పెట్టుబడి పెట్టిన మహిళను బంధించి.. బెదిరింపులు

ABN , First Publish Date - 2020-12-22T12:01:36+05:30 IST

తమ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని

పెట్టుబడి పెట్టిన మహిళను బంధించి.. బెదిరింపులు

  • ‘మాంగళ్య’ నిర్వాహకులపై కేసు.. 


హైదరాబాద్/సనత్‌నగర్‌ : తమ వ్యాపారంలో పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని ఆ తండ్రీకొడుకులు ఓ మహిళకు ఎర వేశారు. పెట్టుబడి పెట్టిన తర్వాత లాభాలు ఇవ్వకపోగా, ఆమెను ఇంట్లో బంధించి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ సంఘటన సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఎల్లారెడ్డి గూడకు చెందిన జీడీపీ గుప్తా, అవినాష్‌ గుప్తా తండ్రీకొడుకులు. కేపీహెచ్‌బీలో మాంగళ్య షాపింగ్‌ మాల్‌ నిర్వహిస్తుంటారు. వీరికి పెట్టుబడి అవసరమై సనత్‌నగర్‌కు చెందిన ప్రమీళారాణిని సంప్రదించారు. తమ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలని ప్రాధేయపడ్డారు. లాభాల్లో వాటా ఇస్తామని ఆశ చూపించారు. దీంతో ఆమె బంధువులు, స్నేహితుల వద్ద అప్పు చేసి రూ. 25 లక్షలు పెట్టుబడి నిమిత్తం వారికి ఇచ్చింది. 


ఒప్పంద సమయంలో నిర్వాహకుల నుంచి ప్రామిసరీ నోటు, ఖాళీ చెక్కులను తీసుకున్నారు. లాభాలు ఇవ్వకపోవడంతో ఆమె పలుమార్లు వారిని ప్రశ్నించింది. దీంతో నవంబర్‌ 30న కొంత మందిని తీసుకుని ఆమె ఇంటికి వెళ్లి బంధించి బెదిరించారు. తనను ఇబ్బందులకు గురిచేస్తున్న తండ్రీ కొడుకులపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. వారిపై ఐపీసీ 406, 420, 506, సెక్షన్‌ 156 (3)ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Updated Date - 2020-12-22T12:01:36+05:30 IST