మంత్రులను మార్చేస్తారా?

ABN , First Publish Date - 2021-11-30T08:59:29+05:30 IST

‘‘మంత్రుల పనితీరు ఆధారంగా రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మందిని మార్చి కొత్తవారికి అవకాశం ఇస్తాను. పాతవారు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తారు’’... ఇది ముఖ్యమంత్రి జగన్‌ తొలినాళ్లలో చెప్పిన మాట! ‘90 శాతం కాదు... మొత్తం మంత్రులందరినీ మార్చేస్తాం’ అని కొన్ని నెలల క్రితం లీకులు కూడా..

మంత్రులను మార్చేస్తారా?

  • జగన్‌ మాట మార్చేస్తారా?..
  • ‘సంపూర్ణ ప్రక్షాళన’పై కొత్త ప్రచారం
  • మరో ఆరు నెలలు పొడిగింపు?..
  • కొందరు సీనియర్ల పదవులు ‘సేఫ్‌’?


(అమరావతి- ఆంధ్రజ్యోతి)

‘‘మంత్రుల పనితీరు ఆధారంగా రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మందిని మార్చి కొత్తవారికి అవకాశం ఇస్తాను. పాతవారు పార్టీలో కీలక బాధ్యతలు నిర్వహిస్తారు’’... ఇది ముఖ్యమంత్రి జగన్‌ తొలినాళ్లలో చెప్పిన మాట! ‘90 శాతం కాదు... మొత్తం మంత్రులందరినీ మార్చేస్తాం’ అని కొన్ని నెలల క్రితం లీకులు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ రెండున్నరేళ్లు పూర్తయింది. మంత్రి వర్గం కొలువుతీరి డిసెంబరు 6వ తేదీకి రెండున్నరేళ్లు అవుతుంది. కానీ... ఇప్పుడు మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ ఊసే వినిపించడంలేదు. పైగా... మరో ఆర్నెళ్లు పొడిగిస్తున్నట్లుగా సంకేతాలు పంపుతోంది. వెరసి... అనేక నిర్ణయాల్లాగానే, మంత్రివర్గ ప్రక్షాళన విషయంలోనూ జగన్‌ మడమ తిప్పినట్లేనా అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రుల మెడపై ‘తొలగింపు’ కత్తి పెట్టి వారిని పూర్తి కంట్రోల్‌లో ఉంచుకోవడం... ‘రాబోయే’ పదవిపై ఆశతో మిగిలిన వారూ సంపూర్ణ విధేయత ప్రదర్శించడం! రెండున్నరేళ్ల తర్వాత అందరికీ ఉద్వాసన మాట వెనుక వ్యూహం ఇదేనా అనే అనుమానాలూ కలుగుతున్నాయి. మంత్రివర్గంలో అందరినీ మార్చి, కొత్త వారిని నియమిస్తారని... జగన్‌ సన్నిహిత బంధువైన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా గతంలో ధ్రువీకరించారు. ఇంకొందరు సీనియర్లు మంత్రివర్గ కూర్పు ముఖ్యమంత్రి అభీష్టమని వ్యాఖ్యానించారు.


అయితే... నిధుల లేమి, కరోనా కారణంగా నియోజకవర్గాల్లో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకుండానే రెండున్నరేళ్లు గడచిపోయాయన్న అభిప్రాయం మంత్రుల్లో నెలకొంది. కొందరు మంత్రులు ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన నేతను ఆశ్రయించి... కనీసం మరో ఆరు నెలలయినా తమను కొనసాగించేలా చూడాలని కోరారన్న ప్రచారం జరుగుతుంది. 2019తో పోల్చితే ఇప్పుడు పరిస్థితులు అనుకూలంగా లేవని, అందుకే జగన్‌ కూడా మంత్రివర్గ ప్రక్షాళన అంశాన్ని వాయిదా వేశారని కొందరు చెబుతున్నారు. గతంలో చెప్పినట్లు ‘వందశాతం’ కాకుండా... కొందరు సీనియర్లను మాత్రం కొనసాగిస్తూ .. మిగిలిన వారి స్థానంలో కొత్తవారిని నియమించాలన్న ఆలోచనలో సీఎం ఉన్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే  మంత్రి పదవులను ఆశిస్తున్న ఎమ్మెల్యేలు తాజా శాసనసభా సమావేశాల్లో ముఖ్యమంత్రిని పోటీలు పడి, శ్రుతిమించి మరీ ప్రశంసించారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చంద్రబాబును వ్యక్తిగతంగా దూషించడమూ ఇందులో భాగమేనన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయ విశ్లేషకులు మాత్రం.. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ విషయంలో జగన్‌ తాను అనుకున్న మార్గంలోనే వెళతారని, ఎవరి సలహాలూ సూచనలూ పాటించబోరని చెబుతున్నారు.

Updated Date - 2021-11-30T08:59:29+05:30 IST