Share News

AP ELECTIONG : మాట ఇచ్చారు.. మడమ తిప్పారు..!

ABN , Publish Date - May 09 , 2024 | 12:49 AM

కరువు నేలకు సాగునీరు జీవం పోస్తుంది. వ్యవసాయమే జీవనాధారమైనచోట రైతులు మొదట ఆశించేది నీటినే. కాలువ నీటితో పొలాలను పచ్చగా మార్చేందుకు చెమటోడుస్తారు. నీరే లేకుంటే కుదేలైపోతారు. ఎప్పుడు కురుస్తుందో తెలియని వానకోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసి.. అలసిపోవడం ఇక్కడి ప్రజలకు అలవాటైంది. ‘మా బతుకులు ఇంతేనా..?’ అని ఆవేదన పడే సమయంలో.. ‘మారుస్తాం.. నీరిస్తాం..’ అని ఎవరు చెప్పినా విశ్వసిస్తారు. ఆశపడి.. ఆదరిస్తారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన ఇలాంటి హామీనే ...

AP ELECTIONG : మాట ఇచ్చారు.. మడమ తిప్పారు..!
A scene of digging a canal and mounding the soil in the field

హామీకి పరిమితమైన బీటీపీ కాలువ..

14 చెరువులకు కృష్ణా జలాలు ఉత్తిదే..

భూనిర్వాసితులకు అందని పరిహారం

అటకెక్కిన దుర్గం సమగ్ర తాగునీటి పథకం

నేడు కళ్యాణదుర్గానికి సీఎం జగన..!

కరువు నేలకు సాగునీరు జీవం పోస్తుంది. వ్యవసాయమే జీవనాధారమైనచోట రైతులు మొదట ఆశించేది నీటినే. కాలువ నీటితో పొలాలను పచ్చగా మార్చేందుకు చెమటోడుస్తారు. నీరే లేకుంటే కుదేలైపోతారు. ఎప్పుడు కురుస్తుందో తెలియని వానకోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసి.. అలసిపోవడం ఇక్కడి ప్రజలకు అలవాటైంది. ‘మా బతుకులు ఇంతేనా..?’ అని ఆవేదన పడే సమయంలో.. ‘మారుస్తాం.. నీరిస్తాం..’ అని ఎవరు చెప్పినా విశ్వసిస్తారు. ఆశపడి.. ఆదరిస్తారు. వైసీపీ అధినేత వైఎస్‌ జగన ఇలాంటి హామీనే ఇచ్చారు. జీడిపల్లి నుంచి భైరవాన తిప్ప ప్రాజెక్టుకు కాలువ తవ్వించి.. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల పరిధిలో 114 చెరువులకు నీరిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఐదేళ్ల పుణ్యకాలం గడిచిపోయింది. హామీ నెరవేరలేదు. రైతుల బతుకులు మారలేదు. ఈ ఒక్కటే కాదు.. ఇంకా చాలా హామీలు గాలిలో కలిసిపోయాయి.

- కళ్యాణదుర్గం


బీటీపీ కాలువ నత్తనడక

భైరవాన తిప్ప ప్రాజెక్టుకు నీరు చేరాలంటే.. జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి కళ్యాణదుర్గం నియోజకవర్గం మీదుగా కాలువ తవ్వాలి. ఈ కాలువ పూర్తి అయితే 114 చెరువులకు నీరు అందుతుంది. ఈ పనులు చేస్తామని 2014, 2019 ఎన్నికల సమయంలో జగన హామీ ఇచ్చారు. తాజాగా అదే హామీ ఇచ్చేందుకు మరోమారు కళ్యాణదుర్గానికి వస్తున్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలలో ఎప్పుడు సభలు జరిగినా సాగునీటిపై జగన హామీలు ఇస్తుంటారు. కానీ అమలు గురించి పట్టించుకోవడం లేదు. ఐదేళ్ల కాలంలో కేవలం 5 కి.మీ. మాత్రమే పనులు చేశారు. బీటీపీ కాలువ పనుల కోసం కళ్యాణదుర్గం నియోజకవర్గంలో 1406 ఎకరాల భూమిని సేకరించారు. ఇప్పటి వరకూ 289 ఎకరాలకు మాత్రమే పరిహారం ఇచ్చారు. ఇంకా 629 ఎకరాలకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. పనులు ఆగిపోవడంతో బీటీపీ ప్రాజెక్టు కోసం ఉపయోగించాల్సిన యంత్రాలన్నీ తుప్పుపట్టిపోతున్నాయి. కళ్యాణదుర్గం పరిధిలోని ఒంటిమిద్దె గ్రామం వద్ద ఒక పొలంలో వీటిని పడేశారు.

ఇదీ పథకం..

హంద్రీ-నీవా పథకంలో భాగంగా జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి 3.70 టీఎంసీలను ఎత్తిపోసి, అందులో 1.7 టీఎంసీలను కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని 114 చెరువులకు తరలించాలి. మిగిలిన రెండు టీఎంసీలను భైరవానతిప్పకు తరలించాలి. తద్వారా బీటీపీ కింద 22,300 ఎకరాలకు నీరు అందించాలి. జీడిపల్లి నుంచి బీటీపీ ప్రాజెక్టు వరకు 32.625 కి.మీ. పొడవున ఒక కాలువ, కుందుర్పి వరకు 32.250 కి.మీ. పొడవున మరో కాలువ తవ్వాలి. ఈ పనులు


పూర్తయితే బెళుగుప్ప, కళ్యాణదుర్గం, కంబదూరు, కుందుర్పి, శెట్టూరు, బ్రహ్మసముద్రం గుమ్మఘట్ట మండలాల్లోని గ్రామాలకు నీరు అందుతుంది. సాగు, తాగునీటి కష్టం తీరుతుంది. భూగర్భ జలాలు సైతం పెరుగుతాయి.

పరిహారం ఏదీ..?

కుందుర్పి బ్రాంచ కాలువ నిర్మాణానికి భూములను సేకరించారు. కానీ రైతులకు పరిహారం ఇవ్వలేదు. సీఎం జగన కళ్యాణదుర్గంలో పర్యటించినప్పుడల్లా పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ పైసా ఇవ్వలేదని బాధిత రైతులు వాపోతున్నారు. కుందుర్పి మండల పరిధిలోని ఎనుములదొడ్డి, కరిగానపల్లి రైతులకు పరిహారం అందించారు. అపిలేపల్లి, బెస్తరపల్లి, కుందుర్పి రైతులకు పరిహారం ఇవ్వలేదు. కాలువ కోసం తవ్విన మట్టి పొలాల్లోకి వేయడంతో సాగుకు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఐదేళ్లు నుంచి పరిహారం కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేసినా ఫలితం లేకపోయిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రెవెన్యూ అధికారులకు పరిహారం మంజూరు చేయడానికి అనుమతి లేదు. హంద్రీనీవా ప్రాజెక్టు అధికారులు మాత్రమే పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వారుకూడా మాటలే పరిమితమయ్యారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తాగునీటికి నిరీక్షణ

కళ్యాణదుర్గం పట్టణానికి సమగ్ర తాగునీటిని అందించాలనే సంకల్పంతో ప్రారంభించిన ప్రత్యేక పథకం పునాదులు దాటలేదు. మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటికి కొళాయి ఏర్పాటు చేసి, 24 గంటలు నీటిని సరఫరా చేయడానిని ఏషియన ఇనఫ్రాస్ట్రక్చర్‌ ఇన్వె్‌స్టమెంట్‌ బ్యాంకు (ఏఐఐబబీ) సహకారంలో రూ.139 కోట్లతో ఈ పథకాన్ని చేపట్టారు. 2020లో నాటి పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రి ఉషశ్రీ చరణ్‌ కన్నేపల్లి రోడ్డులోని సచివాలయం వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఆ తరువాత రెండేళ్లకు ట్యాంకు నిర్మాణ పనులు చేపట్టారు. శంకుస్థాపన చేసిన చోట, కళ్యాణదుర్గం గ్రామీణ పోలీస్‌ స్టేషన


సమీపంలోని ఉద్యానవనంలో ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణ పనులు ప్రారంభించి వదిలేశారు. మొత్తం 5 లక్షల లీటర్ల సామర్థ్యం కలిగిన ఆరు ట్యాంకర్లు నిర్మించాల్సి ఉండగా.. రెండింటికి మాత్రమే పునాదులు వేశారు. కానీ నిధులు మంజూరు కాకపోవడంతో వాటిని కూడా వదిలేశారు. పార్వతీ నగర్‌ కాలనీలోని పలు వీధుల్లో మొదటి విడత పైపులు వేశారు. ఆ తరువాత వదిలేశారు.

నేడు కళ్యాణదుర్గానికి సీఎం జగన

ఎన్నికల ప్రచారం కోసం సీఎం జగన గురువారం కళ్యాణదుర్గానికి వస్తున్నారు. పట్టణంలోని కొల్లాపురమ్మ ఆలయం నుంచి వాల్మీకి సర్కిల్‌ వరకు ఆయన రోడ్‌షో నిర్వహిస్తారు. కస్తూర్బా పాఠశాల వద్ద అధికారులు హెలిప్యాడ్‌ను సిద్ధం చేశారు.


పరిహారం ఇవ్వలేదు..

నాకున్న ఐదు ఎకరాలలో ఒకటిన్నర ఎకరా వరకు కుందుర్పి బ్రాంచ కెనాల్‌ కోసం ఇచ్చాను. నాలుగేళ్లు కావస్తున్నా ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదు. పైగా కాలువ తవ్వి.. మట్టిని పొలంలో దిబ్బలుగా పడేశారు. దీంతో పంట సాగుచేసుకోలేక పోతున్నాం. అప్పులు చేసి ఎకరా విస్తీర్ణంలో మట్టి దిబ్బలను తొలగించి పంట సాగుకు ప్రయత్నిస్తున్నాం.

- షరీఫ్‌, అపిలేపల్లి, కుందుర్పి మండలం

ఎకరం భూమి ఇచ్చాం..

నాకున్న ఐదు ఎకరాలలో ఒక ఎకరం కాలువ కోసం ఇచ్చాం. నాలుగేళ్లయినా పరిహారం ఇవ్వలేదు. ఎప్పుడిస్తారో అధికారులు స్పష్టంగా చెప్పడం లేదు. ఎన్నిసార్లు ఆందోళన చేసినా, అర్జీలు ఇచ్చినా ఫలితం లేదు.

- రామాంజనేయులు, అపిలేపల్లి, కుందుర్పి మండలం

మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - May 09 , 2024 | 12:49 AM