పోరుమామిళ్ల వైద్య విధాన పరిషత్ తీరు ఇదీ! పది మంది డాక్టర్లు ఉండాల్సిన చోట కేవలం..
ABN , First Publish Date - 2020-12-16T05:11:45+05:30 IST
పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించినా ఆ స్థాయిలో వైద్యుల నియామకం జరపకపోవడంతో పేదలకు వైద్యం దూరమవుతోంది.
ఆ ఒక్క డాక్టరే దిక్కు
వేధిస్తున్న వైద్యుల కొరత
పట్టించుకోని పాలకులు, అధికారులు
పది మంది డాక్టర్లు ఉండాల్సిన చోట ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. అందులో కూడా ఇద్దరు సెలవులో ఉండటంతో కేవలం ఒక్క దంత వైద్యుడు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. కొవిడ్ కేసులతో పాటు సాధారణ జబ్బులకు ఆయన ఒక్కరే వైద్య సేవలందిస్తున్నారు. డాక్టర్లతో పాటు నర్సులు, ఇతర సిబ్బంది కూడా తగినంత మంది లేరు. దీంతో ఈ ఆస్పత్రికి వచ్చే రోగులకు అవస్థలు తప్పడం లేదు. ఇదీ పోరుమామిళ్ల వైద్య విధాన పరిషత్ దుస్థితి.
పోరుమామిళ్ల, డిసెంబరు 15: పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించినా ఆ స్థాయిలో వైద్యుల నియామకం జరపకపోవడంతో పేదలకు వైద్యం దూరమవుతోంది. పూర్తి స్థాయిలో వైద్యులను, సిబ్బందిని నియమించడంలో ఏళ్ల తరబడి జాప్యం జరుగుతున్నా జిల్లా స్థాయి వైద్యాధికారులు కానీ, పాలకులు కానీ పట్టనట్లు వ్యవహరించడంతో వైద్యవిధాన పరిషత్‌ను వైద్యుల కొరత వేధిస్తోంది. ఆరుసార్లు కౌన్సిలింగ్ చేసినా పోరుమామిళ్ల రావడానికి చాలామంది విముఖత చూపారని సమాచారం. పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన, బి.కోడూరు మండలాలకు ప్రధాన కేంద్రం కావడంతో చుట్టుపక్కల ఎటువంటి ప్రమాదం జరిగినా పోరుమామిళ్ల వైద్యవిధాన పరిషత్‌నే ఆశ్రయించాల్సి ఉంటుంది. అటువంటి ఈ వైద్యవిధాన పరిషత్‌లో పూర్తి స్థాయి వైద్యులు లేకపోవడం ప్రజలకు ఇబ్బందికరంగా మారింది.
గతంలో 30 పడకలున్న ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రిగా అప్‌గ్రేడ్ చేసి వాటి నిర్మాణాలకు రూ.3 కోట్ల నిధులు కేటాయించినా అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ప్రతిరోజూ ఈ ఆసుపత్రికి దాదాపు 200 మంది వివిధ రకాల వ్యాధిగ్రస్తులు వస్తుంటారు. ఏడాది నుంచి ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు జరగలేదు. ప్రస్తుతం ఈ ఆసుపత్రి స్థాయికి ఒక సివిల్ సర్జన్, డిప్యూటీ సివిల్ సర్జన్, సివిల్ అసిస్టెంట్లు, ఇద్దరు గైనకాలజిస్టులు, పీడియాట్రిషియన్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్ సర్జన్ ఉండాల్సి ఉండగా వీరిలో డిప్యూటీ సివిల్ సర్జన్ బద్వేలుకు బదిలీ అయ్యారు. గైనకాలజి్‌స్ట మెటర్నిటీ లీవులో ఉంది. మరో డాక్టర్ కడపకు వెళ్లారు. అనస్తీషియా డాక్టర్ వారం రోజుల పాటు సెలవులో వెళ్లింది. ప్రస్తుతం దంత వైద్యుడు ప్రసన్నకుమార్‌రెడ్డి ఒక్కరే విధులు నిర్వర్తిస్తున్నారు. ఆస్పత్రికి పది మంది డాక్టర్లు ఉండాల్సి ఉండగా కేవలం ముగ్గురే ఉన్నారు. అందులో కూడా ఇద్దరు సెలవులో వెళ్లడంతో బాధ్యతలన్నీ ఒక్కరే చూస్తున్నారు. కరోనా వైద్య పరీక్షలు మొదలుకుని ఇప్పటి వరకు అన్ని రకాల సేవలందిస్తున్నారు. స్టాఫ్ నర్సులు 12 మంది ఉండాల్సి ఉండగా 9 మంది మాత్రమే ఉన్నారు. జూనియర్ అసిస్టెంట్లు 3 పోస్టులు, థియేటర్ అసిస్టెంట్ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఫార్మసి్‌స్టలు ముగ్గురు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం ఇద్దరు ఉన్నారు. వీరిలో ఒకరు బద్వేలుకు డిప్యూటేషన్‌పై వెళ్లారు. దీంతో ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్యం అందాలంటే ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అంతేకాక కొందరు సిబ్బంది చాలా కాలం నుంచి ఈ ఆసుపత్రిలోనే తిష్ట వేయడం, డ్యూటీపరంగా వారిపై ఏదైనా చర్యలు తీసుకుంటే ఇతరుల ద్వారా వైద్యులపై ఒత్తిడి తెస్తుండటంతో కొత్త వారు రావాలన్నా వెనకంజ వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి ఈ ఆసుపత్రికి అన్నివిధాలుగా వైద్యమందించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం పోస్టుమార్టం నిర్వహించేందుకు కూడా వైద్యులు లేకపోవడంతో ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఇబ్బందిగా మారింది.