ఉప్పెనంత ఈ ప్రేమలో..!

ABN , First Publish Date - 2021-06-09T05:47:04+05:30 IST

‘వరుణ్‌... ఇంటికెళ్లిపోయావా?’ ‘ఇప్పుడే వచ్చాను. అదేంటి నువ్వు ఇంకా పడుకోలేదా? నువ్వు లైట్స్‌ ఆఫ్‌ చేసి చాలాసేపయింది కదా!’ ‘నీకెలా తెలుసు?’

ఉప్పెనంత ఈ ప్రేమలో..!

యూట్యూబ్ హిట్


‘వరుణ్‌... ఇంటికెళ్లిపోయావా?’ 

‘ఇప్పుడే వచ్చాను. అదేంటి నువ్వు ఇంకా పడుకోలేదా? నువ్వు లైట్స్‌ ఆఫ్‌ చేసి చాలాసేపయింది కదా!’ 

‘నీకెలా తెలుసు?’ 

‘ఇప్పటి వరకు మీ ఇంటి ముందు ఉండే ఛాట్‌ చేశాను. నువ్వు లైట్స్‌ ఆఫ్‌ చేశాకనే ఇంటికి వచ్చాను.’

‘నువ్వు త్వరగా వెళ్లాలనే నేను లైట్స్‌ ఆఫ్‌ చేశాను. నువ్వు వెళ్లాకే నేను పడుకొంటాను.’

‘నేను నీకంటే ఎక్కువ ప్రేమ ఇవ్వాలనుకొంటాను. కానీ నువ్వు నాకంటే ఎప్పుడూ ముందే ఉంటావు.’

‘నా జీవితంలోకెల్లా విలువైంది నువ్వే వరుణ్‌. కానీ అమ్మా నాన్న తరువాతే! ఏయ్‌... నాన్న లేచినట్టున్నారు. బాయ్‌’. 


సీన్‌ కట్‌ చేస్తే వరుణ్‌ ఓ ఇంటర్వ్యూకు వెళతాడు. ఆ సమయంలోనే మేఘన నుంచి ఫోన్‌ వస్తుంది... అర్జెంట్‌గా కలవమని! సముద్ర తీరం... అలల హోరు... రోజా పువ్వుతో తన ముందు వాలతాడు. 


‘ఎలా ఉన్నావ్‌? ఈ పది రోజులూ ఏమీ మాట్లాకుండా? నాకైతే నరకం కనిపించింది. ఈ నిశ్శబ్దం తట్టుకోలేకపోతున్నా’... అంటాడు వరుణ్‌. ‘ఇక ముందు ఈ నిశ్శబ్దం కూడా ఉండకపోవచ్చు. నెక్స్ట్‌ వీక్‌ నా ఎంగేజ్‌మెంట్‌’... భారంగా చెబుతుంది తను. ‘ఏం మాట్లాడుతున్నావ్‌. అసలు ఎలా ఒప్పుకున్నావ్‌’... వరుణ్‌ ప్రశ్న. ‘ఏంచేయమంటావ్‌? తొందరగా సెటిలవ్వు.. మనకు ఎక్కువ టైమ్‌ లేదని ఎన్నిసార్లు చెప్పాను! కానీ నువ్వు సీరియస్‌గా తీసుకోలేదు. ఎప్పుడూ ఆ బుక్కేదో పబ్లిష్‌ చేయాలంటావ్‌. ఇప్పుడు నా చేతులు దాటిపోయింది. దేన్నయితే నేను ఎక్కువ ప్రేమిస్తానో అది నాకు దొరక్కుండా పోతుంది.


ఈ మాట నీకు చెప్పడానికి నాతో నేను యుద్ధమే చేశాను. నీకెలా ఉంటుందో ఊహించగలను’... మేఘన గుండెల్లో బాధ కన్నీరై ప్రవహిస్తుంది. ‘నో... యూ హావ్‌ నో ఐడియా. నువ్వు ఎప్పటికీ గెస్‌ చేయలేవు. నీ పేరు తలుచుకున్నప్పుడల్లా నా హార్ట్‌బీట్‌ టెన్‌ టైమ్స్‌ పెరుగుతుంది. నేను అంటే ఇద్దరం అనుకున్నాను. కానీ ఇకపై నాతో నువ్వు ఉండవనే నిజాన్ని నేను ఒప్పుకోలేకపోతున్నా’... వరుణ్‌ ఆవేదన. ‘వరుణ్‌... నువ్వు ఎప్పటికీ మర్చిపోలేని ఒక జ్ఞాపకం. నువ్వు గొప్ప లవర్‌వే కాదు. గొప్ప ఫ్రెండ్‌వి కూడా’... ఏదో చెప్పబోతుంది తను. ఇన్నేళ్ల ప్రేమను పండించుకోలేకపోతున్నామనే బాధ ఇరువురిలో. ఇక ఎప్పటికీ ఒక్కటి కాలేకపోతున్నామనే అంతులేని వేదన. వీటిని దాటుకుని వరుణ్‌, మేఘన జంటగా మారారా? పెద్దల మాట కాదనలేక విరహంతోనే విడిపోయారా? సమాథానం ‘ఉప్పెనంత ఈ ప్రేమలో’ లఘుచిత్రంలో దొరుకుతుంది. 


కథలో కొత్తదనమేమీ లేకపోయినా చక్కని సంభాషణలతో రక్తి కట్టించాడు దర్శకుడు మనోజ్‌. వరుణ్‌గా కూడా అతడే నటించాడు. మేఘనగా రేణు చేసింది. యూట్యూబ్‌లో విడుదలైన ఈ షార్ట్‌ ఫిలిమ్‌ను దాదాపు లక్షమంది వీక్షించారు. కుదిరితే మీరూ ఓ చూపు చూడండి. 

Updated Date - 2021-06-09T05:47:04+05:30 IST