బంద్ సంపూర్ణం
ABN , First Publish Date - 2020-12-09T06:09:26+05:30 IST
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతులు చేస్తున్న నిరవధిక ఆందోళనకు సంఘీభావంగా మంగళవారం నిర్వహించిన భారత్ బంద్ జిల్లాలో సంపూర్ణంగా జరిగింది.

రైతులకు మద్దతుగా రోడ్డెక్కిన వామపక్షాలు, రైతు, కార్మిక, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలు
ర్యాలీలు, మానవహారాలు
నగరంలో తెరుచుకోని దుకాణాలు, బ్యాంకులు
మధ్యాహ్నం వరకూ రోడ్డెక్కని ఆర్టీసీ బస్సులు
దేశానికి వెన్నెముక అయిన రైతులను నాశనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదని ఆందోళనకారుల హెచ్చరిక
తక్షణం ఆ మూడు బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్
విశాఖపట్నం, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ శివార్లలో రైతులు చేస్తున్న నిరవధిక ఆందోళనకు సంఘీభావంగా మంగళవారం నిర్వహించిన భారత్ బంద్ జిల్లాలో సంపూర్ణంగా జరిగింది. వామపక్షాలు, వాటి అనుబంధ రైతు, కార్మిక, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలతోపాటు కాంగ్రెస్ పార్టీ, కొన్నిచోట్ల తెలుగుదేశం శ్రేణులు నిరసన ప్రదర్శనలు, మానవహారాలు నిర్వహించాయి.
బంద్ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం ఒంటి గంట వరకూ డిపోలకే పరిమితమయ్యాయి. నగరంలో ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు తెరుచుకోలేదు. కొన్నిచోట్ల దుకాణాలు, బ్యాంకులు తెరిచినప్పటికీ నిరసనకారులు మూసివేయించారు. మద్దిలపాలెం కూడలిలో జాతీయ రహదారిపై సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు సీహెచ్ నరసింగరావు ఆధ్వర్యంలో ఏఐటీయూసీ, సీఐటీయూ, పీఓ డబ్ల్యూ, ఐఎఫ్‌టీయూ తదితర సంఘాల నేతలు, కార్యకర్తలు మానవహారం నిర్మించారు. అనంతరం మద్దిలపాలెం నుంచి రేసపువానిపాలెం, రామాటాకీస్, ఆశీల్‌మెట్ట మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ వరకూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా దారిపొడవునా తెరిచివున్న దుకాణాలు, బ్యాంకులను మూసి వేయించారు. ఆయా దుకాణాలు, షోరూమ్‌లలో పనిచేసే ఉద్యోగులు బంద్‌కు సంఘీభావంగా ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద నిర్విహించిన సభలో సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ కార్పొరేట్‌ల అభివృద్ధి కోసం రైతుల నడ్డి విరిచేలా ప్రధాని నరేంద్రమోదీ కొత్త వ్యవసాయ చట్టాలను రూపొందించారన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతులను నాశనం చేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. గత 12 రోజులుగా రైతులు తమ కుటుంబాలతో కలిసి ఢిల్లీ రోడ్లపై ఆందోళన చేస్తుంటే కేంద్రం పట్టించుకోకపోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు సీహెచ్ నరసింగరావు మాట్లాడుతూ పార్లమెంట్‌లో మద్దతు లేకపోయినా మూజువాణి ఓటుతో అక్రమంగా మూడు వ్యవసాయ చట్టాలను తీసుకొచ్చారని విమర్శించారు. ఈ చట్టాలు దేశంలోని కోట్లాది మంది రైతులకు ఉరితాళ్లుగా మారతాయని ఆందోళన వ్యక్తంచేశారు. బంద్‌లో పాల్గొన్న వారిలో సీపీఐ ఎంఎల్ (ఎన్‌డీ) జిల్లా నగర కార్యదర్శులు ఎం.లక్ష్మి, వై.కొండయ్య, ఎంసీపీఐ(యు)నాయకుడు కె.శంకరరావు, సీపీఐ నగర కార్యదర్శి ఎం.పైడిరాజు తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ ప్రాంతంలో విజయవంతం
వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు మూత
నడవని వాహనాలు...
డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు
ర్యాలీలు, మానవహారాలతో వామపక్షాలు, కాంగ్రెస్ నిరసన
చోడవరం/పాడేరు/అనకాపల్లి, డిసెంబరు 8: చోడవరంలో ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో సాయంత్రం కొవ్వొ త్తుల ప్రదర్శన జరిగింది. కార్పొరేట్ కంపెనీలకు మేలు చేకూరుస్తూ, రైతులకు తీవ్ర నష్టం కలిగించే వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. అనకాపల్లి, పాడేరు, నర్సీపట్నంలో ఆర్టీసీ బస్సులు మధ్యాహ్నం వరకు డిపోలకే పరిమితం అయ్యాయి. వాణిజ్య, వ్యాపార సంస్థలు, హోటళ్లు, బ్యాంకులు, ఎల్‌ఐసీ కార్యాలయాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. గ్రామీణ జిల్లాకు ప్రధాన కేంద్రమైన అనకాపల్లిలో బంద్ ప్రశాం తంగా ముగిసింది. వామపక్షాలు, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలతో పాటు రైతు, కార్మిక, విద్యార్థి సంఘాల నాయ కులు ఉదయం ఆరు గంటలకు రోడ్లపైకి వచ్చి బంద్‌ను పర్యవేక్షించారు. నెహ్రూచౌక్ వద్ద ఏర్పాటుచేసిన సమావే శంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కె.లోకనాథం మాట్లాడుతూ, రైతుల ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఏజెన్సీలో...
ఏజెన్సీ ప్రాంతంలో బంద్ విజయవంతమైంది. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హాటళ్లు, దుకాణాలను మూసివేశారు. ఆర్టీసీ బస్సులు నడవలేదు. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. బంద్ నిర్వాహకులు ర్యాలీలు నిర్వహించారు. ప్రముఖ పర్యాటక కేంద్రాలైన అరకులోయలో గిరిజన మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్, బొర్రా గుహలను మూసివేశారు. జి.మాడుగుల వారపు సంత జరగలేదు. కాగా అరకులోయలో ఐటీడీఏ పీవో డాక్టర్ వెంకటేశ్వర్ వాహనం బంద్‌లో చిక్కుకుపోయింది. విషయం తెలుసుకున్న ఆందోళనకారులు పీవో వాహనం వెళ్లడానికి అనుమతించారు.
