శీతాకాలం... ఆయుర్వేదం

ABN , First Publish Date - 2020-12-01T16:22:07+05:30 IST

వ్యాధికారక క్రిములు విశృంఖలంగా, యధేచ్ఛగా సంచరించే కాలమిది. చల్లని వాతావరణం సూక్ష్మక్రిముల సంచారానికి అనువైనది.

శీతాకాలం... ఆయుర్వేదం

ఆంధ్రజ్యోతి(01-12-2020)

వ్యాధికారక క్రిములు విశృంఖలంగా, యధేచ్ఛగా సంచరించే కాలమిది. చల్లని వాతావరణం సూక్ష్మక్రిముల సంచారానికి అనువైనది. కాబట్టే ఈ కాలంలో తేలికగా వ్యాధుల బారిన పడుతూ ఉంటాం. అయితే రోగనిరోగకశక్తిని మెరుగ్గా ఉంచుకోగలిగితే శీతాకాల రుగ్మతల నుంచి తేలికగానే తప్పించుకోవచ్చు. ఆయుర్వేదంలో ‘బాల’ అంటే ‘శక్తి’ అని అర్థం. ఈ శక్తి ప్రధానంగా వ్యాధినిరోధకతను ఉద్దేశించినదే.  శారీరక శక్తి ఒక్కటే కాకుండా, ఆధ్యాత్మిక శక్తి కూడా దీనిలో ఉంది. ఈ రెండు ప్రదేశాల్లో ఎలాంటి తేడాలు ఏర్పడకుండా రక్షణ కల్పించే వైద్య విధానమే ఆయుర్వేదం. 


వ్యాధినిరోధకశక్తి పెరిగేది ఎలా?

ఆహారం, జీవనశైలితో పాటు వ్యాధినిరోధకశక్తిని ప్రభావితం చేసే అంశాలు బోలెడు. వంశపారంపర్యం, రుతువు, వయసుల ఆధారంగా వ్యాధినిరోధకశక్తిలో మార్పులు వస్తుంటాయి. అయితే సరైన ఆయుర్వేద చికిత్సతో వంశపారంపర్యంగా సంక్రమించిన, రుతువులపరంగా హెచ్చుతగ్గులకు లోనయ్యే, వయసురీత్యా పెరిగి, తరిగే వ్యాఽధినిరోధకశక్తినీ సరిదిద్ది సంవత్సరం మొత్తం సమంగా ఉండేలా చేయవచ్చు. వ్యాధినిరోధకశక్తి మూడు రకాలుగా ఉంటుంది. 


- వంశపారంపర్యం: (సహజ) ఈ వ్యాధినిరోధకశక్తిని పుట్టుకతోనే వెంట తెచుకుంటాం.


- రుతువులు: (కలజ) మారే రుతువులనుబట్టి, జీవన దశలను బట్టి, గ్రహాలను బట్టి వ్యాధినిరోధకశక్తిలో మార్పులు వస్తూ ఉంటాయి.


- తెచ్చుకున్నది: (యుక్తిక్రిత) సమర్ధమైన ఆయుర్వేద విధానాలను ఆచరించడం మూలంగా సమతులమైన, శాశ్వతమైన వ్యాధినిరోధకశక్తిని పొందడం.


