Abn logo
Oct 23 2021 @ 02:26AM

భూములు కాజేసేందుకే ధరణి

  • 111 జీవో పరిధిలో భూములను స్వాహా చేసేందుకే జీవోను ఎత్తివేయడం లేదా?
  • ముఖ్యమంత్రి జవాబు చెప్పాలి
  • ఉప ఎన్నికలు వస్తేనే పథకాలకు స్విచ్‌ ఆన్‌
  • దళితబంధును ఎస్సీ నియోజకవర్గాల్లో ఎందుకు ప్రారంభించలేదు?
  • కాంగ్రెస్‌కు ఓటేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్లే
  • పాదయాత్రలో వైఎస్‌ షర్మిల విమర్శలు


శంషాబాద్‌ రూరల్‌/మొయినాబాద్‌/చేవెళ్ల, అక్టోబరు 22: టీఆర్‌ఎస్‌ నేతలు పేదల భూములను కాజేసేందుకే ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను పెట్టిందనే అనుమానాలు కలుగుతున్నాయని వైఎ్‌సఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ధరణిలో తమ పేర్లు రావడం లేదని, పాస్‌బుక్‌లు ఇవ్వడం లేదని, తమ భూములు తీసుకుంటున్నారంటూ ఎంతోమంది పేద రైతులు గోడు చెప్పుకొంటున్నారని తెలిపారు. 111 జీవోను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రశ్నించారు. జీవో రద్దు విషయంలో జాప్యం చేయడాన్ని బట్టి ఈ ప్రాంత భూములను సీఎం కేసీఆర్‌ స్వాహా చేసే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ఈ అనుమానాలకు ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.


ప్రజా ప్రస్థానంలో భాగంగా శుక్రవారం మూడో రోజు శంషాబాద్‌ మండలంలో షర్మిల పాదయాత్ర కొనసాగింది. పాదయాత్రలో పలుచోట్ల రైతులు, కూలీలు, యువకులు, మహిళలతో ఆమె మాట్లాడారు. శంషాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతి వర్గాన్నీ సీఎం కేసీఆర్‌ మోసం చేశారని ఆరోపించారు. శంషాబాద్‌ ప్రాంతం హైదరాబాద్‌ నగరానికి అతి సమీపంలోనే ఉన్నా.. విద్య, వైద్యం, మంచినీరు, డ్రైనేజీ సౌకర్యాలు కల్పించారా? అని నిలదీశారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే ఈ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు, ఔటర్‌ రింగురోడ్డు, పీవీ ఎక్స్‌ప్రెస్‌వే, పేదలకు పక్కా ఇళ్లు నిర్మించారని గుర్తుచేశారు. కేసీఆర్‌ మాత్రం బుల్లెట్‌ ప్రూఫ్‌ ఇంట్లో భోగాలు అనుభవిస్తున్నారని ఆరోపించారు. బంగారు తెలంగాణ అని చెబుతూ బార్లు, బీర్ల తెలంగాణగా మార్చేశారని ఆరోపించారు.


ఎన్నికలు వస్తేనే పథకాల స్విచ్‌ ఆన్‌..

ఉప ఎన్నికలు వచ్చినప్పుడే పథకాలకు కేసీఆర్‌ స్విచ్‌ ఆన్‌ చేస్తారని, ఎన్నికలు పూర్తికాగానే స్విచ్‌ ఆఫ్‌ అవుతుందని షర్మిల ఆరోపించారు. దళితుడిని సీఎం చేస్తానని, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తానని చెవుల్లో పూలు పెట్టారని విమర్శించారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సమయంలోనే దళిత బంధు గుర్తుకువచ్చిందని, ఈ పథకాన్ని ఎస్సీ రిజర్వ్‌డ్‌ నియోజకవర్గాల్లో ఎందుకు ప్రారంభించలేదని ప్రశ్నించారు. కాంగ్రె్‌సకు ఓటేస్తే టీఆర్‌ఎ్‌సకు వేసినట్లేనన్నారు. కాగా, షర్మిల పాదయాత్ర మూడో రోజు 14 కిలోమీటర్ల సాగింది.