Abn logo
Feb 22 2020 @ 17:03PM

ట్రంప్ మనసు మార్చెయ్ స్వామి.. భక్తుల ప్రత్యేక పూజలు

హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సతీసమేతంగా తొలిసారి భారత పర్యటనకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నెల 24, 25 తేదీల్లో అహ్మదాబాద్, ఆగ్రా, ఢిల్లీ ప్రాంతాల్లో ట్రంప్ పర్యటించనున్నారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ మనసు మార్చాలంటూ శివరాత్రి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేశారు. వివరాల్లోకి వెళితే.. హెచ్‌1బీ వీసా సహా ఇతర అంశాల్లో ట్రంప్ కఠినతర నిబంధనలు అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ట్రంప్ వైఖరి కారణంగా ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకుంటున్న ఇక్కడి విద్యార్థులు నిరాశకు గురవుతున్నారు. అంతేకాకుండా.. గ్రీన్‌కార్డు పొందేందుకు ఎన్నారైలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ నేపథ్యంలో ట్రంప్ మనసు మార్చాలంటూ చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో భక్తులు పెద్ద ఎత్తున పూజలు చేశారు. ఇక్కడి సంప్రదాయం ప్రకారం.. భక్తులు మొదటగా 11 ప్రదక్షణలు చేసి కోరికలు కోరుకుంటారు. కోరికలు నెరవేరిన భక్తులు 108 ప్రదక్షణలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. అయితే అమెరికా అధ్యక్షుడి పర్యటన నేపథ్యంలో రెండు ప్రదక్షణలు ఎక్కువగా చేసిన భక్తులు.. ట్రంప్ మనసు మార్చాలంటూ మొక్కుకున్నారు. కాగా.. చిలుకూరు బాలాజీని వీసా బాలాజీ అని కూడా పిలుస్తారన్న విషయం తెలిసిందే.


Advertisement
Advertisement
Advertisement