కల్యాణ కట్ట, పుష్కరిణి గుట్ట కిందే

ABN , First Publish Date - 2020-07-05T07:22:13+05:30 IST

దేశంలోనే అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తిరుమల స్థాయిలో రూపుదిద్దుకుంటున్న యాదాద్రికి వచ్చే భక్తులకు సకల సదుపాయాలు కొండ కిందనే

కల్యాణ కట్ట, పుష్కరిణి గుట్ట కిందే

  • నిత్యాన్నదానం, ప్రసాదాల వితరణ, వసతి కూడా 
  • ఇక యాదాద్రిలో గుట్ట కిందా ఆధ్యాత్మిక సందడి  

యాదాద్రి, జూలై 4 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అద్భుతమైన పుణ్యక్షేత్రంగా తిరుమల స్థాయిలో రూపుదిద్దుకుంటున్న యాదాద్రికి వచ్చే భక్తులకు సకల సదుపాయాలు కొండ కిందనే ఏర్పాటు కాబోతున్నాయి. ఆలయాన్ని సందర్శించే భక్తుల తలనీలాల సమర్పణకు కల్యాణ కట్ట, దీక్షాపరులకు డార్మిటరీ సముదాయం, పుణ్యస్నానాలకు పుష్కరిణి, స్వామివారి నిత్యాన్న ప్రసాద వితరణ సముదాయం, సువిశాలమైన ప్రవచన మండపాలతో పాటు వీవీఐపీల నుంచి సామాన్య భక్తుల వరకు వసతి సదుపాయాలు కొండ కిందనే సమకూర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. దీంతో ఇంతకాలం యాదాద్రి కొండపై మాత్రమే కొనసాగుతూ వస్తున్న ఆధ్యాత్మిక సందడి ఇక కొండ దిగువన కూడా కనిపించనుంది.


గుట్టపై 14.11 ఎకరాల విస్తీర్ణం మాత్రమే అందుబాటులో ఉన్నందున పరిమితంగా ఉన్న ఆ స్థలాన్ని ఆహ్లాదకరంగా.. ఆధ్యాత్మికత ఉట్టిపడే రీతిలో తీర్చిదిద్దడానికి, భక్తులకు ఇబ్బందులు లేకుండా సకల సదుపాయాలు కొండ కిందనే కల్పించడానికి నిర్మాణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆధునిక సదుపాయాలు, ఆధ్యాత్మిక, ఆహ్లాదపూరిత వాతావరణాన్ని తీర్చిదిద్దేందుకు యాదగిరిగుట్ట టెంపుల్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తోంది. భక్తుల కోసం కొండ దిగువన ఉన్న గండి చెరువు, ప్రెసిడెన్షియల్‌ సూట్స్‌ మధ్య ఉన్న ప్రదేశాన్ని ఆలయ నగరిగా అభివృద్ధి చేస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులు నేరుగా గండిచెరువు ప్రాంతంలోని కల్యాణ కట్టలో తలనీలాలు సమర్పించి, అక్కడి పుష్కరిణిలో పుణ్యస్నానాలు చేసి, కొండపైకి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు.


భక్తులు.. కొండ దిగువన గల ఆలయ నగరికి, అక్కడి నుంచి కొండపైకి వెళ్లడానికి ప్రత్యేక బస్‌ టెర్మినల్‌ను కూడా ఇక్కడే అభివృద్ధి చేయడానికి ప్రతిపాదించారు. నిత్యాన్న ప్రసాద వితరణకు సముదాయం, ఆధ్యాత్మిక సభలు, సమావేశాలు, ప్రవచనాలు చేయడానికి అనువుగా సువిశాలమైన ప్రవచన మండపం కూడా ఇక్కడే ప్రతిపాదించారు. యాదాద్రిపై భక్తులకు స్వామివారి దర్శనాలు, ఆర్జిత సేవలతో మొక్కులు చెల్లించడం వరకే సదుపాయాలు పరిమితం కానున్నాయి.


ఒకేసారి 520 మంది తలనీలాలు ఇచ్చేలా

కొండ దిగువన గండిచెరువు వద్ద ఆలయ నగరి ప్రాంతంలో కల్యాణ కట్ట నిర్మిస్తున్నారు. ఒకేసారి 520 మంది భక్తులు తలనీలాలు సమర్పించడానికి అనువుగా 2.29 ఎకరాల స్థలంలో రూ.13.39 కోట్ల అంచనా వ్యయంతో 47వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తలనీలాలు సమర్పించిన భక్తులు నేరుగా పుష్కరిణి(గుండం)కి చేరుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

Updated Date - 2020-07-05T07:22:13+05:30 IST