అవును.. ఆయనో దళిత శత్రువు

ABN , First Publish Date - 2021-09-10T05:48:27+05:30 IST

‘తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే. కేసీఆర్ మాట అన్నడంటే తల నరుక్కుంటడు, గానీ మాట తప్పడు’–ఇదెవరి స్టేట్‌మెంటో, స్వరాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతుకుతున్నామనుకుంటున్న మనందరికీ తెలుసు....

అవును.. ఆయనో దళిత శత్రువు

‘తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి దళితుడే. కేసీఆర్ మాట అన్నడంటే తల నరుక్కుంటడు, గానీ మాట తప్పడు’–ఇదెవరి స్టేట్‌మెంటో, స్వరాష్ట్రంలో ఆత్మగౌరవంతో బతుకుతున్నామనుకుంటున్న మనందరికీ తెలుసు. యూట్యూబ్ లోనో, సోషల్ మీడియా లోనో దేవులాడకుండానే కేసీఆర్ కంచుకంఠంతో దాన్ని ఎప్పుడైనా వినొచ్చు. తెలంగాణ ఇచ్చారో, తెచ్చారో, తెచ్చుకున్నామో కానీ మన నాలుగుకోట్ల మంది ఆరు దశాబ్దాల ఆకాంక్షలు మన కళ్ల ముందు సాక్షాత్కరించి ఏడేళ్లు దాటింది. ఇప్పటికైనా కేసీఆర్ ఇచ్చిన మాట అమలయిందా...? దళితుణ్ణి ముఖ్యమంత్రి కుర్చీలో కూసోబెట్టిండా..? ఆయనే కూసున్నాడా...? ‘సారూ.. దళితున్నే మన రాష్ట్ర మొట్టమొదటి ముఖ్యమంత్రిని చేస్తా అన్నరు, కాపలా కుక్క లెక్క ఉంటనన్నరు’ అని ఎవరైనా ధైర్యం చేసి అడిగే పరిస్థితి ఉందా...? ఏ నాయకుడైనా అడిగితే వెంటబడి, వేటాడుతున్నారు.


భూమి లేని దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తామని, దాన్ని సాగు చేసుకోవడానికి ఏడాదికి అవసరమైన పెట్టుబడి ఇస్తామని స్పష్టంగా టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలోనే చెప్పిండ్రు కదా. దళితులకు భూమి ఇచ్చిండ్రా. తెలంగాణ రాష్ట్రావిర్భావం వెంటనే దళితులకు భూమి ఇచ్చి ఉంటే ఈ రోజు తెలంగాణ దళిత కుటుంబాల జీవన స్థితిగతులు అద్భుతంగా ఉండేవి కదా. ఒక్కో కుటుంబానికి పదిలక్షలు ఇవ్వడం కంటే, ఆ మూడెకరాల భూమి ఇచ్చినట్టయితే ఆ దళిత రైతులే ఒక్కొక్కరు లక్షల పంటను పండించుకునేవాళ్లు. అదీ నిజమైన ఆత్మగౌరవం. భూమి అనేది ఆత్మగౌరవానికి ప్రతీక. అంతేకాదు ఈ రోజు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులను బట్టి ఒక ఎకరం జాగా 10 లక్షలకు తక్కువగా ఏ మారుమూల ప్రాంతాల్లో కూడా లభించడం లేదు. భూమి లేని అన్ని దళిత కుటుంబాలకు కేసీఆర్ చెప్పినట్టు 3 ఎకరాల భూమి, సాగు కోసం పెట్టుబడి ఇచ్చి ఉంటే ఈ ఏడేళ్లలోనే తెలంగాణ లోని దళిత కుటుంబాల జీవన స్థితిగతులను మనం అద్భుతంగా మార్చుకునేటోళ్లం కదా. రాష్ట్ర, దేశ అభివృద్ధిలో కూడా ఇవన్నీ తోడు అయ్యేవి కదా..? మరి జరిగింది ఏందో, చేసిన బాసలు ఏందో కేసీఆర్ సమాధానం చెప్పుకోవద్దా?


