కుటజారిష్ట
ABN , First Publish Date - 2020-12-08T16:32:51+05:30 IST
ఆయుర్వేద వైద్యంలో అతిసారం, గ్రహణి మొదలైన రోగాలకు విశేషంగా ఉపయోగించే మూలిక కుటజ. దీని శాస్త్రీయ నామం హోలారినా యాంటీడైసెంటెరికా. కుటజతో పలు ఔషధాలు తయారుచేస్తారు. వాటిలో కుటజారిష్ట ఒకటి.
ఆంధ్రజ్యోతి(08-12-2020)
ఆయుర్వేద వైద్యంలో అతిసారం, గ్రహణి మొదలైన రోగాలకు విశేషంగా ఉపయోగించే మూలిక కుటజ. దీని శాస్త్రీయ నామం హోలారినా యాంటీడైసెంటెరికా. కుటజతో పలు ఔషధాలు తయారుచేస్తారు. వాటిలో కుటజారిష్ట ఒకటి. ఆయుర్వేద శాస్త్రగ్రంథాలైన శార్గధర సంహిత, సహస్రయోగ, భైషజ్య రత్నావళి మొదలైన వాటిలో కుటజారిష్ట తయారీ విధానం, ఉపయోగాల గురించి చెప్పడం జరిగింది.
కుటజను కొడిశె చెట్టు అని అంటారు. ఇది వృక్షజాతికి చెందినది. తెల్లని పూలు పూస్తుంది. గింజలు నల్లగా, కోలగా ఉంటాయి. చెట్టు బెరడు నుంచి తీసిన రసం తెల్లగా ఉంటుంది. ఆయుర్వేద ఔషధాలలో చెట్టు బెరడు, వేరు, గింజలు ఉపయోగిస్తారు. కుటజారిష్టను కుటజవేరు, ఎండుద్రాక్ష, ఇప్పపువ్వు, గుమ్మడి వేరు మొదలైన మూలికల సంకలనంతో అరిష్ట విధానంలో తయారుచేస్తారు. దీన్ని సేవిస్తే సమస్త జ్వరాలు నశించడమే కాక, అగ్నిదీపనము కలుగుతుంది. రక్తాతిసారం, అసాధ్య గ్రహణి వ్యాధులు ఉపశమిస్తాయి. అతిసారంతో కలిపి వచ్చే జ్వరాలకు, పేగుల్లో అంతర్గతంగా జరిగే రక్తస్రావాలకు బాగా పనిచేస్తుంది. ఇర్రిటబుల్ బోవెల్ సిండ్రోమ్, అమీబియాసిస్ వంటి ఇబ్బందులకు బాగా పనిచేస్తుంది. స్త్రీలకు నెలసరిలో వచ్చే సమస్యల్లో ముఖ్యంగా అధిక రక్తస్రావం, తెల్లబట్ట, ఎర్రబట్ట మొదలైన సమస్యలకు పనిచేస్తుందని అనుభవంలో తేలింది. పై రోగ లక్షణాలు లేనివాళ్లు కుటజారిష్టను వాడితే విరోచనం గట్టిగా అయ్యే లక్షణం ఉంటుంది.
ఉపయోగించే మోతాదు: పెద్దలు 10 మిల్లీలీటర్లు, పిల్లలు 5 మిల్లీలీటర్లు ఉదయం, సాయంత్రం, లేదా వైద్యుల సూచనమేరకు వాడుకోవాలి. ప్రస్తుతం దూద్‌పాపేశ్వర్, బైద్యనాధ్, వైద్యరత్న మందుల సంస్థలు దీన్ని తయారుచేస్తున్నాయి.
శశిధర్,
అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,
సనాతన జీవన్ ట్రస్ట్,
కొత్తపేట, చీరాల