తగ్గినట్టే...
ABN , First Publish Date - 2020-12-02T06:08:22+05:30 IST
కన్నీళ్లు పెట్టించిన ఉల్లి ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. రూ.100కు పైబడి పెరిగిన ఉల్లి ధర నెమ్మదిగా తగ్గుతూ ప్రస్తుతం నాణ్యమైన సరుకు ధర కిలో రూ. 40కి అందుబాటులోకి వచ్చింది. ఇది హోల్‌సేల్ ధర. ఇందులో రెండో రకం కిలో రూ.30 వరకూ ఉండగా, నాసిరకం పాయలు కిలో
ఉల్లి నంబరు వన్ కిలో రూ.40 8 తక్కువ రకం కిలో రూ.25
బంగాళాదుంపలు మొన్నటిదాకా కిలో రూ.41..ఇప్పుడు రూ.36
ఈనెలాఖరుతో ముగియనున్న సరుకు గొడౌన్ల ఒప్పందం
దాంతో ధరలు మరింత దిగువకు
ఆయిల్ ధరలు సలసల
(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
కన్నీళ్లు పెట్టించిన ఉల్లి ధరలు నెమ్మదిగా తగ్గుతున్నాయి. రూ.100కు పైబడి పెరిగిన ఉల్లి ధర నెమ్మదిగా తగ్గుతూ ప్రస్తుతం నాణ్యమైన సరుకు ధర కిలో రూ. 40కి అందుబాటులోకి వచ్చింది. ఇది హోల్‌సేల్ ధర. ఇందులో రెండో రకం కిలో రూ.30 వరకూ ఉండగా, నాసిరకం పాయలు కిలో రూ.25 దాకా ఉన్నాయి. బయట మార్కెట్‌లో మాత్రం ధరలు ఇంకా తగ్గించలేదు. ఇక్కడ ఓ మోస్తరు ఉల్లిని రిటైల్ మార్కెట్‌లో రూ.50 నుంచి రూ.70 వరకూ అమ్ముతున్నారు. హోల్‌సేల్ ధరలు బాగా తగ్గినందున ఇక్కడా ధర తగ్గించక తప్పదు. రైతుబజార్లలో తక్కువ ధరకు అమ్మాలని నిర్ణయించడంతో ధర తగ్గించి విక్రయిస్తున్నా నాసిరకం పాయలే అమ్ము తున్నారు. రెండ్రోజుల కిందట వరకూ హోల్‌సేల్‌లో కిలో రూ.36కి కొనుగోలు చేసిన రైతుబజార్ వ్యాపారులు కిలో రూ.43కి అమ్మారు. మంగళవారం నుంచి రూ.40కి అమ్ముతున్నారు. ఇక్కడ నంబర్ వన్ పాయలు అమ్మినా జనం కొంటారు. కానీ ఎస్టేట్ ఆఫీసర్లు కేవలం నాసిరకం మాత్రమే అమ్మిస్తున్నారు. సాధారణంగా రైతు బజార్లలో కూరగాయలు, ఆకుకూరల ధరలు బాగా అందుబాటులో ఉంటాయి. ఇక్కడికి బయటి మార్కెట్‌కు రెట్టింపు తేడా ఉంటుంది. ఉల్లి ధర తగ్గే సమయంలోనైనా ఎస్టేట్ ఆఫీసర్లు రైతుబజార్లలో నంబర్ వన్ రకం అమ్మిస్తే బావుంటుంది.
తగ్గుతున్న బంగాళా దుంప ధరలు
బంగాళాదుంప ధరలు కూడా తగ్గుముఖం పట్టాయి. గతేడాది కిలో రూ.20లోపే హోల్‌సేల్ ధర ఉండేది. రిటైల్‌లో రూ.25కంటే ఎక్కువ ఉండేది కాదు. ఈ ఏడాది రూ.41 వరకూ పెరిగింది. రిటైల్ ధర రూ.45 నుంచి 50 వరకూ అమ్మేశారు. మంగళవారం నుంచి ఈ దుంపల ధరలు తగ్గుముఖం పట్టాయి. హోల్‌సేల్ ధర రూ.36కి పడిపోయింది. ఈ ధర మరింత పతనం కానుంది. ఎందుకంటే బంగాళా దుంపలను వ్యాపారులు స్టోరేజీ చేస్తుంటారు. ఈ స్టోరేజీలను జనవరి తర్వాత ఆరు నెలల నుంచి ఏడాది వరకూ అద్దెకు తీసుకుంటారు. పచ్చిసరుకు వచ్చిన వెంటనే నిల్వచేసి వారి ఇష్టానుసారం అమ్ముతుంటారు. ఈనెలాఖరుకి అన్ని ప్రాంతాల్లోని గొడౌన్ల ఒప్పందం ముగియనుంది. మళ్లీ జనవరి నుంచి ఒప్పందం కుదుర్చుకుంటారు. దీంతో దాచిన సరుకంతా మార్కెట్‌లోకి వచ్చేస్తోంది. దీంతో ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ నెలాఖరుకి బాగా తగ్గుతాయి.
ఆయిల్ ధరలు పైపైకి..
ఆయిల్ ధరలు మాత్రం సలసల మరిగిపోతున్నాయి. లాక్‌డౌన్ సమయం నుంచి ఈ ధరలు పెరగడం మొదలెట్టాయి. సన్‌ఫ్లవర్ ప్యాకెట్ రూ.95 వరకూ ఉండేది. ఇప్పుడు రూ.128 అయింది. వేరుశెనగ రూ.100 ఉండేది ఇవాళ రూ.135 అయింది. పామాయిల్ రూ.60 నుంచి ఏకంగా రూ.100కి చేరింది. ఆయిల్ పంటలు బాగానే ఉన్నాయి. కానీ ఈ ధరలు ఎందుకు పెరిగాయనేది అంతుపట్టని మార్కెట్ రహస్యం. ఇక పప్పుల ధరలు మామూలుగానే ఉన్నాయి. కందిపప్పు నంబరు వన్ రకం కిలో రూ.96 ఉండగా, రెండో రకం రూ.86 ఉంది. పెసరపప్పు ధర కిలో రూ.90, శెనగపప్పు ధర రూ.68, పంచదార కిలో రూ.36, మైదా కేజీ రూ.30, మిన పప్పు ధర కిలో రూ.98, మినపగుళ్లు కిలో రూ.115, వేరుశెనగ గుళ్లు కిలో రూ.100 ఉన్నాయి. చింతపండు కిలో రూ.100 నుంచి రూ.150 వరకూ ఉన్నాయి.