'స్పెల్లింగ్-బీ' విజేత జైలా అవంత్.. తొలి ఆఫ్రికన్ అమెరికన్‌గా రికార్డ్!

ABN , First Publish Date - 2021-07-09T16:13:17+05:30 IST

ప్రతిష్ఠాత్మక స్ర్కిప్స్‌ నేషనల్‌ 'స్పెల్లింగ్-బీ' పోటీల్లో లూసియానా రాష్ట్రంలోని హర్వేకు చెందిన అఫ్రికన్ అమెరికన్​ జైలా అవంత్​ గార్డె(14) విజేత​గా నిలిచారు.

'స్పెల్లింగ్-బీ' విజేత జైలా అవంత్.. తొలి ఆఫ్రికన్ అమెరికన్‌గా రికార్డ్!

వాషింగ్టన్: ప్రతిష్ఠాత్మక స్ర్కిప్స్‌ నేషనల్‌ 'స్పెల్లింగ్-బీ' పోటీల్లో లూసియానా రాష్ట్రంలోని హర్వేకు చెందిన అఫ్రికన్ అమెరికన్​ జైలా అవంత్​ గార్డె(14) విజేత​గా నిలిచారు. దీంతో ఈ ఘనత సాధించిన తొలి ఆఫ్రికన్​ అమెరికన్​గా ఆమె సరికొత్త రికార్డు సృష్టించారు. అంతేగాక 96 ఏళ్ల 'స్పెల్లింగ్​-బీ' పోటీల చరిత్రలో ఛాంపియన్​గా నిలిచిన రెండో నల్లజాతీయురాలు కూడా జైలానే. ఫోర్లిడా రాష్ట్రంలోని లేక్​ బ్యూయేనా విస్టా వేదికగా గురువారం రాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) ఈ పోటీలు జరిగాయి. మొత్తం 11 మంది ఫైనలిస్టుల్లో 9 మంది భారత సంతతి బాలలు ఉండగా.. వారందరినీ వెనక్కి నెట్టి జైలా విజేతగా నిలిచారు. భారత సంతతికి చెందిన చైత్ర తుమ్మల రన్నరప్​తో సరిపెట్టుకున్నారు. కాగా, జైలా, చైత్ర ఇద్దరూ 2015 'స్పెల్లింగ్​-బీ' రన్నరప్​ వద్ద శిక్షణ పొందారు. 


ఇద్దరిలో జైలా చాంఫియన్‌గా ట్రోఫీ గెలిస్తే, చైత్ర రన్నరప్‌గా నిలవడం విశేషం. ఇక ఛాంపియన్‌గా నిలిచిన జైలా తొలి ఆఫ్రికన్ అమెరికన్‌గా, రెండో నల్లజాతీయురాలిగా చరిత్ర సృష్టించారు. జైలా కంటే ముందు 1998లో జోడి అన్నీ మ్యాక్స్​వెల్​ అనే విద్యార్థిని ఈ పోటీల్లో గెలిచిన తొలి నల్లజాతీయురాలు. ఇక ఈ కార్యక్రమానికి హాజరైన అమెరికా ప్రథమ మహిళ జిల్​ బైడెన్​ విజేత జైలాను అభినందించారు. అంతకుముందు 11 మంది ఫైనలిస్టులతో పాటు వారి కుటుంబ సభ్యులను జిల్ కలిసి ముచ్చటించారు. ఇదిలాఉంటే.. బాస్కెట్​బాల్​ క్రీడాకారిణి అయిన జైలా పేరిట మూడు గిన్నిస్ బుక్ రికార్డులు కూడా ఉన్నాయి.​ ఒకటి కన్నా ఎక్కువ బంతులతో బాస్కెట్​బాల్​ ఆడినందుకు ఆమె గిన్నీస్ బుక్ రికార్డుకెక్కారు. 



Updated Date - 2021-07-09T16:13:17+05:30 IST