Abn logo
Jun 18 2021 @ 03:49AM

ఫైనల్‌ ఫైట్‌

టెస్ట్‌ చాంపియన్‌షిప్‌లో భారత్‌-కివీస్‌ పోరు నేటినుంచే

తుది జట్టులో విహారి, సిరాజ్‌కు నో చాన్స్‌

మధ్యాహ్నం 3.00 గం. నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌1లో


రెండేళ్ల క్రితం ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఆరంభమైనప్పుడు భారత జట్టు తుది పోరుకు చేరుతుందనే విషయంలో ఫ్యాన్స్‌కు పెద్దగా సందేహాలు లేవు. అయితే కోహ్లీ సేన ప్రత్యర్థి మాత్రం  ఇంగ్లండో, ఆసీసో ఉంటుందనే అంతా అంచనా వేశారు. కానీ అన్ని జట్లకన్నా ముందే న్యూజిలాండ్‌ ఫైనల్లో పాగా వేసి జోష్‌లో ఉంది. అంతేకాదు..  నెంబర్‌వన్‌ హోదాలో ఇంగ్లండ్‌పై సిరీస్‌ నెగ్గి పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉంది. అటు అత్యుత్తమ బ్యాటింగ్‌ లైన్‌పతో ఉన్న టీమిండియా ఈ ఫైనల్‌ పోరులో తమదే పైచేయి కావాలన్న పట్టుదలతో బరిలోకి దిగుతోంది. 

మరింకేం..  ఈ సమ ఉజ్జీల సమరాన్ని ఆస్వాదించేందుకు మీరూ సిద్ధమైపోండిక!సౌతాంప్టన్‌: 144 ఏళ్ల టెస్టు క్రికెట్‌ చరిత్రను సమున్నత స్థాయిలో నిలిపేందుకు భారత్‌-న్యూజిలాండ్‌ జట్లు సిద్ధమయ్యాయి. క్రికెట్‌ ప్రపంచానికి సరికొత్త అనుభవమైన తొలి ప్రపంచ టెస్టు చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) ఫైనల్లో శుక్రవారం నుంచి తలపడబోతున్నాయి. ఇందుకు స్థానిక ఏజెస్‌ బౌల్‌ వేదిక కానుంది. రెండేళ్ల నుంచి ప్రత్యర్థులపై అద్భుత పోరాటంతో గెలుస్తూ.. డబ్ల్యూటీసీ ఫైనల్‌ దాకా చేరిన వేళ ఈ ఆఖరి సమరంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఇటీవలే ఇంగ్లండ్‌పై రెండు టెస్టుల సిరీ్‌సను 1-0తో గెలిచిన కివీస్‌ ఆత్మవిశ్వాసంతో ఉంది. వీరి ఖాతాలో ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా లేకపోవడంతో విలియమ్సన్‌ బృందం ఈ మ్యాచ్‌ను తేలిగ్గా తీసుకునే అవకాశం లేదు. అటు కోహ్లీ ఆధ్వర్యంలోనూ తొలి ఐసీసీ ట్రోఫీ కోసం భారత్‌ ఎదురుచూస్తోంది.


తెలుగు క్రికెటర్లకు నిరాశ:

ఒకరోజు ముందుగానే ప్రకటించిన తుది జట్టులో తెలుగు క్రికెటర్లు విహారితో పాటు పేసర్‌ సిరాజ్‌ల స్థానం గల్లంతైంది. ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో జట్టు కివీస్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. విహారికన్నా ఆల్‌రౌండర్‌ జడేజా వైపు జట్టు మొగ్గు చూపగా.. ఇక ఆసీస్‌ టూర్‌లో దుమ్ము రేపిన సిరాజ్‌కు నిరాశ తప్పలేదు. వెటరన్‌ పేసర్‌ ఇషాంత్‌ అనుభవానికే మేనేజ్‌మెంట్‌ ఓకే చెప్పింది. అశ్విన్‌ మరో స్పిన్నర్‌గా ఉన్నాడు. రోహిత్‌తో పాటు ఇన్నింగ్స్‌ ఆరంభించనున్న యువ ఓపెనర్‌ గిల్‌ సత్తా చాటాలనుకుంటున్నాడు. మిడిలార్డర్‌లో పుజార, కోహ్లీ, రహానె నిలకడ చూపితే జట్టుకు తిరుగుండదు. బుమ్రా యార్కర్లు, షమి లేట్‌స్వింగ్‌తో పాటు అనుభవజ్ఞుడైన ఇషాంత్‌ ప్రత్యర్థిపై పైచేయి సాధించాలనుకుంటున్నారు.


జోష్‌లో కివీస్‌:

ఈ పోరులో విశ్లేషకులు కివీస్‌నే ఫేవరెట్‌గా పరిగణిస్తున్నారు. రెండు దశాబ్దాల తర్వాత ఇక్కడ టెస్టు సిరీస్‌ గెలుపుతో కివీస్‌ ఉత్సాహంగా ఉంది. ప్రధానంగా సౌథీ, బౌల్ట్‌ అనుభవంతో కూడిన పేస్‌ బౌలింగ్‌తో పాటు యువ పేసర్లు జేమిసన్‌, హెన్రీ కూడా ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టేవారే. ఓపెనర్‌ కాన్వేతోపాటు రాస్‌ టేలర్‌, విలియమ్సన్‌, హెన్రీ నికోల్స్‌తో కివీస్‌ మిడిలార్డర్‌ పటిష్ఠంగా ఉంది.


వరుణుడు కరుణిస్తాడా..?

ఈ ఫైనల్‌ మ్యాచ్‌ సజావుగా సాగేది లేనిది సందేహమే. ఎందుకంటే వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఇక్కడ శుక్రవారం భారీ వర్షం కురవనుంది. రోజంతా ఉరుములతో కూడిన వాతావరణమే ఉండబోతోంది. దీంతో పసుపు రంగు హెచ్చరికను కూడా అధికారులు జారీ చేశారు. రెండోరోజు కాస్త తెరిపినిచ్చే అవకాశం ఉన్నా చివరి మూడు రోజులు కూడా వరుణుడితో ఇబ్బంది తప్పేలా లేదు.


భారత్‌ తుది జట్టు:

రోహిత్‌, గిల్‌, పుజార, కోహ్లీ (కెప్టెన్‌), రహానె, పంత్‌, జడేజా, అశ్విన్‌, ఇషాంత్‌, షమి, బుమ్రా.


న్యూజిలాండ్‌ (అంచనా):

కాన్వే, లాథమ్‌, విలియమ్సన్‌ (కెప్టెన్‌), టేలర్‌, నికోల్స్‌, వాట్లింగ్‌, గ్రాండ్‌హోమ్‌/అజాజ్‌, జేమిసన్‌, సౌథీ, వాగ్నర్‌, బౌల్ట్‌.


ముఖాముఖి

మ్యాచ్‌లు : 59

భారత్‌ : 21

కివీస్‌ : 12

డ్రా : 26