పుట్టుకతోనే బలహీనమైన వ్యాధినిరోధకశక్తిని వెంట తెచ్చుకున్నవారి పరిస్థితిని సరిదిద్దడం కష్టం. కాబట్టే మహర్షి ఆయుర్వేద, రుతువుల మార్పుతో, వయసు పరంగా హెచ్చుతగ్గులకు లోనయ్యే రెండో రకం వ్యాధినిరోధకశక్తిని బలపరచడం మీద దృష్టి పెడుతుంది. ముఖ్యంగా శీతాకాలంలో  జీర్ణశక్తి బలంగా ఉండడమే వ్యాధినిరోధకశక్తిని పెంచేందుకు తోడ్పడుతుంది. రూమ్‌ హీటర్‌ శీతాకాలంలో ఎంత సమర్థంగా పని చేస్తుందో, అంతర్గత జీర్ణాగ్ని కూడా ఈ కాలంలో అంతే సమర్థంగా పని చేస్తుంది. శీతాకాలం మన శరీరాన్ని పునరుత్తేజపరిచే సమర్థమైన రుతువు. జీర్ణశక్తి మెరుగ్గా ఉంటుంది కాబట్టి, ఆకలి ఎక్కువగా ఉంటుంది. అంతే సమర్థంగా అరిగించుకోగలుగుతాం. ఫలితంగా శక్తి కూడా మెరుగ్గా ఉంటుంది. అయితే పెరిగిన ఆకలితో అనవసరమైనవి తిని, జీర్ణశక్తిని పరీక్షించేవారు జీర్ణ సమస్యలను ఎదుర్కొంటూ, అందుకు కారణం ఈ కాలంలో జీర్ణశక్తి తగ్గడమనీ, ఈ కాలం మీద అయిష్టాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. కానీ సమతులాహారం కాకుండా, అరుగుదలకు ఎక్కువ సమయం పట్టే పదార్థాలు తినడం వల్ల జీర్ణశక్తితో పాటు, వ్యాధినిరోధకశక్తీ సన్నగిల్లుతుంది. కాబట్టి ఈ కాలంలో. శరీరానికి, మనసుకు ఆరోగ్యాన్ని అందించే ఆహారం తీసుకుంటూ, విశ్రాంతిలో గడపగలిగితే శీతాకాలాన్ని మించిన మంచి రుతువు మరొకటి ఉండదనే విషయం అర్థమవుతుంది. మిగతా రుతువులు శుద్ధికి ఉపయోగపడతాయి. ఈ రుతువు వెంట్రుకలు, గోళ్లు, చర్మాలకు కొత్త జీవాన్ని ఇస్తుంది. కషాయాలు, రసాయనాలు తీసుకోవడానికి అనువైన కాలం కూడా ఇదే.


వాత, పిత్త, కఫ పరిణామాలు

శీతాకాలంలో చల్లని వాతావరణ ప్రభావం మూలంగా వాత, పిత్త, కఫ స్వభావాలు వ్యక్తులను బట్టి విరుద్ధంగా స్పందిస్తూ ఉంటాయి. వ్యక్తుల తత్వాలు రుతువులను బట్టి మారుతూ ఉంటాయి. కఫ తత్వ వ్యక్తుల్లో శీతాకాలంలో ఎక్కువగా కఫం పేరుకుపోతూ ఉంటుంది. అయుతే ఈ సమస్యను ఆయుర్వేద వైద్యంతో సరిదిద్దవచ్చు.


వాత దోషం ఉంటే?

చల్లని వాతావరణం వాత దోషాన్ని పెంచుతుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు.....  


పొడిగా, గరుకుగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు. ఉడికించిన, గోరువెచ్చని పదార్థాలు తీసుకోవాలి.

స్నానానికి ముందు నువ్వల నూనె లేదా కొబ్బరినూనెతో మర్దన చేసుకోవాలి. 

అన్ని రకాల తీపి పండ్లు తినవచ్చు. నట్స్‌, వాటితో తయారైన బటర్‌ తినాలి.

భోజనానికి, భోజనానికీ మధ్య తేనీరు తాగవచ్చు. తీపి, పులుపు, ఉప్పు తగు పాళ్లలో తీసుకోవచ్చు.

సలాడ్లు, ఐస్‌క్రీమ్‌లు, పచ్చి కూరగాయలు తినడం మానేయాలి.

వగరుగా ఉండే పచ్చి పండ్లు,  కెఫిన్‌ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోకూడదు.

బీట్‌రూట్‌, క్యారెట్‌, క్యాబేజీ, కాలీఫ్లవర్‌, వంకాయ, ఆకుకూరలు, పచ్చిబఠాణీ, బెంగుూరు మిర్చి, బంగాళాదుంపలు, మొలకలు, టొమాటోలు తినాలి.

బాగా మగ్గిన అరటిపండ్లు, అవకాడొ, అంజీర్‌, ద్రాక్ష, నారింజ, బొప్పాయి తినవచ్చు.

