కుమ్మెక్కు

ABN, Publish Date - Feb 11 , 2024 | 01:12 AM

జిల్లా కేంద్రంలో అక్రమ కట్టడాలు అడ్డదిడ్డంగా వెలుస్తున్నాయు. నిబంధనలకు విరుద్ధంగా పెద్ద పెద్ద భవనాలు కట్టేస్తున్నారు. ముడుపులు ముట్టజెబితే చాలు..! నగరపాలిక టౌనప్లానింగ్‌ అధికారులు ఆ భవనం వైపే చూడటం లేదు. ఈ క్రమంలో అధికార వైసీపీ కార్పొరేటర్లు ఆ అక్రమ భవనాల యజమానుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు

కొందరు కార్పొరేటర్లు, టౌనప్లానింగ్‌ అధికారుల దందా

నగరంలో ఇష్టారాజ్యంగా అక్రమ కట్టడాలు

ఒక్కో భవనం నుంచి కనీసం రూ.3లక్షలు

బెటర్‌మెంట్‌, ఇంపాక్ట్‌ ఫీజులకు ఎగనామం

కొత్త కమిషనర్‌ దృష్టి సారించేరా..?

అనంతపురం క్రైం: జిల్లా కేంద్రంలో అక్రమ కట్టడాలు అడ్డదిడ్డంగా వెలుస్తున్నాయు. నిబంధనలకు విరుద్ధంగా పెద్ద పెద్ద భవనాలు కట్టేస్తున్నారు. ముడుపులు ముట్టజెబితే చాలు..! నగరపాలిక టౌనప్లానింగ్‌ అధికారులు ఆ భవనం వైపే చూడటం లేదు. ఈ క్రమంలో అధికార వైసీపీ కార్పొరేటర్లు ఆ అక్రమ భవనాల యజమానుల నుంచి వసూళ్లకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో టౌనప్లానింగ్‌ అధికారులు, కార్పొరేటర్లు కుమ్మక్కయ్యారనే విమర్శలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. గత కొన్నేళ్లుగా నగరంలో ఇదే వ్యవహారం నడుస్తోంది. చాలా కాలం తరువాత నగర కమిషనర్‌గా ఐఏఎస్‌ అధికారి మేఘస్వరూప్‌ వచ్చారు. ఈయన అయిన అక్రమ భవన నిర్మాణాలు, అధికారులు ఆమ్యామ్యాలు, కార్పొరేటర్ల సహకారంపై దృష్టి సారిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

ఆ ఇద్దరూ అలా పంచుకున్నారు...

నగరంలోని ఉమానగర్‌లో ఓ బిల్డింగ్‌కు సంబంధించి ఇద్దరికి లెక్కల బేరం కుదిరింది. 001/ 0310/బి/ఏటీపీ/2023 ఎల్‌పీ నెంబరులో ఓ మరాఠీ వ్యాపారి భవనం నిర్మిస్తున్నాడు. టౌనప్లానింగ్‌ విభాగంలో స్టిల్ట్‌, జీప్ల్‌స2కు అప్రూవల్‌ తీసుకున్నారు. ఇక్కడ సెల్లార్‌కు అనుమతి తీసుకోలేదు. కానీ అదనంగా సెల్లార్‌ కోసం తవ్వేశారు. ఇందుకు అనధికారికంగా అధికారులు అనుమతిచ్చేశారు. ఈ వ్యవహారంలో రూ.5లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. అందులో చెరో రూ.2.5 లక్షలు ఇద్దరు పంచుకున్నారు. ఇందులో ఒకరు టౌనప్లానింగ్‌ అధికారి కాగా మరొకరు పాలకవర్గంలో కీలక మహిళా కార్పొరేటర్‌ భర్త కావడం గమనార్హం. భవనం పూర్తి కాకమునుపే పైసలు జేబుల్లో నింపుకోవడం ఇక్కడ చాలా కామనగా జరిగిపోతుందట.

బెటర్‌మెంట్‌ చార్జీనే ఎగ్గొట్టారు..

