ఇక తెలుగు మహిళా సారధులు..!
ABN , First Publish Date - 2020-10-02T06:45:18+05:30 IST
మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.

కడప పార్లమెంట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా శ్వేతారెడ్డి, కోట శ్రీదేవి రాజంపేట అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా అనసూయరెడ్డి, విజయ
కడప, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): మారిన రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే దిశగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా రెండు రోజుల క్రితం పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి పార్టీ అధ్యక్షులను ఎంపిక చేశారు. తాజాగా తెలుగు మహిళ పార్లమెంట్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులను నియమించారు.
అందులో భాగంగా కడప పార్లమెంట్ స్థానం తెలుగు మహిళ అధ్యక్షురాలిగా కర్నాటి శ్వేతారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కోట శ్రీదేవి, రాజంపేట పార్లమెంట్ స్థానం అధ్యక్షురాలిగా కేఆర్ అనసూయదేవి, ప్రధాన కార్యదర్శిగా ఏ.విజయలను గురువారం నియమించారు. ఈ నియామకంలో సీనియర్లకు ప్రాధాన్యత కల్పించారు.
కడప పార్లమెంట్ స్థానానికి..
కడప పార్లమెంట్ స్థానం తెలుగు మహిళ అధ్యక్షురాలిగా కాశినాయన మండలానికి చెందిన కర్నాటి శ్వేతారెడ్డిని నియమించారు. ఆమె కుటుంబం 1982లో టీడీపీ అవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతోంది. ఆమె మామ కె.శివారెడ్డి కాశినాయన మండల ఏర్పాటుకు కృషి చేయడమే కాకుండా, 1985లో తొలి ఎంపీపీగా ఎంపికయ్యారు. 2003లో శివారెడ్డి మృతిచెందడంతో, ఆ తర్వాత మండల టీడీపీ బాధ్యతలను ఆయన కుమారుడు కె.వెంకటరెడ్డి, శ్వేతారెడ్డి దంపతులకు అప్పగించారు. వెంకటరెడ్డి మండల పార్టీ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని శ్వేతారెడ్డి ఆంధ్రజ్యోతికి వివరించారు.
కడప పార్లమెంట్ స్థానం తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శిగా ప్రొద్దుటూరుకు చెందిన కోట శ్రీదేవిని నియమించారు. 2008 నుంచి పార్టీలో కొనసాగుతున్నారు. నందలూరు మండల పార్టీ ఇన్చార్జిగా కూడా పనిచేశారు. ఒక్క పక్క రాజకీయాల్లో రాణిస్తూనే, మరోపక్క శ్రీదేవి ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటి, మనసేవా ట్రస్ట్ ద్వారా రాష్ట్రంలో మహిళలకు టైలరింగ్, కంప్యూటర్, బ్యూటీషియన్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇస్తున్నారు.
అఖిల కాపు సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షురాలిగా పనిచేశారు. ఈమె భర్త కేకే రాము టీడీపీలో కార్యకర్తగా పనిచేస్తున్నారు. తనకు కీలక బాధ్యతలు అప్పగించారని పార్టీ, మహిళాభ్యున్నతికి కృషి చేస్తానని ఆమె తెలిపారు.
రాజంపేట పార్లమెంట్ స్థానానికి..
రాజంపేట పార్లమెంట్ స్థానం తెలుగు మహిళా అధ్యక్షురాలిగా రాజంపేట మండలం పెద్దకారంపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యురాలు కేఆర్ అనసూయదేవిని నియమించారు. ఈమె భర్త రామనారాయణరాజు 1982లో ఎన్టీఆర్ చేతుల మీదుగా టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. అనసూయదేవి 2001 నుంచి వరుసగా మూడుసార్లు పెద్దకారంపల్లి ఎంపీటీసీ సభ్యురాలిగా గెలిచారు. తెలుగు మహిళా రాజంపేట నియోజకవర్గం కార్యదర్శిగా పనిచేశారు. తనకు కీలక బాధ్యత అప్పగించారని, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని ఆమె వివరించారు.
రాజంపేట పార్లమెంట్ తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శిగా మదనపల్లికి చెందిన ఎ.విజయను నియమించారు. పార్టీలో కార్యకర్తగా 30 ఏళ్లుగా కొనసాగుతున్నారు. 15 ఏళ్లుగా మదనపల్లి పట్టణ తెలుగుమహిళా అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. అధినేత చంద్రబాబు ఎక్కడ సమావేశం నిర్వహించినా, ఆమె హాజరవుతూ వస్తున్నారు. బలహీనవర్గానికి చెందిన ఈమె సేవలను గుర్తించిన అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయనని ఆమె తెలిపారు.