Rahul Dravid: సీనియర్ జట్టు హెడ్ కోచ్ అవుతాడా?

ABN , First Publish Date - 2021-07-31T02:33:53+05:30 IST

భారత జూనియర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్ సీనియర్ జట్టుకు కూడా కోచ్ కావాలని మాజీ క్రికెటర్లు అభిలషిస్తున్నారు. ఈ విషయంలో

Rahul Dravid: సీనియర్ జట్టు హెడ్ కోచ్ అవుతాడా?

న్యూఢిల్లీ: భారత జూనియర్ జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్న రాహుల్ ద్రావిడ్ సీనియర్ జట్టుకు కూడా కోచ్ కావాలని మాజీ క్రికెటర్లు అభిలషిస్తున్నారు. ఈ విషయంలో తన అభిప్రాయాన్ని ద్రావిడ్ గతంలోనే కుండబద్దలుగొట్టాడు. అయినప్పటికీ ఈ ఊహాగానాలకు మాత్రం తెరపడడం లేదు. 48 ఏళ్ల ద్రావిడ్ శ్రీలంకలో పర్యటించిన భారత జట్టుకు కోచ్‌గా వ్యవహరించాడు. సీనియర్ జట్టుకు కోచ్‌గా పనిచేయడం ద్రవిడ్‌కు ఇదే తొలిసారి.  


హెడ్‌కోచ్‌గా శాస్త్రి పదవీకాలం టీ20 ప్రపంచకప్ తర్వాత ముగుస్తుంది. ఈ నేపథ్యంలో సీనియర్ జట్టుకు కోచ్‌గా పనిచేసే విషయంలో ద్రావిడ్ మనసులో ఏముందో తెలుసుకోవాలని బీసీసీఐ యోచిస్తోంది. నిన్న శ్రీలంకతో జరిగిన చివరి టీ20 అనంతరం ద్రావిడ్ మాట్లాడుతూ సీనియర్ జట్టుకు కోచ్‌గా వెళ్లడంపై అడిగిన ప్రశ్నకు స్పష్టమైన సమాధానం ఇచ్చాడు. ‘‘సీనియర్ జట్టు కోచ్‌గా అవకాశం వస్తే మీరు ఓకే చెబుతారా?’’ అన్న ప్రశ్నకు ద్రావిడ్ బదులిస్తూ.. ‘‘నిజం చెప్పాలంటే నేను అంతదూరం ఆలోచించడం లేదు’’ అని బదులిచ్చాడు. 


ద్రావిడ్ ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీకి డైరెక్టర్‌గా ఉన్నాడు. ఈ అకాడమీని త్వరలో బెంగళూరు విమానాశ్రయం సమీపంలోకి తరలించబోతున్నారు. ఆ పనులను కూడా ద్రవిడ్ పర్యవేక్షిస్తున్నాడు. ప్రస్తుతం తానేం చేస్తున్నానో, దానిపట్ల తాను పూర్తి సంతృప్తిగా ఉన్నట్టు ద్రావిడ్ పేర్కొన్నాడు. అండర్-19, ఇండియా-ఎ వ్యవస్థకు ద్రావిడ్ ఇన్‌చార్జ్ కూడా. శ్రీలంక పర్యటనలో ఉన్న క్రికెటర్లలో చాలామంది గతంలో ద్రవిడ్‌తో కలిసి పనిచేసిన వారే. 


హెడ్ కోచ్‌గా పనిచేసిన ఈ అనుభవాన్ని ఎంజాయ్ చేశానని పేర్కొన్న ద్రావిడ్.. కుర్రాళ్లతో కలిసి పనిచేయడాన్ని ఇష్టపడినట్టు చెప్పాడు. తనకు ఇంతకుమించిన ఆలోచనలు లేవని చెబుతూ సీనియర్ జట్టుకు హెడ్ కోచ్ అయ్యే అవకాశం లేదని తెగేసి చెప్పాడు. తాను పూర్తిస్థాయిలో చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని, వాటిపై దృష్టి సారించాలని అన్నాడు. అయితే, బీసీసీఐ మాత్రం ద్రావిడ్‌ను ఎలా అయినా కోచ్ పదవికి ఒప్పించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.

Updated Date - 2021-07-31T02:33:53+05:30 IST