ముఖం చాటేసిన టెక్‌ మాంత్రిక్‌

ABN, Publish Date - Feb 15 , 2024 | 01:28 AM

విశాఖపట్నంలో ఐటీ సదస్సుల పేరుతో హడావుడి చేసే బృందాలు పెరిగిపోతున్నాయి. రుషికొండలో ఐటీ కంపెనీ పెట్టి, ఉద్యోగాల పేరుతో డబ్బులు దండుకొని, పోలీస్‌ కేసులో ఇరుక్కున్న కంపెనీతో ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ గత ఏడాది స్వర్ణ భారతి స్టేడియంలో ఓ సదస్సు నిర్వహించిన సంగతి తెలిసిందే.

‘స్మైల్‌ ఆంధ్రా’ పేరుతో రెండు రోజులుపాటు

ఐటీ సదస్సు నిర్వహిస్తున్నట్టు హడావుడి

రిజిస్ట్రేషన్‌ ఫీజుగా రూ.2 వేలు వసూలు

అతిథులుగా నగర ప్రముఖులకు ఆహ్వానం

ఆఖరి నిమిషంలో క్యాన్సిల్‌

విశాఖపట్నం, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి):

విశాఖపట్నంలో ఐటీ సదస్సుల పేరుతో హడావుడి చేసే బృందాలు పెరిగిపోతున్నాయి. రుషికొండలో ఐటీ కంపెనీ పెట్టి, ఉద్యోగాల పేరుతో డబ్బులు దండుకొని, పోలీస్‌ కేసులో ఇరుక్కున్న కంపెనీతో ఏపీ ఇన్నోవేషన్‌ సొసైటీ గత ఏడాది స్వర్ణ భారతి స్టేడియంలో ఓ సదస్సు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎన్ని విమర్శలు వచ్చినా ఓ ఉన్నతాధికారి వెన్నుదన్నుగా ఉండి ఈ కార్యక్రమం నిర్వహించారు. తాజాగా మరో సంస్థ ఇంకో భారీ ప్రయత్నం చేసి...చివరి నిమిషంలో ముఖం చాటేసింది. ఏపీ మెడ్‌టెక్‌ జోన్‌లో స్టార్టప్‌గా పనిచేసిన ‘టెక్‌ మాంత్రిక్‌’ అనే సంస్థ ‘స్మైల్‌ ఆంధ్రా’ పేరుతో ఇండస్ట్రియల్‌ ఇన్నోవేషన్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ సదస్సు నిర్వహించడానికి నడుం కట్టింది. ఈ నెల 14, 15 తేదీల్లో ఈ సదస్సు నిర్వహణ కోసం సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ చిల్డ్రన్‌ ఎరీనాను బుక్‌ చేసింది. దీనికి 1,400 డెలిగేట్లు, 500 సంస్థలు, 100 స్టార్టప్‌లు, 100 ఎంఎస్‌ఎంఈలు, 60 మంది స్పీకర్లు, 50 మంది ఇన్వెస్టర్లు వస్తున్నారని, 30 సెషన్లు నిర్వహిస్తామని ప్రకటించింది. రిజిస్ట్రేషన్‌ రుసుము రూ.2 వేలుగా నిర్ణయించింది. దీనికి కేంద్ర ఐటీ శాఖ సహకారం అందిస్తున్నదని కరపత్రంలో ముద్రించింది. దాంతో పాటు ఏయూకు చెందిన ఆ హబ్‌, భాగవతుల చారిటబుల్‌ ట్రస్టు, ఇంకో రెండు సంస్థలు అండగా ఉన్నాయని ప్రచారం చేసుకుంది. ఐటీ రంగంలో ఎన్ని అంశాలు ఉన్నాయో అన్నింటిపైనా ఇక్కడ చర్చ జరుగుతుందని పేర్కొంది. ఏరోస్పేస్‌, డిఫెన్స్‌, డీప్‌ టెక్నాలజీస్‌, లాజిస్టిక్స్‌, పెట్రో కెమికల్స్‌, ఫార్మా, మెరైన్‌, టూరిజం, బ్లాక్‌చెయిన్‌, టెక్స్‌టైల్స్‌, హెల్త్‌, బయోటెక్‌, ఐఓటీ, స్మార్ట్‌ సిటీ, ఇండస్ర్డీ 4.ఓ., వెబ్‌ 3...ఇలా అన్నింటిపై చర్చిస్తామని, పెట్టుబడుల వరద పారిస్తామని ఊదరగొట్టింది. ఏయూ వీసీ, నగర పోలీస్‌ కమిషనర్‌, కలెక్టర్‌, ఇంకా ఇతర ప్రముఖులు దీనికి కీ స్పీకర్లుగా వస్తున్నారని ప్రకటించింది. ఈ సదస్సు బుధవారం ప్రారంభమై, గురువారం సాయంత్రం ముగియాలి. ఏమి జరిగిందో తెలియదు గానీ కార్యక్రమం నిర్వహించలేదు. బుధవారం చిల్డ్రన్‌ థియేటర్‌లో ఒక్కరూ లేరు. అనుమానం వచ్చి రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే అది డౌన్‌ చేసి ఉంది. అందులో ‘వియ్‌ విల్‌ కమ్‌ బ్యాక్‌ సూన్‌’ అని బోర్డు పెట్టేశారు. ఓ మంత్రి ‘ఇప్పుడు ఈ కార్యక్రమం వద్దు’ అన్నారని, అందుకే ఆపేశారని అంటున్నారు. అయితే ఆహ్వానించిన వారిలో చాలామంది పెద్దలు రావడానికి ఆసక్తి చూపకపోవడం, నిర్వాహకులకు అంత క్రెడిబులిటీ లేదని పెదవి విరిచేయడంతో కార్యక్రమం తుస్సుమంటుందనే కార్యక్రమం క్యాన్సిల్‌ చేసుకున్నారనే ప్రచారం కూడా ఉంది. వాస్తవానికి టెక్‌ మాంత్రిక్‌ పెద్ద కంపెనీ ఏమీ కాదు. కేవలం స్టార్టప్‌. వీరిని అడ్డం పెట్టుకొని వైసీపీ పెద్దలు విశాఖలో ఐటీ ఊగిపోతున్నదని ప్రచారం చేయడానికి, పెట్టుబడులు పెట్టడానికి చాలామంది ఆసక్తి ప్రదర్శిస్తున్నారని ఎన్నికల ముందు షో చేయడానికి ‘ఆడుదాం...ఆంధ్రా’లా ‘స్మైల్‌ ఆంధ్రా’ నిర్వహించాలనుకున్నారని చెబుతున్నారు. ఇదిలావుండగా రూ.2 వేలు చెల్లించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారి పరిస్థితి ఏమిటో ఎవరూ చెప్పలేకపోతున్నారు.

Updated at - Feb 15 , 2024 | 01:28 AM