Abn logo
Jun 15 2021 @ 02:50AM

జగన్‌ కౌంటర్‌లో అన్నీ అర్ధ సత్యాలే!

నాపై ఉన్న కేసుల్లో చార్జిషీట్లు లేవు

బెయిల్‌ రద్దుకు పిటిషన్‌ వేశానని నన్ను అరెస్టు చేశారు

చిత్రహింసలకు గురిచేశారు.. సుప్రీం బెయిల్‌ ఇచ్చింది

జగన్‌ కేసులు దర్యాప్తు చేస్తున్న ‘సీబీఐ’ విశ్వసనీయత సందేహాస్పదం

పూర్తి వాదనలకు గడువివ్వండి.. రఘురామ న్యాయవాది అభ్యర్థన

సీబీఐ కోర్టు అంగీకారం.. తదుపరి విచారణ 1కి వాయిదా


హైదరాబాద్‌, జూన్‌ 14(ఆంధ్రజ్యోతి): అక్రమాస్తుల కేసుల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి బెయిల్‌ రద్దుచేయాలని తాను వేసిన పిటిషన్‌పై ఆయన దాఖలు చేసిన కౌంటర్‌లో అన్నీ అర్ధసత్యాలే చెప్పారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. ఈ మేరకు సీబీఐ ప్రత్యేక కోర్టులో సోమవారం రిప్లయ్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. తనపై నమోదు చేసిన కేసుల్లో ఒక్క దాంట్లో కూడా ఇంత వరకు చార్జిషీటు దాఖలు కాలేదని అందులో గుర్తుచేశారు. జగన్‌ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తనపై నమోదు చేసిన కేసులను మూసివేయాలని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారని, ఒక్క జీవోతో ఆయా కేసులు ఎత్తివేశారని తెలిపారు. ‘ఇక్కడ చూడాల్సింది నాపై నమోదైన కేసులను కాదు. జగన్‌పై నమోదైన కేసులను పరిగణనలోకి తీసుకోవాలి. ఆయన బెయిల్‌ రద్దుచేయాలని కోరుతూ ఈ కోర్టులో పిటిషన్‌ వేసిన తర్వాత మంగళగిరి పోలీసులు నాపై ఒక కేసు నమోదు చేశాదు. దానితోపాటు నాపై మొత్తం 7 కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో ఉన్నవి నామమాత్రమైన అభియోగాలు. వీటితో పోల్చితే జగన్‌పై నమోదైన కేసులు తీవ్ర ఆర్థిక నేరాలకు సంబంధించినవి. తనను విమర్శించే వారిపై ఆయన తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారు. నన్ను చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా కేసుపెట్టి అరెస్టుచేసి చిత్రహింసలకు గురిచేశారు. 


ఈ కేసులో సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. జగన్‌ సొంత మీడియా సంస్థలకు పెద్ద ఎత్తున ప్రకటనలు ఇస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలపై ఫిర్యాదులు చేయడంతోపాటు వాటిని పత్రికలకు విడుదల చేశారు. తన అక్రమాస్తుల కేసుల్లో నిందితులుగా ఉన్న వారికి మంత్రి పదవులు, ఉన్నత స్థానాలు కల్పించారు. ఆయన బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ పిటిషన్‌ దాఖలుచేసే అర్హత నాకు లేదనడం సరికాదు. ‘రతినాం కేసులో’ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పిటిషన్‌ వేసే అర్హత నాకు ఉంది. అక్రమాస్తుల కేసులో సాక్షిగా ఉన్న ఏపీ మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ను వేధించడాన్ని గుర్తించాలి. కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారుల విశ్వసనీయత సందేహాస్పదంగా ఉంది. సీబీఐ కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నప్పటికీ.. కొందరు అధికారుల తీరు వేరుగా ఉంది. తన బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోరలేదని జగన్‌ భావిస్తున్నారు. ఆ సంస్థ ఎందుకు అలా పిటిషన్‌ దాఖలు చేయలేదో అందరికీ తెలుసు’ అని రఘురామరాజు పేర్కొన్నారు. ఈ వ్యాజ్యంలో పూర్తి వాదనలు వినిపించేందుకు గడువు కావాలని ఆయన తరఫు న్యాయవాది అభ్యర్థించడంతో.. సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి బి.ఆర్‌. మధుసూదనరావు అందుకు అంగీకరించారు. తదుపరి విచారణను జూలై 1కి వాయిదా వేశారు.


జగన్‌ అక్రమాస్తుల కేసులపై విచారణ 21కి వాయిదా

సీఎం జగన్‌ అక్రమాస్తులకు సంబంధించి పెన్నా సిమెంట్స్‌ సంస్థపై నమోదైన కేసులో తనపై మోపిన అభియోగాల నుంచి విముక్తుడిని చేయాలని మాజీ ఐఏఎస్‌ అధికారి ఎం.శామ్యూల్‌ డిశ్చార్జి పిటిషన్‌ దాఖలుచేశారు. ఇదే కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న పీఆర్‌ ఎనర్జీ సంస్థ మరో డిశ్చార్జి పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాలు విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి మధుసూదనరావు తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారు.