విసుగూ వేసటా లేని ‘మంచిరోజులు’ వచ్చేనా?

ABN , First Publish Date - 2021-05-21T06:14:56+05:30 IST

గతఆగస్టులో జాతి మన‍ఃస్థితి (మూడ్ ఆఫ్ ది నేషన్) తెలుసుకోవడానికి నిర్వహించిన ఒక ఒపీనియన్ పోల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమితమైన ప్రజాదరణ...

విసుగూ వేసటా లేని ‘మంచిరోజులు’ వచ్చేనా?

గతఆగస్టులో జాతి మన‍ఃస్థితి (మూడ్ ఆఫ్ ది నేషన్) తెలుసుకోవడానికి నిర్వహించిన ఒక ఒపీనియన్ పోల్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అమితమైన ప్రజాదరణ ఉందని వెల్లడయింది. దీనిపై సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఒకరు మాకు ఫోన్ చేసి ‘మీరు ఎందుకు ఈ తప్పుడు సర్వేలు నిర్వహిస్తారు? లాక్‌డౌన్, ఆర్థికమాంద్యం, వలసకార్మికుల విషాదాలు, జీవితాలు, జీవనాధారాల విధ్వంసం కన్పించడం లేదా? అయినా మీ పాత్రికేయ గణం ఇప్పటికీ మోదీ వ్యామోహంలో చిక్కుకుపోయి ఉన్నారు!’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సుదీర్ఘ పాత్రికేయ వృత్తి జీవితానుభవాలతో, ఒపీనియన్ పోల్ ఫలితాల విషయమై రాజకీయవేత్తలతో ఎట్టి పరిస్థితులలోను వాదోపవాదాలు చేయకూడదనే పాఠాన్ని నేర్చుకుని ఉన్నాను కనుక ఆ కాంగ్రెస్ నేత ఆక్షేపణకు మౌనంగా ఉండిపోయాను. కొన్ని నెలల అనంతరం బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఎన్డీఏ స్వల్ప మెజారిటీతో విజయాన్ని కైవసం చేసుకున్నప్పుడు ఆ కాంగ్రెస్ నేత మాకు మళ్ళీ ఫోన్ చేశారు. ‘లాక్‌డౌన్ సైతం ఓటర్ల తీరుతెన్నులను ప్రభావితం చేయలేకపోయిందని’ ఆయన మెల్లగా గొణిగారు. కాంగ్రెస్ నేత స్వరంలో ఒక తత్తరపాటు స్పష్టంగా ధ్వనించింది. 


2019 సార్వత్రక ఎన్నికల ముందు బీజేపీ సామాజిక మాధ్యమాల విభాగం ‘ఆయేగా తో మోదీ హి!’ (మోదీ మాత్రమే వస్తారు) అనే నినాదంతో ఒక ప్రచారోద్యమాన్ని నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అజేయుడు అనే భావనను ఓటర్ల మనస్సులో సృష్టించి, ఎన్నికల ఫలితం అనివార్యంగా మోదీకే అనుకూలంగా ఉంటుందనే నమ్మకాన్ని పాదుకొల్పే లక్ష్యంతో ఆ ప్రచారోద్యమాన్ని నిర్వహించారు. ఏదైతేనేం, గత ఏడు సంవత్సరాలుగా భారత రాజకీయాలలో నరేంద్ర మోదీ ఒక మహామేరువులా వెలుగొందారు. ఆ సర్వోత్కృష్ట నాయకుని పట్ల వ్యక్తమైన ఆరాధానాభావం ఆయన పరివేష్టితులను వామనులుగా మార్చివేసింది. ఈ పరిణామాన్నే నేను ఒకప్పుడు భారత రాజకీయాలలో ‘TIMO’ (There is modi only) అంశంగా అభివర్ణించాను. అవును, ఆయన చాలా ప్రభావశక్తిగల నాయకుడు. ఆయన చెయ్యమన్నది అంఖ్యాకులు చేసితీరతారు. చప్పట్లు కొట్టమంటే కొడతారు; దీపాలు వెలిగించమంటే వెలిగిస్తారు! అంతేనా? ఆయన కోరితే నిస్సంకోచంగా తమ జేబులోని డబ్బును తీసి ఇచ్చే వారెందరో! ఆయన కేవలం మరొక రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, ఒక మతపెద్ద లాంటివాడు; దైవసమానుడు. మద్దతుదారులు మూఢభక్తితో ఆరాధించే అసాధారణ అసాధ్యుడు. 


