Share News

సీఎం జిల్లాలోనూ కాంగ్రెస్‌ గెలవదు..

ABN , Publish Date - Apr 28 , 2024 | 05:50 AM

సీఎం సొంత జిల్లాలోనూ కాంగ్రెస్‌ పార్టీ గెలవడం కష్టమేనని, అందుకే ఇన్‌చార్జి బాధ్యతల నుంచి రేవంత్‌ తప్పుకొన్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు.

సీఎం జిల్లాలోనూ కాంగ్రెస్‌ గెలవదు..

అందుకే ఇన్‌చార్జి పదవి నుంచి రేవంత్‌ వైదొలిగారు : కేటీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి) : సీఎం సొంత జిల్లాలోనూ కాంగ్రెస్‌ పార్టీ గెలవడం కష్టమేనని, అందుకే ఇన్‌చార్జి బాధ్యతల నుంచి రేవంత్‌ తప్పుకొన్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆరోపించారు. రానున్న రోజుల్లో రేవంత్‌ రెడ్డి కచ్చితంగా బీజేపీలో చేరుతారని పునరుద్ఘాటించారు. ఇప్పటికే తాను 20 సార్లు ఈ విషయాన్ని చెప్పినా ఆయన ఎందుకు స్పందించడం లేదంటే.. అర్థమేంటని ప్రశ్నించారు.


అసెంబ్లీ ఎన్నికల వేళ మోసం పార్ట్‌-1ను ఎంచుకున్న రేవంత్‌.. ఇప్పుడు మోసం-2ను ప్రారంభించారని ధ్వజమెత్తారు. ఆగస్టు 15లోగా రుణ మాఫీ పేరుతో రేవంత్‌ రెడ్డి మరోసారి రైతుల్ని మోసం చేసి పని పెట్టుకున్నాడని విమర్శించారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్‌ మీడియాతో చిట్‌ చాట్‌ చేశారు. కాంగ్రెస్‌ చెప్పిన మాటలు నమ్మి మోసపోయామని ప్రజలందరికీ అర్థమైందని తెలిపారు. మరో సారి మోసపోకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందన్నారు. రేవంత్‌రెడ్డిది మాట నిలుపుకొన్న చరిత్ర కాదని, కొడంగల్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని మాట తప్పారని గుర్తు చేశారు.


వంద రోజుల్లో అమలు చేస్తామన్న హామీలను 250 రోజులైన తర్వాత కూడా అమలు చేయనందునే రేవంత్‌ స్పందించాలని హరీశ్‌రావు నిలదీశారని అన్నారు. దమ్ముంటే హరీశ్‌రావు విసిరిన రాజీనామా సవాల్‌కు సీఎం స్పందించాలన్నారు. తమకు ఉన్న సమాచారం మేరకు ఏపీలో జగన్మోహన్‌రెడ్డి గెలిచే అవకాశం ఉందని తెలిపారు. మల్కాజ్‌గిరికి సంబంధించి మల్లారెడ్డి చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకమేనని, ఈటల రాజేందర్‌ను మునగ చెట్టు ఎక్కించారని చెప్పారు. ఆ మాటల వెనుక అంతరార్థం తెలియక చాలా మంది ఆగమాగమైతున్నారని ఎద్దేవా చేశారు.

Updated Date - Apr 28 , 2024 | 06:48 AM