ఆరు గజాల ఆత్మవిశ్వాసం!

ABN , First Publish Date - 2020-08-03T07:39:53+05:30 IST

పని ఒత్తిడి, కార్పొరేట్‌ ఉద్యోగం ఆమెలో దాగిన కళాత్మకతను మసకబార్చాయి! అయితే రంగులు, డిజైన్ల పట్ల ఆసక్తి, ఆపేక్ష ఆమె చీర కొంగు పట్టుకుని ఉద్యోగం నుంచి చీరల ప్రపంచం వైపు నడిపించాయి!

ఆరు గజాల ఆత్మవిశ్వాసం!

పని ఒత్తిడి, కార్పొరేట్‌ ఉద్యోగం ఆమెలో దాగిన కళాత్మకతను మసకబార్చాయి! అయితే రంగులు, డిజైన్ల పట్ల ఆసక్తి, ఆపేక్ష ఆమె చీర కొంగు పట్టుకుని ఉద్యోగం నుంచి చీరల ప్రపంచం వైపు నడిపించాయి! దేశంలోని విభిన్న చేనేత కళాకారుల తోడ్పాటుతో ఆరుగజాల అందమైన చీరలకు రూపం ఇవ్వాలని సంకల్పించింది! ‘6 యార్డ్స్‌ అండ్‌ మోర్‌’ పేరుతో ప్రారంభించిన ఆ చీరల వ్యాపారానికి ఇప్పుడు రారాణి... నోయిడాకు చెందిన ఇప్సికా దాష్‌! తన రంగుల ప్రపంచం గురించి ఆమె ఏమంటోందంటే...


‘‘నాకు రంగులు, డిజైన్ల పట్ల మక్కువ ఎక్కువ. దాంతో ఆ ఆసక్తిని బొమ్మలు గీయడంలో, ధరించే దుస్తుల్లోనూ కనబరిచేదాన్ని. వాటికి నా స్నేహితుల ప్రశంసలు లభించేవి. అయితే ఆ ఆసక్తిని అభిరుచికే పరిమితం చేసి, సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి అడుగుపెట్టాను. ఆ క్రమంలో ‘ఇన్ఫోసిస్‌’ లాంటి బహుళజాతి సంస్థల్లో పనిచేశాను. కానీ ఆ పని ఒత్తిడి తట్టుకోలేక,  బెంగళూరులో ‘టెస్ట్‌మైండ్‌’ పేరుతో సొంత కంపెనీ ప్రారంభించాను. వృత్తినైపుణ్యాన్ని పెంచుకోవడంలో ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇచ్చే సంస్థ ఇది. ఆ సమయంలో మావారు ఉద్యోగపరంగా బెంగళూరు నుంచి నోయిడాకు మకాం మార్చారు. దాంతో ఆయనతో పాటు నేనూ నోయిడాకు వచ్చేశాను. దాంతో ‘టెస్ట్‌మైండ్‌’ సంస్థ మూతపడింది. అయితే నోయిడాలో అడుగపెట్టిన తర్వాత నాకు దొరికిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నా. అప్పుడే నాలో ఉన్న కళాకారిణికి రెక్కలు తొడిగాను.


మారుమూల కళాకారులు తోడ్పాటుతో...

నాకున్న సృజనాత్మకతకు వ్యాపార అనుభవాన్ని జోడించి ‘6 యార్డ్స్‌ అండ్‌ మోర్‌’ చీరల వ్యాపారం మొదలుపెట్టాను. మన దేశంలో మారుమూల గ్రామాల్లో ఎంతో నైపుణ్యం కలిగిన విభిన్న చేనేత కార్మికులు ఉన్నారు. వారి కళలు ఆయా ప్రాంతాలకే పరిమితమైపోతున్నాయి. వాళ్లందరి సృజనను ఉపయోగించుకుని, చీరలు తయారుచేసి ప్రపంచానికి పరిచయం చేయాలని సంకల్పించాను. అందుకోసం దేశం మొత్తం తిరిగి, సంప్రదాయ చేనేత కళలు, చేతివృత్తులను జాగ్రత్తగా పరిశీలించాను. అలా అసోం, బెంగాల్‌, బీహార్‌, మణిపూర్‌, ఒడిశాతో పాటు, దక్షిణ భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలనూ సందర్శించాను. అలాగే లక్నో, వారణాసి, మధ్యప్రదేశ్‌, మహేశ్వర్‌, మహారాష్ట్ర, రాజస్థాన్‌లకూ వెళ్లాను. ఈ ప్రాంతాల్లో తయారయ్యే సంప్రదాయ చేనేత కళాకృతులు, చీరలన్నీ వేటికవి ప్రత్యేకం. వీటికి కొంత ఆధునికత జోడించి, అన్ని తరగతుల మహిళలకూ అందుబాటులోకి తీసుకురాగలిగితే అటు చేనేత కళాకారుల నైపుణ్యానికి దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావొచ్చు అనిపించింది. అలా చేనేత పరిశ్రమకు నావంతు చేయూత ఇచ్చే ప్రయత్నం చేశాను.


బోలెడన్ని ఉత్పత్తులు!

‘6 యార్డ్స్‌ అండ్‌ మోర్‌’ కోసం చీరలతో పాటు వస్త్రాలు, దుపట్టాలు, స్టోల్స్‌ తయారుచేస్తాను. అలాగే టెర్రాకోట, జాతివజ్రాలను పోలిన రాళ్లతో నగలు, సీసం లేకుండా తయారుచేసిన ఆభరణాలు, చేతి బ్యాగులు, ఇక్కత్‌, కలంకారీ ప్రింట్‌లు, టేబుల్‌ రన్నర్స్‌, కోస్టర్‌ సెట్స్‌, బెడ్‌షీట్లు... ఇలా ఇంటికి అవసరమైన వస్తువులు కూడా మా దగ్గర లభిస్తాయి. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌, వాట్సాప్‌... ఇలా సామాజిక మాధ్యమాలే వేదికలుగా ఉత్పత్తుల అమ్మకాలు జరుపుతుంటాం.


