కరోనా సంక్షోభం.. యువతలో సగం మందికి ‘కుంగుబాటు’ ముప్పు !

ABN , First Publish Date - 2020-08-13T14:01:22+05:30 IST

కరోనా సంక్షోభం ప్రభావంతో ప్రపంచ జనాభాలో సగం మంది యువత ఆందోళన, కుంగుబాటులో కూరుకుపోయారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) సర్వేలో వెల్లడైంది.

కరోనా సంక్షోభం.. యువతలో సగం మందికి ‘కుంగుబాటు’ ముప్పు !

కరోనా సంక్షోభంతో విద్య, ఉద్యోగ అనిశ్చితి 

ఐఎల్‌ఓ సర్వే నివేదిక

యునైటెడ్‌ నేషన్స్‌, ఆగస్టు 12: కరోనా సంక్షోభం ప్రభావంతో ప్రపంచ జనాభాలో సగం మంది యువత ఆందోళన, కుంగుబాటులో కూరుకుపోయారని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) సర్వేలో వెల్లడైంది. ‘యువత - కొవిడ్‌19 : వారి ఉద్యోగాలు, విద్య, హక్కులు, మానసిక స్థితిపై ప్రభావం’ పేరిట ఆ సర్వే నివేదిక ను ఐఎల్‌ఓ విడుదల చేసింది. ఆయా దేశాల ప్రభుత్వాలు తక్షణ చర్యలు చేపట్టకుంటే యువత మరింత కుంగుబాటులోకి జారుకునే అవకాశాలుంటాయని హెచ్చరించింది. ఈ సర్వేలో భాగంగా 112 దేశాలకు చెందిన 18 నుంచి 29 ఏళ్లలోపు 12వేల మంది విద్యావంతులైన యువత అభిప్రాయాలను సేకరించారు. దీని ప్రకారం ప్రతి ఇద్దరు యువకుల్లో ఒకరు (50 శాతం మంది) మానసిక కుంగుబాటు ముప్పును ఎదుర్కొంటున్నారు. మరో 17శాతం మంది యువత ఇప్పటికే దాని ప్రభావానికి లోనవుతున్నారు.


ఉద్యోగాలు పోయాయని కొందరు.. ఉద్యోగ అవకాశాలు కనిపించడం లేదని ఇంకొందరు.. వేతనాల్లో కోత పెడుతున్నారని ఇంకొంత మంది లోలోన కుమిలిపోతున్నట్లు సర్వేలో గుర్తించారు. కరోనా సంక్షోభంతో ప్రతికూల పరిస్థితుల ప్రభావం ప్రధానంగా 18 నుంచి 24 ఏళ్లలోపు యువతపైనే ఎక్కువగా పడిందని వెల్లడించారు. చదువులో ఫెయిల్‌ అవుతామేమోననే బెంగతో 22 శాతం మంది, భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని 38 శాతం మంది కుంగుబాటుకు చిక్కే పరిస్థితులున్నాయన్నారు. ముఖ్యం గా భారత్‌ సహా అభివృద్ధిచెందుతున్న, పేద దేశాల యువతపైనే కరోనా సంక్షోభం ప్రభావం ఎక్కువగా పడిందని ఐఎల్‌ఓ డైరెక్టర్‌ జనరల్‌ గయ్‌ రైడర్‌ తెలిపారు.


Updated Date - 2020-08-13T14:01:22+05:30 IST