ఏసీబీ వలలో వీఆర్వో
ABN , First Publish Date - 2020-10-02T07:04:50+05:30 IST
రాజంపేట తహసీల్దారు కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడిలో ఆకేపాడు వీఆర్వో ఖాదర్‌బాషా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

రైతు వద్ద రూ.3 వేలు లంచం తీసుకుంటుండగా పట్టివేత
రాజంపేట, అక్టోబరు 1 : రాజంపేట తహసీల్దారు కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడిలో ఆకేపాడు వీఆర్వో ఖాదర్‌బాషా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రాజంపేట మండలం పాపరాజుపల్లెకు చెందిన రైతు యల్లమరాజు వెంకట్రామరాజు వద్ద పాస్‌బుక్కు ఇచ్చే విషయమై 3 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ పి.కంజాక్షన్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ విలేకర్లతో మాట్లాడుతూ పాపరాజుపల్లెకు చెందిన యల్లమరాజు వెంకట్రామరాజు అనే వ్యక్తి 59 సెంట్ల భూమికి ఈ-పాసుబుక్కు చేసేందుకు వీఆర్వో రూ.5 వేలు డిమాండ్ చేశాడన్నారు. ముందుగా 2 వేలు ఇచ్చాడని, మిగిలిన 3 వేలు ఇస్తే చేయిస్తానని చెప్పడంతో రైతు తమను ఆశ్రయించాడని తెలిపారు. గురువారం రైతు నుంచి 3 వేలు తీసుకుంటుండంగా పట్టుకున్నామని తెలిపారు. నగదును స్వాధీనం చేసుకుని వీఆర్వోను అరెస్టు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో ఏసీబీ సీఐలు రెడ్డెప్ప, రామాంజనేయులు, శ్రీనివాసులరెడ్డి పాల్గొన్నారు.