శ్రీశైలంలో వైసీపీ ఫ్లెక్సీలు
ABN , First Publish Date - 2020-02-10T11:46:44+05:30 IST
ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీశైలంలో వైసీపీ నాయకులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో కర్నూలు కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం పేరుతో ఎమ్మెల్యేలకు స్వాగతం పలుకుతూ వీటిని ఏర్పాటు చేశారు.
నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు
ప్రధాన కూడళ్లలో సీఎం జగన్, ఎమ్మెల్యేల ఫొటోలు
వైసీపీ నాయకుల తీరుపై భక్తుల ఆగ్రహం
శ్రీశైలం, ఫిబ్రవరి 9: ఆధ్యాత్మిక కేంద్రమైన శ్రీశైలంలో వైసీపీ నాయకులు భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్లలో కర్నూలు కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం పేరుతో ఎమ్మెల్యేలకు స్వాగతం పలుకుతూ వీటిని ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల్లో సీఎం జగన్, శ్రీశైల దేవస్థానం లోగో, వైసీపీ ఎమ్మెల్యేల ఫొటోలను ముద్రించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు ఎమ్మెల్యే వై.వెంకటరామిరెడ్డి దంపతులు ఆదివారం శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జునుల దర్శనానికి వచ్చారు.
వారికి స్వాగతం పలుకుతూ కర్నూలు కుమ్మరి శాలివాహన సంక్షేమ సంఘం పేరుతో నాలుగు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీలో సీఎం జగన్, శ్రీశైల దేవస్థానం లోగో, వైసీపీ ఎమ్మెల్యేలు సాయిప్రసాద్‌రెడ్డి(ఆదోని), బాలనాగిరెడ్డి(మంత్రాలయం), వై.వెంకటరామిరెడ్డి(గుంతకల్లు), వైసీపీ నాయకులు శివరామిరెడ్డి, సీతారామిరెడ్డి ఫొటోలు ఉన్నాయి. సాక్షి గణపతి ఆలయం వద్ద రెండు, మల్లికార్జున సదన్ ఎదురుగా రెండు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేవస్థానం సిబ్బంది వీటి గురించి పట్టించుకోలేదు. విషయం తెలుసుకున్న ఈవో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సెక్యూరిటీ సిబ్బంది ద్వారా ఫ్లెక్సీలను తొలగించారు. ఎన్నడూలేని విధంగా శ్రీశైలంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. ఎంతో పవిత్రమైన క్షేత్రంలో రాజకీయాలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
నిబంధనలకు విరుద్ధం
శ్రీశైలం దేవస్థానం పరిధిలో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎలాంటి ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయకూడదని, కరపత్రాలు పంచకూడదని 20-10-2012న దేవదాయశాఖ జీవో ఆర్టీ. నెం.1513 జారీ చేసింది. ఈ జీవోను అతిక్రమించిన వారిపై దేవస్థానం చర్యలు తీసుకుంటుంది. ఈ విషయం తెలిసినా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేవస్థానం అనుమతి లేకుండా వైసీపీ ఫ్లెక్సీలో శ్రీశైల దేవస్థానం లోగో ముద్రించారు.
భక్తుల మండిపాటు..
ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్నడూలేని విధంగా ఫ్లెక్సీల ఏర్పాటు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు. పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రంలో రాజకీయ ఫ్లెక్సీల ఏర్పాటుతో తమ మనోభావాలు దెబ్బతింటాయని భక్తులు అన్నారు. క్షేత్రంలో అధ్యాత్మికతను పెంచాల్సింది పోయి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగే చర్యలు ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
గతంలో ఇలాగే..
2014లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి శ్రీశైలం పర్యటన సందర్బంగా క్షేత్రంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేవస్థానం అధికారులు వాటిని తొలగించారు.
ఎన్నికల సమయంలో ఓ పార్టీ నాయకులు పార్టీ జెండాలతో క్షేత్ర పరిధిలో ప్రచారం నిర్వహించారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
రెండేళ్ల క్రితం ఓ పార్టీకి చెందిన నాయకుడి పుట్టినరోజు సందర్భంగా శ్రీశైలంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. దేవస్థానం అధికారులు వాటిని తొలగించారు.
ఇలాంటివి తగదు.. రంగన్న గౌడ్, డోన్
పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఇలాంటి చోట రాజకీయ నాయకుల ఫ్లెక్సీలు ఏర్పాటు చేయకూడదు. ఇప్పుడు ఈ పార్టీ చేసిందని, రేపు మరో పార్టీ చేస్తుంది. తద్వారా అధ్యాత్మికత పోయి రాజకీయ కేంద్రంగా మారుతుంది. క్షేత్రానికి పార్టీలకు సంబంధం లేకుండా అందరూ వస్తారు. దేవుడు అందరికి ఒక్కరే. ఇలాంటివి భవిష్యత్తులో జరుగకుండా దేవస్థానం చర్యలు చేపట్టాలి.
మనోభావాలు దెబ్బతింటాయి.. కొమరయ్య, హైదరాబాద్
శ్రీశైల క్షేత్రానికి భక్తిభావంతో, ఆధ్యాత్మిక చింతనతో వస్తారు. క్షేత్రంలో రాజకీయ పార్టీలకు చెందిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. క్షేత్రంలో ఉన్నంతసేపు భక్తుడి మనస్సులో పరమేశ్వరుడు మాత్రమే నిండాలి. ఇలాంటి ఘటనలు జరగకుండా దేవస్థానం చర్యలు చేపట్టాలి.