ఎన్నారైల కోసం..

మన చేనేత చీరలకు విదేశాల్లో గిరాకీ ఎక్కువ. విదేశాల్లో ఉండే మహిళలకు ఈ చీరలను అందుబాటులోకి తీసుకురావడం కోసం వారి అభిరుచికి తగ్గట్టు ‘ప్రవాసీ’ పేరుతో చీరలను రూపొందిస్తున్నాను. విదేశాల్లో ఉండే భారతీయులు ప్రత్యేక సందర్భాల్లో దేశవాళీ సంప్రదాయ చీరలకే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఎక్కువగా నలిగిపోకుండా ఉండేలా, పట్టు కన్నా కాటన్‌ ఎక్కువగా ఉపయోగించి చీరలను నేయిస్తాను. అలాగే ప్రవాస భారతీయులు వెంటనే ధరించే వీలు ఉండేలా చీరలకు ఫాల్‌, పీకో, బ్లౌజ్‌ కుట్టించే ఏర్పాట్లూ చేస్తున్నాను.


సవాళ్లూ ఉన్నాయి!

‘6 యార్డ్స్‌ అండ్‌ మోర్‌’ స్టార్టప్‌ కోసం నాతో పాటు కువైట్‌లో స్థిరపడిన నా చెల్లెలు వినితా దాష్‌, ఎప్పటినుంచో దాచుకున్న 6 లక్షల రూపాయలను పెట్టుబడిగా పెట్టాం. 2016లో వ్యాపారం ప్రారంభమైనప్పటి నుంచి చెల్లి కువైట్‌ నుంచే వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఈ వ్యాపారం ప్రారంభించిన ఆరు నెలల్లోనే ఊపందుకుని, ఏడాదికి 15 నుంచి 20 శాతం అభివృద్ధి సాధించింది. అయితే ఇంతటి లాభం ఆర్జించడానికి ఎన్నో సవాళ్లను అధిగమించాను. దేశంలోని మారుమూల గ్రామాల్లో దాగి ఉన్న కళాకారులను వెతికి పట్టుకోవడానికీ, వారి కళల వెనకున్న అసలు కథలను రాబట్టడానికీ ఎంతో శ్రమ పడ్డాను. అందుకోసం ఎంతో పరిశోధన చేశాను. ఆ ప్రయత్నంలో భాష పరమైన ఇబ్బందులూ ఎదుర్కొన్నాను. అలాగే మా దగ్గర కొనుగోలు చేసిన ఉత్పత్తులు తమ అంచనాలకు దగ్గరగా లేవని చెప్పే కస్టమర్లకు తిరిగి వారికి నచ్చేలా తయారుచేసి పంపించడం, ఉత్పత్తుల నాణ్యతలో హెచ్చుతగ్గులు లేకుండా శ్రద్ధ కనబరచడం.. ఇలా ఈ రంగంలో బోలెడన్ని సవాళ్లును అధిగమించగలిగాను. మున్ముందు ప్రపంచంలోని అన్ని దేశాలకూ మా సేవలను విస్తరించాలనుకుంటున్నా. ఎప్పటికప్పుడు ట్రెండ్‌కు తగ్గట్టు మరిన్ని కస్టమైజ్డ్‌ డిజైన్‌ చీరలను తయారుచేయించడం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నా.’’


‘కొవిడ్‌-19’ సమయంలో...

మిగతా వ్యాపారాల్లాగే మా సంస్థకూ కొవిడ్‌ దెబ్బ తగిలింది. ముడిసరుకు రవాణాలో ఆటంకాలు ఏర్పడ్డాయి. దాంతో ఉత్పత్తుల కొరత తలెత్తింది. కొరియర్‌ సేవలు లేకపోవడంతో అమ్మకాలు తగ్గాయి. మరీముఖ్యంగా మార్చి నుంచి మే నెల మధ్యకాలంలో అమ్మకాలు బాగా తగ్గాయి. పార్సిళ్లను తాకడం ద్వారా కరోనా సోకుతుందనే భయంతో కస్టమర్లు ఆర్డర్లు ఇవ్వడం మానేశారు. ఇలా కరోనా మాకూ కష్టాలనూ తెచ్చిపెట్టింది. అయితే మే నుంచి ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రస్తుతం అమ్మకాలు తిరిగి ఊపందుకున్నాయి. 


స్వచ్ఛంద సేవ కూడా!

సమాజంలో భాగమైన మనం తిరిగి సమాజానికి చేతనైనంత తిరిగి ఇవ్వాలి. ఈ ఉద్దేశంతో ‘హునార్‌ ఫౌండేషన్‌’తో కలిసి పనిచేయడం మొదలుపెట్టాను. ‘6 యార్డ్స్‌ అండ్‌ మోర్‌’ స్టార్టప్‌కు వచ్చే ఆదాయంలో కొంత మొత్తాన్ని జీవనభృతి కోసం కష్టపడే మహిళలకు కొత్త మెలకువలు నేర్పడానికి ఉపయోగిస్తాను. అలాగే ప్రత్యేక అవసరాలున్న పిల్లలు, అనాధలైన పిల్లలు, పెద్దలకు చేయూత ఇవ్వడం కోసం ‘ఆస్థా’ అనే సంస్థ స్థాపించాను. 

Updated Date - 2020-08-03T07:39:53+05:30 IST