భవనాశి పరిరక్షణకు.. ముందుకొచ్చిన వివిధ సంఘాలు
ABN , First Publish Date - 2020-09-10T10:41:11+05:30 IST
భవనాశి పరిరక్షణకు వివిధ సంఘాల నాయకులు ముందుకొచ్చారు. బవనాశి పరిరక్షణ సమితి పేరిట ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. భవనాశి నదిని ఆత్మకూరు మున్సిపల్
- నది ఒడ్డున నినాదాల హోరు
- బీజేపీ, జనసేన నాయకుల మద్దతు
ఆత్మకూరు, సెప్టెంబరు 9: భవనాశి పరిరక్షణకు వివిధ సంఘాల నాయకులు ముందుకొచ్చారు. బవనాశి పరిరక్షణ సమితి పేరిట ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. భవనాశి నదిని ఆత్మకూరు మున్సిపల్ అధికారులు డంప్‌యార్డుగా మార్చిన వైనంపై ఈనెల 6న ఆంధ్రజ్యోతిలో ‘నది నాశనం’ అన్న శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి సామాజికవేత్తలు స్పందించారు. బ్రాహ్మణసంఘం నాయకుడు గరుడాద్రి సత్యనారాయణశర్మ, ఆర్‌ఎస్‌ఎస్, వీహెచ్‌పీ నాయకులు వాసుదేవరెడ్డి, శ్రీధర్‌గుప్త, మాజీ వార్డు మెంబర్ తిరుపతయ్య తనయుడు శివరామకృష్ణ ఆధ్వర్యంలో బుధవారం నది వద్ద నిరసన చేపట్టారు. నదిని పరిక్షరించాలని ప్లకార్డులతో నినాదాలు చేశారు. వీరికి బీజేపీ నంద్యాల పార్లమెంట్ ఇన్‌చార్జి బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి, శ్రీశైలం నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీరాములు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యత ఉన్న భవనాశి నదిలో ఆత్మకూరు మున్సిపల్ అధికారులు చెత్తను డంపింగ్ చేసి కలుషితం చేస్తున్నారన్నారు. నదుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషిచేస్తుంటే ఇక్కడ అధికారులే నదులను నాశనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. భవనాశిలో చెత్త వేయడం వల్ల పర్యావరణానికి విఘాతం కలిగే ప్రమాదం ఉందన్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి భవనాశి కలుషితానికి కారుకులైన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు నది పరిరక్షణకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ వెంకటదాసుకు వినతిపత్రాన్ని అందజేశారు. దీనిపై మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం భవనాశిలో చెత్తను డంపింగ్ చేయడం నిలిపివేశామని తెలిపారు. నది పరిరక్షణకు కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఆయా పార్టీ నాయకుల నాయకులు మహేంద్ర, సుబ్రమణ్యం, సురేంద్ర, అంబటి సతీష్, అరుణ్, నూర్‌బాష, నాగేంద్ర తదితరులు ఉన్నారు.
అభ్యంతరం చెప్పిన పోలీసులు
భవనాశి పరిరక్షణకు చేపట్టిన కార్యక్రమానికి పోలీసులు అభ్యంతరం చెప్పారు. కొవిడ్ కారణంగా 144 సెక్షన్ అమల్లో ఉందని, అనుమతి లేకుండా నిరసన తెలిపితే 30పోలీసుయాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్ భవనాశి పరిరక్షణ సమితి నాయకులను హెచ్చరించారు. చివరకు శాంతియుతంగా నిరసన చేస్తామని హామీ చెప్పడంతో అనుమతించారు. పోలీసుల తీరుపై బీజేపీ నాయకుడు బుడ్డా శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్ జయంతి, వర్ధంతుల పేరిట వైసీపీ నాయకులు నిబంధనలు ఉల్లంఘించినా, మద్యం దుకాణాల వద్ద జనం గూమిగూడినా పట్టని పోలీసులు.. నదుల పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న తమపై కేసులు పెడతామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఆత్మకూరు సీఐ బీఆర్ కృష్ణయ్య బందోబస్తు పర్యవేక్షించారు.