నగరంలోని మారుతీనగర్‌లో ఓ బిల్డింగ్‌కు బెటర్‌మెంట్‌ చార్జెస్‌నే ఎగరకొట్టారు. ఎల్‌టీపీగా ఉన్న ఓ వ్యక్తి లాగినను బ్లాక్‌ చేశారు. కానీ మరో ఎల్‌టీపీ లాగిన నుంచి ఆ బిల్డింగ్‌ అప్రూవల్‌కు పెట్టుకున్నాడు. 1001/0375/బీ/ఏటీపీ/ఎంఆర్‌టీఎన/2023 ఎల్‌పీలో బిల్డింగ్‌కు నాన అప్రూ వల్‌ లేఅవుట్‌. ఇందుకు 14శాతం బెటర్‌మెంట్‌ చార్జెస్‌ చెల్లించాలి. జీప్లస్‌2 కింద అనుమతి వచ్చింది. కానీ బెటర్‌మెంట్‌ చార్జెస్‌ ఎగ్గొట్టారు. చాలా అక్రమ కట్టడాల్లో భాగమున్న ఈ డూప్లికేట్‌ ఎల్‌టీపీకి టౌనప్లానింగ్‌ అధికారులతో లెక్కల సంబంధాలు బాగానే ఉన్నాయి. దీంతో ఆ బెటర్‌మెంట్‌ చార్జెస్‌ లేకుండా టౌనప్లానింగ్‌ అధికారి రూ.6లక్షలు పుచ్చుకున్నారట. ఇందులో టౌనప్లానింగ్‌ ఉన్నతాధికారికి సైతం వాటా వెళ్లినట్లు సమాచారం.

ఇంపాక్ట్‌ ఫీజుకు ఎసరు...

నగరంలోని సూర్యానగర్‌ పరిధి రాజురోడ్డులో ఉండే ఓ భవనం ఇంపాక్ట్‌ ఫీజుకు ఎసరు పెట్టారు. 1001/0625/బీ/ఏటీపీ ఎల్‌పీ నెంబరు కింద స్టిల్ట్‌, జీప్లస్‌2కు అనుమతి తీసుకున్నారు. సెల్లార్‌కు అనుమతి లేకపోయినా పెద్ద గుంతనే తవ్వేశారు. ఇక ప్రధాన రహదారుల్లో నిర్మించే భవనాలకు ఇంపాక్ట్‌ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ మేరకు ఇంపాక్ట్‌ ఫీజు రూ.3.26లక్షలు విధించారు. ఆ ఫీజు ఎగ్గొట్టేలా చేశారు. ఇంపాక్ట్‌ ఫీజు ఎగనామాకు, సెల్లార్‌ తవ్వినందుకు గాను ఇక్కడ టౌనప్లానింగ్‌ అధికారి రూ.3లక్షలు వసూలు చేసినట్లు సమాచారం.

మూడు సెంట్లలోనే సెల్లార్‌...

నగరంలోని కమలానగర్‌ డీసీఎంఎస్‌ రోడ్డులో మూడు సెంట్లలోపు ఉన్న స్థలంలోనే సెల్లార్‌ తవ్వేశారు. నగరంలో ఆ సంస్థకు బిల్డింగ్‌ల విషయంలో బాగానే అనుభవముంది. చాలా తక్కువ సెంట్లలో సెల్లార్‌ తవ్వేశారు. ఇందుకోసం టౌనప్లానింగ్‌ అధికారులకు భారీగానే ముడుపులు అందినట్లు సమాచారం. టౌనప్లానింగ్‌ విభాగంలో ఓ ఉన్నతాధికారికి, కిందిస్థాయి అధికారికి ప్రతి బిల్డింగ్‌లో సగం సగం వాటా పంచుకునే అలవాటు ఉందట. అందులో భాగంగానే దీనికి అనుమతులిచ్చేసినట్లు సమాచారం.

నగరంలోని విద్యుతనగర్‌ సర్కిల్‌ సమీపంలోని ఓ భవన నిర్మాణానికి సంబంధించి రూ.8లక్షల నుంచి రూ.10లక్షలు వసూలు చేశారు. ఇందులోనూ 14శాతం బెటర్‌మెంట్‌ చార్జెస్‌ చెల్లించకుండా ఎగ్గొట్టినట్లు సమాచారం. ఓ అధికారి, ఓ వైసీపీ నేత, మరో ప్రైవేట్‌ వ్యక్తి ఇందులో జోక్యం చేసుకున్నట్లు సమాచారం.

సెల్లార్ల తవ్వకాలపై చర్యలు తీసుకుంటాం

నగర పరిధిలో అనుమతుల్లేకపోయినా సెల్లార్లు తవ్వుతున్న విషయం వాస్తవమే. ఇంపాక్ట్‌ ఫీజుల ఎగవేత విషయంలోనూ కొందరికి నోటీసులిచ్చాం. కొన్ని భవనాలకు సంబంధించి ఫీజులు కట్టించాం. అనధికారిక కట్టడాలపై చర్యలు తీసుకుంటాం.

- హరిప్రసాద్‌, ఏసీపీ, నగరపాలిక

Updated at - Feb 11 , 2024 | 01:12 AM