Abn logo
Oct 18 2020 @ 00:28AM

దేశాన్ని గెలిపించారు..మళ్లీ గెలిచారు

‘‘నేను ఆచరణాత్మకమైన ఆదర్శవాదిని. నేనెప్పుడూ ఉత్తమమైన దాని కోసం ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ, అది జరగడానికి ఎంత కాలం పడుతుందనే విషయంలో వాస్తవికతతో ఆలోచిస్తాను’’

..న్యూజిలాండ్‌ ప్రధానమంత్రి జసిండా ఆర్ర్డెన్‌ తన గురించి తాను చెప్పుకున్న ఈ మాటలు ఆమె  దృక్పథానికి అద్దం పడతాయి. మూడేళ్ళ కిందట న్యూజిలాండ్‌ ప్రజలకు మాత్రమే తెలిసిన జసిండా ఇప్పుడు ప్రపంచమంతటికీ సుపరిచితం. ఆ దేశంలో కిందటి ఏడాది మార్చిలో ఒక ఉగ్రవాది మారణహోమం సృష్టించిన సందర్భంలో ఆమె వ్యవహరించిన తీరు ప్రశంసలందుకుంది. కరోనా కట్టడికి ఆమె తీసుకున్న చర్యలు అంతర్జాతీయంగా మన్ననలు అందుకున్నాయి. ఉక్కు మహిళగా ఆమెకు ఖ్యాతి సంపాదించి పెట్టాయి. కరోనాపై యుద్ధంలో దేశాన్ని గెలిపించిన జసిండాను ప్రజలు భారీ మెజార్టీతో మళ్ళీ గెలిపించారు. 

న్యూజిలాండ్‌లోని హామిల్టన్‌ నగరంలో 1980లో ఒక మధ్య తరగతి కుటుంబంలో జసిండా జన్మించారు. ఆమె తండ్రి పోలీసు అధికారి. తల్లి ఒక బడి క్యాంటిన్లో పని చేసేవారు. జసిండా కాలేజీలో చదువుతున్నప్పుడు బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌లో విద్యార్థుల తరఫు ప్రతినిధిగా వ్యవహరించారు. ఆ సమయంలో అమ్మాయిల యూనిఫారాల్లో ఫ్యాంట్లను ఒక భాగంగా చెయ్యాలని డిమాండ్‌ చేసి, బోర్డును ఒప్పించారు. ఆమె మేనత్త లేబర్‌ పార్టీలో సభ్యురాలు.

పదిహేడేళ్ళ వయసులోనే జసిండాను ఆ పార్టీ యువజన విభాగంలో (యంగ్‌ లేబర్‌ సెక్షన్‌) చేర్చారు. జసిండా గ్రాడ్యుయేషన్‌ చేశాక పరిశోధకురాలిగా న్యూజిలాండ్‌ పార్లమెంట్‌ సభ్యుడు ఫిల్‌ గోఫ్‌ కార్యాలయంలోనూ, అప్పటి ప్రధాని హెలెన్‌ క్లర్క్‌ కార్యాలయంలోనూ పని చేశారు. అనంతరం బ్రిటన్‌ వెళ్ళి, ఆ దేశ ప్రధాని టోనీ బ్లెయిర్‌ విధాన నిర్ణయ బృందంలో సీనియర్‌ విధాన సలహాదారుగా ఉన్నారు.


2008లో అంతర్జాతీయ సోషలిస్ట్‌ యూత్‌ యూనియన్‌ అధ్యక్షురాలయ్యారు. అదే ఏడాది న్యూజిలాండ్‌ పార్లమెంట్‌కు పార్టీ తరఫున ఎంపికయ్యారు. 20017లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి, గెలిచారు. మరో రెండు పార్టీలతో కలిసి లేబర్‌ పార్టీ ఏర్పాటు చేసిన ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ దేశ చరిత్రలో అతి పిన్నవయస్కురాలైన ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఈ మూడేళ్ళలో ఆమె తీసుకున్న నిర్ణయాలూ, ముఖ్యంగా కరోనాతో పోరాటంలో దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను కట్టుదిట్టంగా అమలు చేశారు.

సుమారు  యాభై లక్షల మంది జనాభా ఉన్న ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య కేవలం పాతికే! అందుకే దీన్ని కరోనా ఎన్నిక అంటూ ఆమె అభివర్ణించారు. తాజా ఎన్నికల ఫలితాల వెలువడ్డాక ఆమె మాట్లాడుతూ ‘‘కరోనా కారణంగా దెబ్బతిన్న  ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడం, సామాజిక అసమానతల్ని రూపుమాపడం... ఇవే నా ప్రాధాన్యాలు’’ అని ప్రకటించారు. బతుకమ్మ ఆడి...

2018 అక్టోబర్‌లో న్యూజిలాండ్‌ తెలంగాణ అసోసియేషన్‌ నిర్వహించిన బతుకమ్మ పండుగలో జసిండా పాల్గొన్నారు. నుదుట బొట్టు పెట్టుకొని, గౌరీ పూజ చేశారు, తెలంగాణ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.