ఇక ఎలకల్ని కూడా మీరు ఈజీగా రిఛార్జ్‌ చేసుకోవచ్చు!

ABN , First Publish Date - 2020-03-09T23:18:35+05:30 IST

ఎలక అంటే నిజంగా ఏ ఎలకనో పట్టుకుని కరెంట్‌ పెట్టేరు గనక? వినాయకుడు మీ తాట తీస్తాడు. మనం ఇక్కడ మాట్లాడుకునేది కంప్యూటర్‌ మౌస్‌ గురించి

ఇక ఎలకల్ని కూడా మీరు ఈజీగా రిఛార్జ్‌ చేసుకోవచ్చు!

ఎలక అంటే నిజంగా ఏ ఎలకనో పట్టుకుని కరెంట్‌ పెట్టేరు గనక? వినాయకుడు మీ తాట తీస్తాడు. మనం ఇక్కడ మాట్లాడుకునేది కంప్యూటర్‌ మౌస్‌ గురించి!


మౌస్‌ని రిఛార్జ్‌ చేయడమేంటి? అంటున్నారా? అయితే మీరింకా చాలా వెనకబడి ఉన్నారు!


వైర్‌డ్‌ మైస్‌ ( మౌస్‌ mouse బహువచనం మైస్‌ mice ) వాడకం తగ్గి చాలాకాలమయింది. ముఖ్యంగా గేమింగ్‌ విషయంలో వైర్‌డ్‌ మౌస్‌ కంటే వైర్‌లెస్‌ మౌస్‌ వాడకమే ఎంతో హాయి అనిపిస్తుంది. ఎందుకంటే గేమింగ్‌ మైస్‌లో రకరకాల ఆప్షన్లు అందించే బటన్లూ వీల్స్‌ ఉంటాయి. ఆసక్తి కరంగా గేమ్ ఆడేటప్పుడు - మధ్యలో ఆ వైర్‌ అడ్డొస్తే ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఎక్కువ గేమింగ్‌ మైస్‌.. వైర్‌లెస్‌ గానే వస్తున్నాయిప్పుడు.


అయితే మొన్నమొన్నటివరకూ మైస్‌లో పవర్‌ కోసం లోపల బ్యాటరీ వేసే పద్ధతి ఉండేది. కానీ తరవాత వచ్చిన మైస్‌ మరికొంత ఎడ్వాన్స్‌ అయ్యాయి. సెల్‌ఫోన్‌ మాదిరిగా - వాటిని కూడా ఛార్జ్‌ చేసుకునే వీలొచ్చింది. యుఎస్బీ పోర్ట్‌ ద్వారా ఛార్జ్‌ చేసుకునే మైస్‌ - మార్కెట్లో ఎన్నో లభిస్తున్నాయిప్పుడు.


అయితే ఎంత వైర్‌లెస్‌ మౌస్‌ అయినా చార్జ్‌ చేసుకునేటప్పుడు దానికి వైర్‌ తగిలించాల్సిందేగా? అలాంటప్పుడు దాన్ని పూర్తి వైర్‌లెస్‌ అని ఎలా అనగలం?  కంప్యూటర్‌ గేమింగ్‌ ఉత్పత్తుల్ని అందించే కింగ్‌స్టన్‌ (Kingston) కంపెనీ కూడా ఇలాగే ఆలోచించినట్టుంది.


అందుకే ఇప్పుడు వైర్‌లెస్‌ గేమింగ్ మైస్‌ని వైర్‌లెస్‌ గానే ఛార్జ్‌ చేసుకోగలిగే విధంగా 'పల్స్‌ఫైర్‌ డార్ట్‌' ( Pulsefire Dart) అనే ఓ కొత్త గేమింగ్‌ మౌస్‌ని మార్కెట్లోకి వదిలింది.


కింగ్‌స్టన్‌ రూపొందించిన  'పల్స్‌ఫైర్‌ డార్ట్‌' ( Pulsefire ) సీరీస్‌ ప్రొడక్ట్స్‌ ఇప్పటికే పాపులర్‌. అయితే ఈ కొత్త మౌస్‌ గేమింగ్‌ ప్రేమికుల్ని మరింతగా ఆకట్టుకుంటోంది. ఎందుకంటే - దీన్ని Qi కంపాటిబుల్‌ కావడం వల్ల - మార్కెట్లో దొరికే ఏ  Qi వైర్‌లెస్‌ చార్జర్‌ తో అయినా దీన్ని ఛార్జ్‌ చేసుకోవచ్చు. సో.. వైర్‌లెస్ మౌస్‌ని వైర్‌లెస్‌గానే ఛార్జ్‌ చేసుకోవడానికి ఇంతకాలానికి అవకాశం లభించిందన్నమాట!

Updated Date - 2020-03-09T23:18:35+05:30 IST