తెలంగాణ ఏర్పాటవుతుందని విశ్వాసం కలిగినప్పటి నుంచే టీఆర్‌ఎస్‌లో దళిత నేతల మీద కత్తి గట్టినట్టుంది. దళితుడే తొలి ముఖ్యమంత్రి అని చెప్పిన కేసీఆర్ మాట అమలు గురించిన ప్రస్తావన తెస్తారేమో అని అనుమానం ఉన్న పార్టీ నాయకులను, ఉద్యమకారులను అంతర్గతంగా వేటాడినట్టు అర్థమవుతోంది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి కొందరు, ఉద్యమ గమనంలో మరికొందరు దళిత నేతలు ఎన్నెన్నో పోరు ఘట్టాలలో సూత్ర, పాత్రదారులుగా, అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ పార్టీ శాసనసభాపక్షానికి తొలి నాయకుడిగా పనిచేసిన కేసీఆర్ సమకాలికుడు జి. విజయరామారావును; తెలుగుదేశం పార్టీలోనూ, ఉద్యమకాలం లోనూ అత్యంత సన్నిహితంగా మసిలిన ఎ. చంద్రశేఖర్ (వికారాబాద్)ను ఎందుకు అంత అవమానకర రీతిలో పార్టీ నుంచి తరిమేశారో ఇప్పటికీ తెలియదు. తెలంగాణ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన కేసీఆర్, అనూహ్యంగా టి. రాజయ్యను ఉప ముఖ్యమంత్రిని చేశారు. అంతకంటే అనూహ్యంగా, అవమానకరంగా మంత్రివర్గం నుంచి ఆయనను బర్తరఫ్ చేశారు. అప్పటికి వరంగల్ ఎంపీగా ఉన్న కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిని చేశారు. ఆ తర్వాత ఆయనను అటు ఎంపీ కాకుండా, ఇటు ఎమ్మెల్సీ కాకుండా చేశారు. మాజీమంత్రి, మాజీ ఎంపీ రవీంద్రనాయక్తో టీఆర్‌ఎస్ కార్యాలయంలో ప్రవర్తించిన తీరు చాలామంది ఉద్యమకారులకు బాధ కలిగించింది. లంబాడీల రిజర్వేషన్ల కోసం కొట్లాడిన ‘లంబాడీల గాంధీ’ రవీంద్రనాయక్ అని నోటితో పొగిడిన కేసీఆరే కొట్టించడం ఆయన మాటలకు, చేతలకు ఉన్న సమన్వయానికి మచ్చుతునక. దళిత, గిరిజనులకు ఇచ్చిన హామీలను గుర్తు చేయగలిగే సాహసం లేదా చనువు ఉంది అనుకున్న నాయకులను పేరుపేరునా ఏరివేసినట్టు అవగతమవుతోంది. 


