విమానాల్లో వాడే ఆయిల్‌ను తస్కరించి.. డీజిల్‌గా కల్తి చేసి..!

ABN , First Publish Date - 2020-12-08T13:27:18+05:30 IST

విమానాల్లో వాడే టర్బైన్‌ ఫ్యూయల్‌ను (వైట్‌ పెట్రోల్‌) ట్యాంకర్ల నుంచి తస్కరించి

విమానాల్లో వాడే ఆయిల్‌ను తస్కరించి.. డీజిల్‌గా కల్తి చేసి..!

  • వైట్‌ పెట్రోల్‌ కల్తీ
  • డీజిల్‌గా మార్చి విక్రయిస్తున్న ముఠా
  • ఆటకట్టించిన రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు
  • ముగ్గురి అరెస్టు, ట్యాంకర్‌ స్వాధీనం

హైదరాబాద్‌ : రాచకొండ శివారు ప్రాంతాల్లో డీజిల్‌ కల్తీ చేస్తున్న ముఠా ఆటకట్టించారు రాచకొండ ఎస్‌వోటీ పోలీసులు  విమానాల్లో వాడే టర్బైన్‌ ఫ్యూయల్‌ను (వైట్‌ పెట్రోల్‌) ట్యాంకర్ల నుంచి తస్కరించి, దాన్ని డీజిల్‌గా కల్తీ చేసి బ్లాక్‌ మార్కెట్లో విక్రయిస్తున్న ముఠాను మల్కాజిగిరి, నాచారం పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురు నిందితులను అరెస్టు చేసి కటకటాల్లోకి నెట్టారు. వారి వద్ద నుంచి 300 లీటర్ల ఎటీఎప్‌ (ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌), డీజిల్‌ ట్యాంకర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నాచారం గోకుల్‌నగర్‌ ప్రాంతానికి చెందిన దయానంద్‌కు 4-5 డీజిల్‌ ట్యాంకర్లు ఉన్నాయి. వివిధ పెట్రోలియం కంపెనీలకు వాటిని అద్దెకు ఇచ్చాడు. వాటి ద్వారా  వైట్‌ పెట్రోల్‌ను (ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌) శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రవాణా చేస్తున్నాడు.


గుట్టుగా దందా..

అక్రమ సంపాదనకు అలవాటుపడిన దయానంద్‌ తన ట్యాంకర్‌ల ద్వారా వెళ్తున్న వైట్‌ పెట్రోల్‌ను తస్కరించేవాడు. అందుకోసం గోకుల్‌నగర్‌లోని తన ఓపెన్‌ ప్లాటులో ఒక షెడ్డును ఏర్పాటు చేసుకున్నాడు. ఒక ఖాళీ ట్యాంకర్‌ను అక్కడ పెట్టాడు. శంషాబాద్‌కు వెళ్తున్న ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూయల్‌ ట్యాంకర్‌లను తన డ్రైవర్‌ల సహకారంతో ఆ షెడ్డులో ఆపేవాడు. అందులోంచి లీటర్ల కొద్దీ ఫ్యూయల్‌ తస్కరించేవాడు. దానికి వాహనాల్లో వాడే ఇంజన్‌ ఆయిల్‌ను కలిసి, డీజిల్‌గా మారుస్తాడు. దానిని ముందుగానే ఒప్పందం కుదుర్చుకున్న డీలర్‌లకు విక్రయించేవాడు. అలా కొన్నేళ్లుగా ఈ దందా కొనసాగిస్తూ.. రూ. లక్షలు సంపాదించారు. ఈ మేరకు రాచకొండ పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. సీపీ మహేష్‌ భగవత్‌ ఆదేశాల మేరకు  మల్కాజిగిరి ఎస్‌వోటీ నవీన్‌ బృందం నాచారం పోలీసులతో కలిసి సంయుక్తంగా కలిసి గోకుల్‌నగర్‌లోని షెడ్డుపై దాడులు చేశారు. నిందితుడు దయానంద్‌తో పాటు మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నాచారం ఇన్‌స్పెక్టర్‌ కిరణ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దందాపై పోలీసులు మరింత లోతుగా విచారిస్తున్నారు.

Updated Date - 2020-12-08T13:27:18+05:30 IST