ప్లాస్టిక్ భూతం..!
ABN , First Publish Date - 2020-11-20T05:56:14+05:30 IST
50 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. దీనిని పక్కాగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా పట్టణ వీధులు, మురుగకాలువలు ప్లాస్టిక్ కూపాలుగా మారుతున్నాయి.
ప్రమాదంలో ప్రజా ఆరోగ్యం
పల్లె, పట్టణాల్లో విచ్చలవిడిగా వినియోగం
రోజుకు 68 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు
పర్యావరణంపై తీవ్ర ప్రభావం
రోజుకు 68 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు
నిషేధం అమల్లో ఉన్నా చోద్యం చూస్తున్న యంత్రాంగం
నామమాత్రపు దాడులతో సరి
(కడప-ఆంధ్రజ్యోతి): ప్లాస్టిక్ వినియోగం ఆరోగ్యానికి ప్రమాదకరమని, వాతావరణంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిసినా.. ప్రజలు వినియోగిస్తూనే ఉన్నారు. 50 మైక్రాన్స్ కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. దీనిని పక్కాగా అమలు చేయాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా పట్టణ వీధులు, మురుగకాలువలు ప్లాస్టిక్ కూపాలుగా మారుతున్నాయి. రోగాలు పెంచుతున్నాయి. ప్లాస్టిక్‌ను భూమిలో వేస్తే నేల కలుషితమవుతోంది. కాలిస్తే విషవాయువులు వాతావరణంలో కలిసి పర్యావరణం దెబ్బతింటోంది. జీవ మనుగడపై దుష్ప్రభావం కలిగించే ప్లాస్టిక్ నిషేధంలో నగర, పురపాలక సంస్థలు వైఫల్యం చెందాయనే ఆరోపణలు లేకపోలేదు.
కడప నగరంతో పాటు, రాజంపేట, ప్రొద్దుటూరు, బద్వేలు, పులివెందుల, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, రాయచోటి మున్సిపాలిటీలలో ప్లాస్టిక్ నిషేధం అమలులో ఉంది. ఈ పట్టణాల్లో 10.45 లక్షల జనాభా ఉంది. రోజూ 422 టన్నుల చెత్త సేకరిస్తున్నారు. ఈ చెత్తలో సుమారుగా 68 టన్నులు ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయని అధికారులే తెలిపారు. అంటే.. నెలకు 1,845 టన్నులు, ఏడాదికి సరాసరి 22 వేల టన్నులకు పైగా ప్టాస్టిక్ వినియోగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గ్రామాల్లో వినియోగం సరేసరి. సుప్రీంకోర్టు తీర్పుమేరకు 50 మైక్రాన్ల కంటే తక్కువ ఉన్న ప్లాస్టిక్ వినియోగిస్తే పురపాలక శాఖ అధికారులు దాడులు చేసి జరినామా వేయవచ్చు. రూ.500 నుంచి రూ.5 వేలకుపైగా అపరాధ రుసుం విధించవచ్చని అధికారులే బెబుతున్నారు. అయినా దాడులు నామమాత్రమే.
ఎక్కడపడితే అక్కడ
ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారు. మురుగు కాల్వల్లో వేయడం వల్ల నాలాలకు అడ్డంపడి మురుగు రోడ్లపైకి చేరుతోంది. కల్వర్టులకు అడ్డంగా చేరి వర్షం వస్తే రోడ్లు చెరువుల్లా మారుతున్నాయి. దుకాణదారులు డ్రైనేజీలపై బండలు వేయడం, వాటి కింద ప్లాస్టిక్ ఇరుక్కుపోయి పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయి. 50 మైక్రాన్ల లోపు ప్లాస్టిక్ వినియోగం నిషేధం ఉన్నా.. అమలు చేయడంలో పురపాలక యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే ఆరోపణలున్నాయి.
ముంచుకొస్తున్న ముప్పు
ప్లాస్టిక్ వాడకం వల్ల భూతాపం పెరుగుతుందని పలు అధ్యయనాలు నిగ్గుతేల్చాయి. ప్టాస్టిక్ క్యారీ బ్యాగుల్లోని ఆహార పదార్థాలు తినడం వల్ల ప్రమాదకరమైన ‘కార్సినోజన్లు’ శరీరంలో చేరి క్యాన్సర్‌కు దారితీస్తుందని, చర్య వ్యాధులు, సంతానలేమి వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంట్లో మిగిలిన ఆహారం, కూరగాయల వ్యర్థాలు ఈ బ్యాగుల్లో వేసి చెత్తకుండీల్లో వేస్తున్నారు. వీటిని మూగజీవాలు తిని మృత్యువాత పడుతున్నాయి. ప్లాస్టిక్ భూమిపొరలో చేరి భూగర్భ కాలుష్యం ఏర్పడుతోంది. ప్లాస్టిక్ కాల్చివేయడం వల్ల అందులోని రసాయనాలు వాతావరణంలో కలిసి మానవ, జీవరాశుల మనుగడపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని పర్యావరణ నిపుణులు ఆందోళన చెందుతున్నారు. ప్లాస్టిక్ వినియోగించకుండా ఉండేలా ప్రజల్లో అధికారులు చైతన్యం తీసుకురావాల్సి ఉంది. అలాగే నిషేధిత ప్లాస్టిక్ కవర్లు అందుబాటులో లేకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంది.
మున్సిపాలిటీల వారీగా రోజుకు సేకరించే చెత్త, అందులో ప్లాస్టిక్ (టన్నుల్లో) వివరాలు
-------------------------------------------------------------------------------------------------------
మున్సిపాలిటీ జనాభా సేకరించే చెత్త ప్లాస్టిక్ పెట్టిన కేసులు జరిమానా
-------------------------------------------------------------------------------------------------------
కడప 3.91 158 17 1 35,000
ప్రొద్దుటూరు 1.80 100 15 200 1,00,000
రాయచోటి 1.10 42 12 -- 20,000
పులివెందుల 0.85 40 12 -- 1,30,000
ఎర్రగుంట్ల 0.32 12 2 -- 6,500
జమ్మలమడుగు 0.52 20 2.50 25 32,000
మైదుకూరు 0.55 7 3 25 5,000
రాజంపేట 0.60 15 3.50 -- --
బద్వేలు 0.80 28 1 7 50,000
----------------------------------------------------------------------------------------------------------
మొత్తం 10.45 422 68 258 3,78,500
----------------------------------------------------------------------------------------------------------
విస్తృత దాడులు చేస్తాం
- సుబ్బారావు, అడిషనల్ కమిషనర్, నగర పాలక సంస్థ, కడప
యాభై మైక్రాన్లకన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ వినియోగాన్ని ప్రభుత్వం నిషేధించింది. ఎక్కడైనా వినియోగిస్తే విస్తృత దాడులు చేసి చట్టపరమైన చర్యలతో పాటు భారీ జరిమానా విధిస్తాం. కరోనా వల్ల కొంత దాడులు తగ్గినమాట వాస్తవమే. త్వరలో ప్లాస్టిక్ నిషేధం అమలుపై ప్రత్యేక ప్రణాళికను అమలు చేస్తాం.