కుప్పంలో వైసీపీ- దర్శిలో టీడీపీ

ABN , First Publish Date - 2021-11-18T08:13:41+05:30 IST

కుప్పంలో వైసీపీ- దర్శిలో టీడీపీ

కుప్పంలో వైసీపీ- దర్శిలో టీడీపీ

కొండపల్లిలో హోరాహోరీ.. చివరికి సైకిల్‌ ఖాతాలోకి

నెల్లూరు, కడప, బేతంచర్లలో ఫ్యాన్‌ హవా

గుంటూరులో తెలుగుదేశం గెలుపు

జగ్గయ్యపేటలో పాలక పక్షం కుతంత్రాలు

మున్సిపల్‌ ఎన్నికల్లో అధిక స్థానాలు వైసీపీకే

గట్టి పోటీ ఇచ్చిన తెలుగుదేశం


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌)

రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన నాలుగు మున్సిపాలిటీలు, ఎనిమిది నగర పంచాయతీలు, నెల్లూరు కార్పొరేషన్‌లలో అత్యధిక చోట్ల అధికార పక్షం వైసీపీ విజయం సాధించింది. అయితే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎక్కడికక్కడ గట్టి పోటీ ఇవ్వడం గమనార్హం. ప్రధానంగా టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం మున్సిపాలిటీని వైసీపీ చేజిక్కించుకుంది. పాలకపక్షం అలవోకగా గెలుస్తుందనుకున్న ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ, కృష్ణా జిల్లా కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ సొంతం చేసుకుంది. జగ్గయ్యపేట మున్సిపాలిటీలో వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, ఇతర నేతల ఒత్తిళ్లతో అధికారులు నాలుగు వార్డుల్లో ఫలితాలను తారుమారు చేయడంతో ఇది వైసీపీ ఖాతాలోకి వెళ్లింది. బుధవారం ఆయా స్థానాలకు ఓట్ల లెక్కింపు జరిగింది. ఫలితాలు ప్రకటించారు. కుప్పం పురపాలక సంఘాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలన్న లక్ష్యంతో అధికార పార్టీ పలు అక్రమాలకు పాల్పడిందని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మున్సిపాలిటీలో 25 వార్డులుండగా.. వైసీపీకి 19, టీడీపీకి 6 దక్కాయి. మొత్తం పోలైన ఓట్లలో వైసీపీకి 15,692 ఓట్లు రాగా.. టీడీపీ 12,407 ఓట్లు సాధించింది. ప్రకాశం జిల్లా దర్శి నగర పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు షాకిచ్చారు. టీడీపీకి ఘన విజయాన్ని అందించారు. మొత్తం 20 వార్డుల్లో 13 చోట్ల టీడీపీ, 7 చోట్ల వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు. మొత్తంగా ఇక్కడ టీడీపీకి 2,700కుపైగా ఓట్ల ఆధిక్యం లభించింది. ఇక్కడ 20 వార్డులుండగా ఒకటి వైసీపీకి ఏకగీవ్రమైంది. మిగిలిన 19 వార్డులకు పోలింగ్‌ జరిగింది. టీడీపీ తరఫున మాజీ ఎమ్మెల్యే నారపుశెట్టి పాపారావు, జిల్లా నేతలు పక్కాగా ఎన్నికల వ్యూహం అమలు చేశారు. దర్శిలో వైసీపీ ఓటమిపై సీఎం జగన్‌ సీరియస్‌ అయినట్లు తెలిసింది. స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌పై మండిపడినట్లు సమాచారం. దీంతో బుధవారం సాయంత్రమే ఎమ్మెల్యే తాడేపల్లి వెళ్లి.. మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి వర్గం వెన్నుపోటు పొడిచిందని ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.


బేతంచర్లలో సత్తా చాటిన టీడీపీ..

కర్నూలు జిల్లా బేతంచర్ల నగర పంచాయతీలో వైసీపీ గెలిచినా.. టీడీపీ సత్తా చాటింది. మొత్తం 20 వార్డులకు గాను గెలిచింది ఆరే అయినా.. అధికార పక్షంతో హోరాహోరా తలపడింది.  వైసీపీ 14 చోట్ల గెలిచినా.. పోటాపోటీగా నిలిచి ఆరు వార్డుల్లో విజయం సాధించామని టీడీపీ శ్రేణులు అంటున్నాయి.


