స్టాంపుల ధరలకు రెక్కలు

ABN , First Publish Date - 2020-10-29T06:36:38+05:30 IST

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపుల విక్రయం నిలిపి వేయటంతో స్టాంపుల కొరత ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకొని స్టాంపులు విక్రయించే పలువురు వెండర్లు ప్రస్తుతం తమ వద్ద ఉన్న స్టాంపులను

స్టాంపుల ధరలకు రెక్కలు

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో విక్రయాల నిలిపివేత

అధిక ధరలకు అమ్ముతున్న వెండర్లు


ఖమ్మం కార్పొరేషన్‌, అక్టోబరు 28: రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో  నాన్‌ జ్యుడీషియల్‌ స్టాంపుల విక్రయం నిలిపి వేయటంతో స్టాంపుల కొరత ఏర్పడింది. దీన్ని అవకాశంగా తీసుకొని స్టాంపులు విక్రయించే పలువురు వెండర్లు ప్రస్తుతం తమ వద్ద ఉన్న స్టాంపులను అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ధరణి పోర్టల్‌ ద్వారా జరిగే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లకు దస్తావేజులు అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. కాగా వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లపై స్పష్టత లేదు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిపివేయటంతో నాన్‌-జ్యుడీషియల్‌ స్టాంపుల విక్రయాలు ఆపివేశారు


రెండు నెలలకు ఒకసారి..

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల కార్యాలయాల్లో ప్రతీ రెండు నెలలకు ఒకసారి వెండర్లకు రూ.20, రూ.50, రూ.100 విలువగల స్టాంపులను విక్రయిస్తుంటారు. అందుకు సంబంధించి వెండర్లు చలానా రూపంలో సొమ్ములు చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చలానాకు సంబంధించిన సైట్‌ను నిలిపివేశారు. దీంతో నాన్‌- జ్యుడీషియల్‌ స్టాంపుల విక్రయాలు ఆగిపోయాయి. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో సుమారు 150కు పైగా లైసెన్స్‌ కలిగిన స్టాంప్‌వెండర్లు ఉన్నారు. వారు రెండు నెలలకు ఒకసారి సుమారు రూ.కోటి విలువైన స్టాంపులు కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం స్టాంపుల విక్రయాలను నిలిపి వేయటంతో ఉన్న స్టాంపులకు గిరాకీ ఏర్పడింది. దీంతో స్టాంపులను అధిక ధరలకు అమ్ముతున్నట్లు కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


స్టాంపుల కొరతతో..

ప్రస్తుతం రూ.20, రూ.50 విలువ గల స్టాంపులు దొరకటం లేదు. ఉభయ జిల్లాల్లో ఈ కొరత తీవ్రంగా ఉంది. తమ వద్ద కేవలం రూ.100 విలువగల స్టాంపు పేపర్లు మాత్రమే ఉన్నాయని కొంతమంది వెండర్లు చెబుతూ సదరు స్టాంపులను రూ,150కు విక్రయిస్తున్నట్లు కొనుగోలుదారులు చెబుతున్నారు. కాగా ఉన్న రూ.20, రూ.50 విలువగల స్టాంపులను కూడా ఎక్కువ ధరలకే అమ్ముతున్నారు. ప్రస్తుతం ఏ స్టాంప్‌ అడిగినా, రూ.100 విలువ గల స్టాంప్‌ పేపర్‌నే విక్రయిస్తున్నారు. అఫిడవిట్లు వంటి వాటిని రూ.20 విలువ గల నాన్‌-జ్యుడీషియల్‌ స్టాంప్‌ పేపర్‌ పైనే ఇస్తుంటారు. సదరు వాటికోనం కూడా ఎక్కువ దరకు స్టాంప్‌ పేపర్లు కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ధరణి పోర్టల్‌ వల్ల రిజిస్ట్రేషన్‌ శాఖ స్టాంపుల విక్రయం వల్ల వచ్చే ఆదాయం కోల్పోగా, వెండర్లు మాత్రం అధిక ధరలతో విక్రయాల ద్వారా జేబులు నింపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.

Updated Date - 2020-10-29T06:36:38+05:30 IST