ఓట్స్‌, బియ్యం పెంచి, గోధుమలు, మొక్కజొన్న, సిరిధాన్యాలు తగ్గించాలి.


పిత్త దోషం ఉంటే?

పిత్తదోషం కలిగిన వారు శీతాకాలంలో కొన్ని కచ్చితమైన ఆహారనియమాలు పాటించాలి. అవేంటంటే...


నీళ్లలో నానబెట్టిన ఎండుద్రాక్ష, చిక్కుళ్లు, బెండకాయ, అన్నం, నెయ్యి, పాలు, పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకోవాలి. 

మిగతా కాలాల్లో కంటే ఎక్కువగా సుగంధద్రవ్యాలు తీసుకోవచ్చు. వీటిలో యాలకులు, పుదీనా, కుంకుమపువ్వు, పుసుపు ఉండాలి.

జీలకర్ర, ధనియాలు, మిరియాలు వేసి తయారుచేసిన టీ తరచుగా తీసుకోవాలి.

ఈ కాలంలో శరీరంలో వేడిని పెంచే పదార్థాలు, పానీయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి.

అరటిపళ్లు, ద్రాక్ష, దబ్బకాయ, పైనాపిల్‌, చింతపండు, ఉడికించిన పాలకూర, జున్ను, పుల్లని పెరుగు, పులిసిన పదార్థాలు తినకూడదు.


కఫ నియంత్రణ

ఈ రుతువులో కఫం పెరగకుండా చూసుకోవాలి. ఇందుకోసం  జీవనశైలి, ఆహారం, వ్యాయామంలో మార్పులు చేసుకోవాలి. ఈ మార్పులతో దోషాల మధ్య సమతౌల్యం తెచ్చుకుని ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచుకోవాలి. కఫ దోషం కలిగిన వాళ్లు....


కనీసం 30 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. యోగ, నడక, ఆటలు ఆడడం... వీటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు.  

సూర్యోదయానికి ముందే నిద్రలేచి, దంతధావనం చేయాలి.

పరగడుపునే వేడినీళ్లలో పసుపు కలిపి తాగాలి.

చిక్కనైన తీయని, ఉప్పటి పదార్థాలు కఫం పెంచుతాయి. పొడిగా ఉండి, తేలికగా జీర్ణమయ్యే, వెచ్చని పదార్థాలు తీసుకోవాలి. ఉదయం అల్పాహారంలో ఓట్లు, గోధుమలు, మొక్కజొన్న, బార్లీ తీసుకోవచ్చు. 

అల్పాహారం తీసుకున్న అరగంట తర్వాత దాల్చినచెక్క, లవంగాలతో తయారైన కషాయం తాగాలి.

శరీరంలోని విషాలను బయటకు వెళ్లగొట్టడం కోసం రోజంతా తరచుగా వేడినీళ్లు తాగుతూ ఉండాలి. 

మధ్యాహ్న భోజనంలో చపాతీ, అన్నం, కూరగాయలు, నెయ్యి తీసుకోవచ్చు.

గోధుమపిండి, మైదా, ఉప్పు ఎక్కువగా తీసుకోకూడదు.

శీతాకాలంలో పాల ఉత్పత్తులు తక్కువ తీసుకోవాలి. ఇవి కఫాన్ని పెంచే గుణం కలిగి ఉంటాయి.

తిన్న వెంటనే నిద్రపోవడం సరికాదు. ఇలా చేస్తే తిన్నది జీర్ణం అవక ఆమ్లం పెరుగుతుంది. ఆమ్లం (యాసిడ్‌) వ్యాధులకు మూలం.

చల్లని నీళ్లు, శీతల పానీయాలు తాగొద్దు. 

శీతాకాలం శరీరం బరువు పెరుగుతుంది. ఇందుకు కారణం ఈ కాలంలో బద్ధకం మూలంగా శరీరానికి సరిపడా వ్యాయామం అందించకపోవడమే. 


Updated Date - 2020-12-01T16:22:07+05:30 IST