వైసీపీకి గుంటూరులో షాక్‌

వైసీపీకి రాజధాని జిల్లా గుంటూరులో ఎదురుదెబ్బ తగిలింది. గుంటూరు కార్పొరేషన్‌ పరిధిలో 6వ డివిజన్‌కు జరిగిన ఉప ఎన్నికలో టీడీపీ ఘనవిజయం సాధించింది. గత ఎన్నికల్లో ఈ డివిజన్‌ నుంచి పోటీ చేసి వెయ్యి ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలుపొందిన వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేశ్‌గాంధీ హఠాన్మరణంతో ఇక్కడ ఎన్నిక అనివార్యమైంది. టీడీపీ అభ్యర్థికి 537 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం గమనార్హం. ఇక గురజాల నియోజకవర్గంలోని దాచేపల్లి నగర పంచాయతీకి జరిగిన ఎన్నికల్లో టీడీపీ సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు పార్టీ ఉనికిని కాపాడారు. ఈ ఎన్నికలను ఏకపక్షంగా జరుపుకోవాలని వైసీపీ ఎన్నో కుయుక్తులు పన్నింది. టీడీపీ అభ్యర్థులను నామినేషన్‌ వేయకుండా అడ్డుకోవడం, భారీ ఎత్తున ఓటర్ల కొనుగోళ్లతో పాటు పోలీసు యంత్రాంగాన్ని తమకు అనుకూలంగా వినియోగించుకున్నప్పటికీ.. టీడీపీ తరపున ధైర్యంగా అభ్యర్థులను బరిలోకి దించారు. 19 వార్డులకు ఎన్నికలు జరుగగా.. వైసీపీ పది స్థానాలకే పరిమితమైంది. గట్టి పోటీ ఇచ్చిన టీడీపీ ఏడు వార్డులను కైవసం చేసుకుంది. జనసేన, స్వతంత్రుడు చెరో వార్డు గెలుచుకున్నారు. గురజాల నగర పంచాయతీలో వైసీపీ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడింది. మొత్తం 20 వార్డుల్లో 6చోట్ల టీడీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయనివ్వకుండా ఏకగ్రీవం చేసుకుంది. ఎన్నికలు జరిగిన 14 వార్డుల్లో పది గెలుచుకుంది. టీడీపీ 3 చోట్ల, దాని మద్దతుతో జనసేన ఒక చోట విజయం సాధించాయి.


కొండపల్లిలో హోరాహోరీ

కృష్ణా జిల్లాలో కొండపల్లి, జగ్గయ్యపేట మున్సిపాలిటీల ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ నడుమ హోరాహోరీగా పోరు సాగింది. కొండపల్లిలో మొత్తం 29 వార్డులు ఉండగా.. టీడీపీ, వైసీపీ చెరో 14 గెలిచాయి. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి కరిమికొండ శ్రీలక్ష్మి గెలుపొందారు. ఈమె టీడీపీకి చెందిన కరిమికొండ బాలాజీ సోదరుడి భార్య కావడంతో టీడీపీ నేతలు ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. అధినేత చంద్రబాబు వద్దకు తోడ్కొని వెళ్లి పార్టీ కండువా కప్పించారు. దీంతో టీడీపీ బలం 15కి చేరింది. వైసీపీ తరఫున మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఇక్కడ ఎక్స్‌అఫిషియో ఓటు వినియోగించుకున్నా.. విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీ తరఫున ఎక్స్‌అఫిషియో ఓటు వినియోగించుకునే అవకాశం ఉంది.  ఇక జగ్గయ్యపేటలో తొలుత టీడీపీ స్పష్టమైన ఆధిక్యం కనబరచింది. కానీ వైసీపీ నేతల కుతంత్రాలతో పట్టణం దాని చేజారింది. స్థానిక ఎమ్మెల్యే సామినేని ఉదయభాను నేరుగా ఓట్ల లెక్కింపు కేంద్రానికి చేరుకున్నారు. ఆయన లెక్కింపు అధికారులను బెదిరించారని, దీంతో 4 వార్డుల్లో ఫలితాలు తారుమారయ్యాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొత్తం 31 వార్డుల్లో టీడీపీ 14 వార్డులను దక్కించుకోగా వైసీపీ 17 వార్డుల్లో విజయం సాధించింది. ఈ 17 వార్డుల్లో నాలుగు చోట్ల వైసీపీ అభ్యర్థుల మెజారిటీ 9 ఓట్లలోపే కావడం గమనార్హం. వాస్తవానికి 4 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు తొలుత స్వల్ప ఓట్లతో గెలుపొందినట్లు చెప్పిన అధికారులు.. ఎమ్మెల్యే బెదిరింపులతో ఫలితాలను మార్చేశారని విమర్శలు వస్తున్నాయి.


