‘అసలు మేం మనుషులమో.. యంత్రాలమో తెలియడం లేదు..’

ABN , First Publish Date - 2020-12-16T05:18:17+05:30 IST

జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో దాదాపు 14వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.

‘అసలు మేం మనుషులమో.. యంత్రాలమో తెలియడం లేదు..’

మనుషులమా.. యంత్రాలమా?

ఉపాధ్యాయుల తీవ్ర ఆందోళన

పని ఒత్తిడితో విలవిల!

సగం మంది బోధనేతర పనుల్లోనే నిమిగ్నం

పాఠశాల విద్యాశాఖ అడిగే సమాచారం కోసం మల్లగుల్లాలు

   

ట్రాన్స్‌ఫర్‌ ఆప్షన్స్‌కు డెడ్‌లైన్‌.. అమ్మఒడి కోసం విద్యార్థుల డేటా సేకరణ పూర్తి చేయాలి.. నాడు నేడు పనుల గడువూ అప్పుడే..!  ఇది చాలదన్నట్లు డ్రై రేషన్‌ తనిఖీలు, దీక్ష యాప్‌లో జగనన్న కిట్ల పంపిణీ అప్‌లోడ్‌.. పోస్టుల బ్లాక్‌లు, స్పౌజ్‌లు.. అసలు మేం మనుషులమో.. యంత్రాలమో తెలియడం లేదు..

 - ఓ ఉపాధ్యాయుడి ఆవేదన ఇది. 

 

గుంటూరు(విద్య), డిసెంబరు 15: జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో దాదాపు 14వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఉన్నత పాఠశాలల మాత్రమే పనిచేస్తున్నాయి. అయినా ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయులు నిత్యం ఉదయం 9 గంటలకు పాఠశాలకు వచ్చి సాయంత్రం 4.30 వరకు ఉండి పాఠశాల విద్యాశాఖ నుంచి వచ్చే ఆదేశాలకు సమాధానాలు పంపడంలోనే నిగమ్నమౌతున్నారు. ప్రతి ఉపాధ్యాయుడికి భోధతోపాటు కనీసం రెండు మూడు పనులు అదనంగా చేయాల్సి వస్తోంది. దీనికి తోడు ఇటీవల వాట్సప్‌ గ్రూపుల్ని క్రియేట్‌ చేసి విద్యార్థులకు సప్తగిరి ఛానల్‌లో పాఠాలు పంపాలి, వారి నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలి.  కరోనా సమయంలోనూ విధులకు హాజరై ప్రాణాల మీదకు తెచ్చుకుంటూ తీవ్ర పనిఒత్తిడితో ఉపాధ్యాయలు మదనపడుతున్నారు.  ఈ పనుల్లో పడి అసలు కర్తవ్యమైన బోధనను మరుగున పడేస్తున్నారు.


 గంటకో సమాచారం..!

పాఠశాల విద్యాశాఖలో గతంలో ఓ మహిళా అధికారి పనిచేసేవారు. ఆమె కోరిన సమాచారం పంపడానికి ప్రతి పాఠశాలలో కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు నిత్యం సిద్ధంగా ఉండాల్సి వచ్చేది.  ఇటీవల పాఠశాల విద్యాశాఖలో కొత్త అధికారి వచ్చారు. ఆయన కోరే సమాచారం అరగంటకు ఒకసారి మారిపోతుందని, ఒక సమాచారం పంపిన గంటకు మరో సమాచారం పంపాలని వాట్సప్‌లో మేసేజ్‌లు వస్తున్నాయని కొందరు పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు వాపోతున్నారు. మరోవైపు ఉపాధ్యాయుల సమస్యలు వివరించడానికి వెళ్లే ఉపాధ్యాయ సంఘ నాయకులపైన ఆయన సెటైర్లు వేస్తారని సమాచారం. మీకు ఆన్‌డ్యూటీ ఎందుకు? సమస్యలుంటే ఉపాధ్యాయులే నేరుగా చెప్పుకొంటారు కదా? మధ్యలో మీ పెత్తనం ఏంటంటూ సంఘాల నాయకుల్ని ప్రశ్నిస్తాడని వాపోతున్నారు. ఆయనతో వేగలేక అసలు ఆ కార్యాలయానికి వెళ్ళడానికే కొన్ని సంఘాల నాయకులు సాహసించడం లేదు. ఉపాధ్యాయుల తమగోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. 

Updated Date - 2020-12-16T05:18:17+05:30 IST