గమనించారా, నేను ఇక్కడ ఆలోచనాపూర్వకంగానే భూతకాలాన్ని ఉపయోగిస్తున్నాను. ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఈనెల 26వ తేదీన ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకోనున్నారు. ఒహో! ఏవీ ఆ తొలినాటి వెలుగులు? అవి మసకబారి పోతున్నాయి మరి. ఏడేళ్ళ పాలనపై పోటెత్తిన విసుగు అనండి లేదా ఒక సంవత్సర కాలంగా సతమతం చేస్తున్న వైరస్ కానివ్వండి, కారణమేదైనా ఒకటి మాత్రం వాస్తవం. తొమ్మిది నెలల క్రితం సైతం ఆయనలో ఉట్టిపడిన అమోఘ ఆకర్షణ శక్తి ఇప్పుడు పూర్తిగా కన్పించడం లేదు. ఇప్పటికీ ఆయనే నెంబర్ 1 నాయకుడు. అయితే అంతకంతకూ అభాసుపాలవుతూ మానవమాత్రుడుగా కనిపిస్తున్నారు. ఏడాది క్రితం టెలివిజన్‌లో దేశ ప్రజలను ఉద్దేశించి మోదీ వెలువరించిన ప్రసంగాన్ని గుర్తుచేసుకోండి. సర్వ శక్తిమంతుడైన ఒక సుప్రీం కమాండర్ ఆజ్ఞలా అది ఆసేతుహిమాచలం ప్రతిధ్వనించింది. అసంఖ్యాక భారతీయులు కొవిడ్–19పై ‘మహా-భారత్’ యుద్ధాన్ని ప్రకటించేందుకు అది పురిగొల్పలేదా? మరి ఇప్పుడో? ప్రజల మధ్య ఆయన ఎక్కువగా కన్పించడం లేదు. అసలు ప్రజలతో సంభాషించడమే లేదు. సువిశాల భారతావనిని సంక్షుభిత పరుస్తున్న అనూహ్య విషాదం కలిగించిన వ్యాకులత, అనిశ్చితిని ఆయన మౌనం బయటపెట్టింది. ఏడాది క్రితం ‘త్యాగం’ చేసి, లాక్‌డౌన్ లోకి వెళ్ళమని జాతిని ఆదేశించడం ద్వారా దేశ ప్రజల విధేయతను ప్రధానమంత్రి డిమాండ్ చేసి, పొందగలిగారు. అయితే ఇప్పుడు ఆయన చేస్తున్న హెచ్చరికలలో చిత్తశుద్ధి కొరవడినట్టుగా కనిపిస్తోంది. ఓట్ల కోసం కొవిడ్ నిబంధనలను నాయకులే పూర్తిగా ఉల్లంఘించినప్పుడు, వాక్సిన్ విధానం రూపకల్పనలో అసమర్థత, అశక్తత చూపినప్పుడు ప్రజలు వారి మాటను ఎందుకు పాటించాలి? వినయ విధేయతలతో వారి ఆజ్ఞలను ఎందుకు అనుసరించాలి?


