్‌ప్యాడ్‌’లో కథలు 151 శాతం, కొత్త రచయితలు 125 శాతం పెరిగారు. మొత్తంమీద రచనాంగం రెట్టింపయిందట. అదే భారత్‌లో అయితే చదివే సమయం 50 శాతం, కొత్త కథలు 30 శాతం, రచయితలు 60 శాతం చొప్పున పెరిగాయి. వీరిలో 90 శాతం మంది 15 నుంచి 30 ఏళ్ల లోపువారే. 65 శాతం ఆడవారు కాగా, 45 శాతం మంది మెట్రోయేతర నగరాలకు చెందినవారు కావడం విశేషం. 


2006లో వెబ్‌సైట్‌గా ప్రారంభమైన ‘వాట్‌ప్యాడ్‌’... ఆ తరువాత యాప్‌ను కూడా డెవలప్‌ చేసింది. ఐదేళ్ల కిందట భారతీయులకు అందుబాటులోకి తెచ్చింది. ఇందులోని కథలు పలు టీవీలు, ఓటీటీల్లో సిరీ్‌సల్లా వచ్చాయి. పుస్తకాలుగా అచ్చయ్యాయి. సంస్థ కథనం ప్రకారం ఇలాంటి కథలు వెయ్యికి పైగా ఉన్నాయి.

Updated Date - 2020-10-14T05:23:52+05:30 IST