దళితవర్గానికి చెందిన రాజకీయ నేతలనే కాకుండా అధికారులను కూడా అవమానించారు. సంక్షేమ గురుకులాలకు కార్యదర్శిగా కాంగ్రెస్ హయాంలో వచ్చిన పోస్టింగ్‌లో ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్ పడిన ఇబ్బందులు విన్నాం. గురుకులాలకు కనీస వసతులు, నిధులు కల్పించకుండా సతాయించిన సంగతి తెలిసిందే. వివిధ జిల్లాలకు కలెక్టరుగా పని చేసిన ఆకునూరి మురళి అనుభవాలు చూసినం. దళితవర్గాల హక్కులు గుర్తు చేసినందుకు మురళిని ఇదే కేసిఆర్ సర్కారు రాచిరంపాన పెట్టి, ఉద్యోగానికి రాజీనామా చేసేదాక వేటాడారు. తెలంగాణ ప్రభుత్వానికి అతి కొద్ది రోజులు ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ప్రదీప్ చంద్రకు అధికారికంగా వీడ్కోలు ఇవ్వలేదు. కానీ అంతకు ముందూ, ఆ తర్వాత పదవీ విరమణ చేసిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు–దళిత, గిరిజనులు కాకపోతే చాలు అన్నట్టుగా–చాలామంది వివిధ హోదాల్లో, ముఖ్యమంత్రి కార్యాలయంలోనే కొనసాగుతున్న తీరు మనమే చూస్తున్నాము. ‘చింతమడకలోని మాదిగ నర్సయ్య గారి మనుమడు, కేసీఆర్ మనుమడు ఒక్కటే బడిలో చదవాలె. ఇద్దరూ ఒక దగ్గరనే తినాలె. దళితజాతి ఆత్మగౌరవంతో బతకాలంటే ఒక తరాన్ని పైకి లేపి ఇడిసిపెడ్తే ఖతం’ ఇది కూడా కేసీఆర్ మాటే. ఆచరణలో దళిత, గిరిజన జాతికి పూర్తిశత్రువుగా పని చేస్తున్న అనుభవం. దళిత, గిరిజన బిడ్డలు రాజకీయాల్లో, ఉన్నత సర్వీసుల్లో ఎదిగినా కేసీఆర్ చూసి ఓర్చుకోలేదు. వాళ్ళను కనుమరుగు చేసేదాకా వెంటాడుతున్న తీరు మన కళ్లముందే కనబడుతున్న నిష్ఠుర నగ్నసత్యం. దళిత, గిరిజన సామాజిక ఉద్యమనేతలను కూడా అవమానించే విధంగానే ఆయన వ్యవహరించారు.


బాబాసాహెబ్ అంబేడ్కర్ కృషితో దళిత, గిరిజన బిడ్డలు అక్కడక్కడా ఎదిగినా ఇంకా సరైన గూడు లేక గోస పడుతున్నది వారే. ఇందిరమ్మ ఇళ్ళు ఎందరికో గూడు కల్పిస్తే, ఈ ఏడేళ్ల కేసీఆర్ పాలనలో ఆ నిధులను పక్కదారి పట్టించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పినా దాని జాడే లేదు. గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు అని చెప్పి మర్చిపోయారు. మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్లను, అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే, తమిళనాడు తరహాలో సాధిస్తామని చెప్పి ఏడున్నరేళ్లు దాటింది. కనీసం రిజర్వేషన్లు ఇప్పించకపోగా, ఆ ముచ్చట కూడా యాది ఉన్నట్టు కనిపిస్తలేదు. 


ఇలాంటి మాటలు చెప్పి మైమరిపించి, మాటలతోనే కడుపు నింపే తీరు గురించి ఎంఐఎం శాసనసభపక్ష నేత అక్బరుద్దీన్ నిండుసభలోనే ఎద్దేవా చేస్తే, అదే అక్బరుద్దీన్‌ను సంకలో పెట్టుకుని, మాట్లాడకుండా చేయగలిగిన తెలివైన కలల బేహారీ కేసీఆర్. హుజురాబాద్ ఉపఎన్నికల్లో ప్రయోజనం కోసం ‘దళిత బంధు’ అంటున్నా, కేసీఆర్ మాటల మీద ఎవరికీ నమ్మకం కుదరకపోవడానికి ఈ కారణాలు సరిపోవా..? చెప్పవచ్చినదేమిటంటే కేసీఆర్ మీద ప్రజల నమ్మకం సడలిపోయింది. కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా సభలకు జనం పెద్దఎత్తున తరలిరావడమే అందుకు తార్కాణం. దళితుల అభ్యున్నతి గురించి కేసీఆర్ ఏమి చెప్పినప్పటికీ ఆయన లోపలి మనిషి దళిత శత్రువు అనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించారు. కాంగ్రెస్ సభల విజయమే ఆ యథార్థానికి ఒక తిరుగులేని నిదర్శనం.

బోరెడ్డి అయోధ్య రెడ్డి, టీపీసీసీ అధికార ప్రతినిధి

Updated Date - 2021-09-10T05:48:27+05:30 IST