ప్రభుత్వరంగం దివాలా తీస్తుందా?

ABN , First Publish Date - 2021-03-10T06:44:12+05:30 IST

సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలపై ఎవరికీ పెద్దగా ఆసక్తి లేనట్లు కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ...

ప్రభుత్వరంగం దివాలా తీస్తుందా?

సోమవారం నుంచి ప్రారంభమైన పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలపై ఎవరికీ పెద్దగా ఆసక్తి లేనట్లు కనిపిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారం, వ్యూహరచనపై దృష్టి కేంద్రీకరించారు. పార్లమెంట్ సమావేశాలను వాయిదా వేయాలని దాదాపు వందమందికి పైగా ఎంపిలు లేఖలు రాశారని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. బిల్లులు ప్రవేశపెట్టే పనే లేకపోతే ఈ పాటికి బెంగాల్‌లో ఉండేవాడినని కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి రవిశంకర ప్రసాద్ తన సహచర ఎంపితో చమత్కరించారు. అయినా ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ పార్లమెంట్ పై సర్కార్‌కు పెద్దగా ఆసక్తి లేనట్లు కనపడుతోంది. అనుకున్న బిల్లులు ఆమోదించుకోవడానికే ఉభయ సభలను ప్రధానంగా ఉపయోగించుకుంటున్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు, ఎన్నికల వ్యూహరచన, ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడం, ప్రజా ప్రతినిధులను ప్రలోభపెట్టడం తప్ప ప్రభుత్వాధినేతలకు పెద్దగా పనిలేనట్లు కనిపిస్తున్నది. ప్రధానమంత్రి కార్యాలయం వెబ్ సైట్‌ను చూస్తే మోదీ ప్రతి రోజూ సగటున రెండు ఉపన్యాసాలు ఇస్తున్నట్లు అర్థమవుతుంది. ఉపన్యాసాల ద్వారా ప్రతిరోజూ వార్తల్లో కెక్కే ప్రధానమంత్రి మనకు లభించడం మన సుకృతం అనుకోవడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ఇక దేశమంతా ప్రైవేటీకరణ చేసిన తర్వాత ప్రభుత్వాధినేతలకు ఉపన్యాసాలు తప్ప ఇతరత్రా వేరే పనులు ఉండే అవకాశాలు లేవు.


విశాఖ ఉక్కు కర్మాగారాన్ని పూర్తిగా అమ్మి వేయాలని 2021 జనవరి 27న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నప్పటికీ దాని గురించి ఆరోజు వెల్లడించలేదు, ఉక్కు, ఆర్థిక మంత్రిత్వ శాఖ అధికారులను అడిగితే కూడా చెప్పడానికి నిరాకరించారు. పత్రికలకే ఈ విషయం ఉప్పంది వార్తలు రాసేవరకూ జనానికి తెలియదు. ఇంత రహస్యంగా ఒక కీలక నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? ఈ విషయంలో లోపాయికారి ఒప్పందాలకు ఏమైనా ఆస్కారం ఉన్నదా? అన్న అనుమానాలకు తావిచ్చారు. విశాఖ ఉక్కు ను అమ్మివేయాలని నిర్ణయం తీసుకున్న దాదాపు నెలన్నర తర్వాత సోమవారం నాడు ఆర్థిక మంత్రి అధికారికంగా ఈ విషయం ప్రకటిస్తూ ఉద్యోగుల న్యాయపూరిత ఆందోళనలను తాము పట్టించుకుంటామని హామీ ఇచ్చారు. ఏది న్యాయపూరితమో, ఏది అన్యాయపూరితమో ఎవరు నిర్ణయిస్తారు? దేశ రాజధాని సరిహద్దుల్లో వందరోజులకు పైగా నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్న రైతుల ఆందోళన న్యాయపూరితం కాదా? ఆర్థికమంత్రి విశాఖ ఉక్కు గురించి చేసిన ప్రకటన వార్త టీవీల్లో రాగానే విశాఖ కార్మికులు, ప్రజలు భగ్గుమన్నారు. వారి ఆందోళన తీవ్రతరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయినా తమకు సమీపంలో ఆర్తనాదాలు చేస్తున్న రైతుల గురించి పట్టించుకోని ఢిల్లీ పెద్దలు విశాఖ భగ్గుమంటే పట్టించుకుంటారా? వారి మనస్సంతా అయిదు రాష్ట్రాలు, ముఖ్యంగా పశ్చిమబెంగాల్ లో ఓట్లను ఆకర్షించడంపైనే కేంద్రీకృతమైంది. నిజానికి విశాఖ ఉక్కు ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నెలరోజుల నుంచి ఆందోళన జరుగుతున్న విషయమే దృష్టికి వచ్చి ఉంటే ఆర్థిక మంత్రి ఇంత నిర్భీతిగా పార్లమెంట్‌లో స్పష్టం చేసేవారా? అన్న ప్రశ్నకు తావు లేదు, ఎందుకంటే ఎవరు ఎన్ని చెప్పినా తాను అనుకున్నది చేయడానికే ప్రభుత్వం సిద్ధపడిందని అర్థం చేసుకోవాలి.


దేశ ఆర్థికవ్యవస్థను పీడిస్తోన్న అన్ని రుగ్మతలకూ ప్రైవేటీకరణ అనేది ఔషధం కాదని అనేకమంది ఆర్థిక వేత్తలు స్పష్టం చేస్తున్నారు. బ్యాంకుల్ని అమ్మడం పరిష్కారం కాదని 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్‌కెసింగ్ కూడా చెప్పారు. యాజమాన్యం మారినంత మాత్రాన సంస్థల రూపురేఖలు మారవని రిజర్వు బ్యాంకు మాజీ డిప్యూటీ గవర్నర్ ముంద్రా అన్నారు. ప్రభుత్వం అసమర్థతతో చేతులెత్తేసి ప్రైవేటీకరణ వంటి సరళ మార్గాన్ని అవలంబించడం సరైంది కాదని రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామరాజన్ తన పుస్తకం ‘వాట్ ఎకానమీ నీడ్స్ నౌ’ లో పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను నైపుణ్యంతో నడిపేందుకు అనుమతించకుండా వాటిని నష్టాలలో తోస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు, బ్యాంకులు స్వతంత్రంగా, స్వేచ్ఛగా పనిచేసేందుకు అనుమతించాలని, అంతర్గత ప్రతిభకు ప్రోత్సాహం ఇస్తూ ప్రపంచ స్థాయి ప్రతిభను ఆకర్షించేందుకు అధిక జీతాలు చెల్లించాలని పిజె నాయక్ కమిటీ చేసిన సూచనలను అమలు చేయాలని ఆయన సిఫార్సు చేశారు.ఈ దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకులు దేశ ఆర్థిక సామాజికాభివృద్ధికి ఎంతో దోహదం చేశాయని, ప్రైవేట్ బ్యాంకులు సామాన్య ప్రజలకు చేసిందేమీ లేదని గత ఏడాది రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ కూడా ఒక సందర్భంలో చెప్పడం గమనార్హం, 


2014 ఫిబ్రవరిలో ఛార్టర్ట్ అకౌంటెంట్లు, ఆర్థిక వృత్తి నిపుణుల సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థల్లో వృత్తి నైపుణ్యాన్ని పెంచడమే సరైన మంత్రం అని చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థలు చనిపోవడానికే పుట్టాయన్న వాదన సరైంది కాదని ఆయన అన్నారు, గుజరాత్ లో ప్రభుత్వ రంగ సంస్థల్ని వృత్తి నిపుణులతో నింపి లాభసాటిగా మార్చాం.. అని గొప్పలు చెప్పుకున్నారు. మరి ఇప్పుడా పని ఎందుకు చేయడం లేదు?


‘ప్రభుత్వరంగమా, ప్రైవేట్ రంగమా? మీరు దేనికి ప్రాధాన్యతనిస్తారు?’ అని ఆధునిక చైనా నిర్మాత డెంగ్ జియావో పింగ్‌ను అడిగితే ‘పిల్లి నల్లగా ఉంటే ఏమిటి? తెల్లగా ఉంటే ఏమిటి? అది ఎలుకల్ని పట్టాలి గాని..’ అని సమాధానమిచ్చారు. విశృంఖలమైన ప్రైవేటీకరణ సరైంది కాదని, కీలకమైన విధాన నిర్ణయాలు తీసుకునేటప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు పెట్టాలని, భాగస్వాములు, లబ్ధిదారులతో విస్తృత సంప్రదింపులు జరపాలని భారతీయ మజ్దూర్ సంఘ్ వ్యవస్థాపకుడు దత్తోపంత్ థేంగ్డీ చెప్పారు, విశృంఖల ప్రైవేటీకరణ ప్రభుత్వ రంగ సంస్థలనే కాదు, ఆర్థికవ్యవస్థను కూడా హతమారుస్తుందని ఆర్ ఎస్ ఎస్ పత్రిక ఆర్గనైజర్ 2019 జూలైలో తీవ్ర విమర్శలు గుప్పించింది. ప్రైవేట్ రంగానికి చెందిన 9 మంది వ్యక్తులను సంయుక్తకార్యదర్శులుగా నియమించడాన్ని తప్పు పడుతూ, ‘దేశం అనేది కంపెనీ కాదు’, అని ఆధునిక పెట్టుబడిదారీ సిద్దాంతవేత్త పాల్ క్రుగ్ మాన్ చేసిన వ్యాఖ్యల్ని ఈ పత్రికలో ఉటంకించారు. ‘మనం విదేశీ ఆలోచనల్నే కాదు, పెట్టుబడిదారీ వ్యవస్థ వైఫల్యాలను కూడా దిగుమతి చేసుకుంటున్నాం..’ అని ఆర్‌ఎస్‌ఎస్ విమర్శించింది,


దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టిన మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు కూడా బెంగళూరులో జరిగిన ఏఐసిసి ప్లీనరీలో ప్రవేశపెట్టిన పత్రంలో ప్రభుత్వరంగ సంస్థలను అమ్మే క్లియరెన్స్ సేల్ పద్దతి సరైంది కాదన్నారు. ‘ఒకసారి అమ్మివేసిన తర్వాత భవిష్యత్తులో ఏ ప్రభుత్వమూ దీన్ని మార్చలేదు, ఉదాహరణకు 1991లో తనఖా పెట్టిన బంగారాన్ని మనం విడిపించి తెచ్చుకోగలిగాం, తనఖా బదులు అమ్మి వేసి ఉంటే మనం ఏమి చేయలేకపోయే వాళ్లం’ అని ఆయన అన్నారు. ప్రభుత్వరంగానికి సంబంధించిన నిర్ణయాలు కేవలం ప్రభుత్వానికో, రాజకీయ పార్టీలకో సంబంధించినవి కావని, ప్రజల ఆస్తికి ధర్మకర్తగా ఉండాల్సిన ప్రభుత్వానికి ఆ ఆస్తిని అమ్మే హక్కు లేదని ఆయన చెప్పారు.


ఎల్‌ఐసి మాత్రమే కాదు, దేశంలో ప్రభుత్వరంగ సంస్థల పరిస్థితి ప్రభుత్వం చిత్రిస్తున్నంత దారుణంగా ఏమీ లేదు. పార్లమెంట్ కు ప్రభుత్వం ఇచ్చిన వివరాల ప్రకారమే దేశంలోని 366 ప్రభుత్వరంగ సంస్థల్లో కేవలం 43 మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. నష్టాల బారిన ఉన్న ప్రభుత్వరంగ సంస్థల్లో కీలకమైన సంస్థల్ని ప్రభుత్వమే నష్టాల్లో ముంచిందనడానికి సాక్ష్యాధారాలు ఉన్నాయి, 2009 వరకు ప్రభుత్వ రంగ టెలికం పరిశ్రమ లాభాలతో నడిచేది. బిఎస్ఎన్‌ఎల్‌కు పెద్ద ఎత్తు ఆస్తులున్నప్పటికీ దానికి బ్యాంకులు రుణాలు ఇవ్వలేదు, ఆధునికీకరణను ఉద్దేశపూర్వకంగానిలిపిశారు. అనేక ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటీకరణ చేసే ఉద్దేశంతోనే వాటికి సిఇఓలను నియమించారు. విమానాశ్రయాలు, రేవులను కూడా పద్ధతి ప్రకారం నష్టాల్లో నెట్టివేస్తున్నారు.


సోషలిస్టు వాస్తవికతకు ప్రత్యామ్నాయంగా పెట్టుబడిదారీ వాస్తవికత అన్న పదాన్ని సృష్టించిన బ్రిటిష్ మేధావి మార్క్ ఫిషర్ ‘కేపిటలిజానికి ప్రత్యామ్నాయం లేదా?’ అని వాపోయారు, పెట్టుబడిదారీ వ్యవస్థకు ఎలాంటి నిబంధనలూ ఉండవని, అన్ని సంస్కృతులను విధ్వంసం చేస్తుందని, అంతంలేని నిర్వికార మహా రాక్షసిలా వ్యవహరిస్తుందని ఆయన అభివర్ణించారు. తీవ్ర నిరాశా నిస్పృహలకు గురై తన 49వ ఏట ఆత్మహత్య చేసుకున్న ఈ మేధావి ఎంతమంది మోదీ లాంటి నేతల్ని గమనించి ఉంటారో?

ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Updated Date - 2021-03-10T06:44:12+05:30 IST