నెల్లూరు, కడప, అనంతలో..

నెల్లూరు కార్పొరేషన్‌కు జరిగిన ఎన్నికల్లో అధికార వైసీపీ క్లీన్‌స్వీ్‌ప చేసింది. మొత్తం 54 డివిజన్లలో ఎనిమిదింటిని ముందే ఏకగ్రీవం చేసుకుంది. మిగిలిన 46 డివిజన్లకు ఎన్నికలు జరుగగా.. మొత్తం అధికార పార్టీకే దక్కాయి. బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీని కూడా వైసీపీ గెలుచుకుంది. ఇక్కడ 20 వార్డుల్లో వైసీపీ 18, టీడీపీ 2 గెలుచుకున్నాయి. కడప జిల్లా రాజంపేట మున్సిపాలిటీ, కమలాపురం నగర పంచాయతీలో వైసీపీ విజయం సాధించింది. కమలాపురంలో 20 వార్డులకు 15 వార్డుల్లో వైసీపీ గెలిచింది. అందులో 8 వార్డుల్లో మెజారిటీ రెండంకెలు దాటకపోవడం గమనార్హం. ప్రజాస్వామ్యయుతంగా పోలింగ్‌ జరిగి ఉంటే ఆ 8 వార్డుల్లో ఫలితాలు మరోలా ఉండేవని టీడీపీ అంటోంది. ఇక్కడ ప్రతిపక్షం ఐదు వార్డుల్లో విజయం సాధించింది. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి ఆరో  వార్డులో ఓటు వేశారు. ఆ వార్డులో టీడీపీ అభ్యర్థి ఎస్‌.రహేనా 20 ఓట్ల తేడాతో గెలిచారు. రాజంపేటలో 29 వార్డులకు వైసీపీ 24 వార్డుల్లో, టీడీపీ 4, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించారు. ఇక్కడ కూడా మెజారిటీ వార్డుల్లో టీడీపీ స్వల్ప తేడాతో ఓడిపోయింది. బద్వేలులోని 11వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. ఇక్కడ టీడీపీ పోటీ చేయలేదు. అనంతపురం జిల్లాలోని పెనుకొండ నగర పంచాయతీకి తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది. 20 వార్డులకు 18 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు, రెండు వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అనంతపురం కార్పొరేషన్‌లోని 17వ వార్డుకు జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు నగర పంచాయతీ పరిధిలోని 20 వార్డుల్లో 12 వార్డులు వైసీపీ, 4 టీడీపీ, 3 జనసేన, ఒకటి స్వతంత్ర అభ్యర్థి గెలుచుకున్నారు.


ఇతర ఉప ఎన్నికల్లో..

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలో ఉప ఎన్నికలు జరిగిన 31, 61వ వార్డులను వైసీపీ కైవసం చేసుకుంది. 61వ వార్డులో టీడీపీ పోటీచేయలేదు. 31వ వార్డులో పోటీచేయనన్న వైసీపీ.. నామినేషన్ల ఉపసంహరణ రోజున ఇండిపెండెంట్‌ అభ్యర్థికి బీ-ఫారం ఇచ్చి తన అభ్యర్థిగా ప్రకటించింది. ఇక్కడ టీడీపీ గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం 6,595 ఓట్లు పోలవగా వైసీపీ అభ్యర్థి బిపిన్‌కుమార్‌జైన్‌కు 3,087 ఓట్లు, టీడీపీ అభ్యర్థిని వానపల్లి గాయత్రి ఫణికుమారికి 3,028 ఓట్లు, జనసేన అభ్యర్థిని చరకం పార్వతికి 359 ఓట్లు లభించాయి. విజయనగరం నగరపాలక సంస్థ ఒకటో డివిజన్‌, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్‌ పరిధిలోని నాలుగు డివిజన్లలో, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కార్పొరేషన్‌లో 45వ డివిజన్‌లో జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ గెలిచింది.

Updated Date - 2021-11-18T08:13:41+05:30 IST