మన ప్రధానమంత్రులకు సంబంధించి ఏడు సంవత్సరాల పాలన అనేది ఒక ఆసక్తికరమైన విశేషం. 14వ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీ ఏడు సంవత్సరాల పాలనను పూర్తిచేసుకునే నాలుగో ప్రధానమంత్రిగా చరిత్ర ప్రసిద్ధుడు అవనున్నారు. తొలి ప్రధాని జవహర్ లాల్ ఈ దేశ ప్రజల ఆదరాభిమానాలను అనంతంగా పొందిన ఆదర్శ నాయకుడు. అయితే ఆయన రాజకీయ వైభవం, దేశ ప్రథమ సార్వత్రక ఎన్నికలలో విజయం సాధించిన ఏడు సంవత్సరాల అనంతరం, 1959లో మొదటిసారి మసకబారింది. కేరళలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం, చైనాతో సరిహద్దు వివాదం నెహ్రూ ప్రతిష్ఠను గణనీయంగా దెబ్బతీశాయి. 1962లో చైనాతో యుద్ధంలో భారత్ అవమానకరమైన పరాజయం నెహ్రూ చరిత్రకు ఒక తీరని కళంకంగా మిగిలిపోయింది. ఆయన కుమార్తె ఇందిరాగాంధీ నాయకత్వానికి, ప్రధానమంత్రి పదవి చేపట్టిన ఏడు సంవత్సరాలకు ధరల పెరుగుదల, తడబడుతున్న దేశ ఆర్థికం, తీవ్రమవుతున్న రాజకీయ సంక్షోభం పెనుసవాళ్లు విసిరాయి. వాటిని ఎదుర్కొనే క్రమంలో ఆమె చేసిన తప్పులు 1975లో అత్యవసర పరిస్థితి విధింపునకు దారితీశాయి. ఆ ‘చీకటి రోజులు’ ఆమె చరిత్రలో మాయనిమచ్చగా మిగిలిపోయాయి. డాక్టర్ మన్మోహన్‌సింగ్ సైతం, ‘యాదృచ్ఛిక’ ప్రధానమంత్రి అయిన ఏడు సంవత్సరాల అనంతరం (2011లో) అవినీతి నిర్మూలన లక్ష్యంతో ప్రజ్వరిల్లిన అన్నా హజారే ఉద్యమం తాకిడితో అంతిమంగా పరాజితుడయ్యారు. 


మోదీ ఇప్పుడు ఒక కొత్త చారిత్రక మలుపులో ఉన్నారు. దేశ ప్రజలకు ‘అచ్చేదిన్’ (మంచి రోజులు) సాధిస్తాననే హామీతో అధికారానికి వచ్చిన ఏడు సంవత్సరాలకు ఆయన ఒక తీవ్రసంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. సంప్రదాయ సామాజిక ఆధిపత్యాలకు, నవీన రాజకీయ, ఆర్థిక ప్రాబల్యాలకు వ్యతిరేకంగా పోరాడే జనప్రియ నేతగా ఆయన తొలుత ప్రజల దృష్టిని విశేషంగా ఆకట్టుకున్నారు. అతి సామాన్య మూలాల నుంచి ప్రభవించి, మతనిష్ఠను జాతీయవాద అభినివేశంతో మేళవించిన ఉదాత్తుడిగా పేరు పొందారు. అవినీతి నిర్మూలనకు కంకణం కట్టుకున్న ధర్మ యోధుడుగా, అభివృద్ధిసాధకుడుగా విశాల భారతావనిని విశేషంగా ఆకట్టుకున్నారు. ఏడు సంవత్సరాల పాటు ఈ కీర్తిప్రతిష్ఠలను అత్యంత నేర్పుతో కాపాడుకున్నారు. ఎటువంటి నిందలకు ఆస్కారం లేకుండా వెలుగొందారు. ప్రధానమంత్రి వ్యక్తిత్వాన్ని సంరక్షించిన ఈ ప్రకాశమాన మేలి ముసుగును కొవిడ్–-19 అల ప్రప్రథమంగా తొలగించివేసింది.


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల దేశప్రజల్లో సౌహార్ద్రభావం ఇప్పటికీ అపారంగా ఉన్నది. మోదీ యుగం అర్ధాంతరంగా ముగియనున్నదనే భావానికి ఎవరైనా వస్తే అది అవివేకమే అవుతుంది. అలా విశ్వసించడమంటే, గత ఆగస్టులో ఒపీనియన్ పోల్‌లో మోదీకి వ్యక్తమయిన మద్దతును ప్రశ్నించిన కాంగ్రెస్ నాయకుడిలా తప్పు చేయడమే అవుతుంది. అంతిమంగా మోదీ ఆకర్షణ శక్తి మన్నిక అనేది చాలవరకు ప్రతిపక్షాల అనైక్యత మీద కూడా ఆధారపడి ఉంది. 


కొవిడ్‌పై యుద్ధంలో వలే, ప్రజాజీవితంలో నిర్లక్ష్యం, అలసత్వం చూపడమనేది ఒక ప్రమాదకర వైఖరి అవుతుంది. రాబోయే సంవత్సరం (2022) ఒక విధంగా నిర్ణయాత్మకమైనది. ఒక ఏడాదిలోగా శాసనసభ ఎన్నికలు జరగనున్న ప్రతి రాష్ట్రంలోనూ కొవిడ్ నీడ సువిశాలంగా పరచుకుని ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో కొవిడ్ నీడ మరింత విస్తృతంగా, స్పష్టంగా కన్పిస్తోంది. ఇటీవలి సంవత్సరాలలో భారత రాజకీయాలలో నరేంద్ర మోదీ, భారతీయ జనతాపార్టీ ప్రాబల్య ప్రాభవాలకు ఆ రాష్ట్రమే కీలకం కదా. 2014లో వారణాసి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయం తీసుకోవడం ద్వారా నరేంద్ర మోదీ మొట్టమొదటిసారి తనను తాను జాతీయనాయకుడిగా సుప్రతిష్టీకరించుకున్నారు. ‘ముఝే తో మా గంగా నే బులాయ హై’ (గంగా మాత నన్ను పిలిచింది) అని స్వయంగా చెప్పుకోవడం ద్వారా మోదీ తన నాయకత్వాన్ని సమున్నతం చేసుకున్నారు. అవును, మోదీని గంగమ్మే ఆహ్వానించింది. అయితే ఇప్పుడు ఆ పవిత్ర ప్రవాహినిలో మృతశరీరాలు తేలియాడుతున్నాయి. గంగలో స్నానించి అవి నదీతీరానికి కొట్టుకు వస్తున్నాయి. వారణాసిలోని స్నానఘట్టాలలోనూ, ఉత్తరప్రదేశ్‌లోని ఇతర పట్టణాలు, నగరాలలోనూ గంగా తీరాన అవి పోగుపడుతున్నాయి. దిక్కులేని ఆ మృత దేహాల నుంచి వెలువడుతున్న దుర్వాసన కుళ్ళిపోయిన ఒక రాజకీయ వ్యవస్థను గుర్తుచేస్తోంది. దేశ ప్రజలకు అపారంగా వాగ్దానాలను వర్షిస్తూ వాస్తవంగా ఒకటో రెండో హామీలు మాత్రమే, అదీ అరకొరగా నెరవేరుస్తున్న రాజకీయ వ్యవస్థ ఎంతకాలం గుబాళిస్తుంది? ఈ యథార్థాన్ని దృష్టిలో ఉంచుకొని పౌర జీవితపు కఠోర వాస్తవాలను నిరాకరించే అలవాటునుంచి నరేంద్ర మోదీ బయటపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నిజాలను నిజాలుగా ధైర్యంతో అంగీకరించి తీరాలి. తన ఏడేళ్ళ పాలనలో జరిగిన తప్పులను సరిదిద్దుకోవాలి. అవి మహోగ్రమైన రాజకీయ అంటువ్యాధిగా పరిణమించి ప్రభుత్వాన్ని వెంటిలేటర్ పైకి తీసుకు వెళ్ళక ముందే మోదీ మేల్కొని ఒక కొత్త ప్రస్థానాన్ని ప్రారంభించాలి. 


రాజ్‌దీప్‌ సర్దేశాయి

(వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్‌్ట)

Updated Date - 2021-05-21T06:14:56+05:30 IST