అశ్వగంధారిష్ట
ABN , First Publish Date - 2020-12-15T18:50:28+05:30 IST
భారతీయ వైద్యశాస్త్రమైన ఆయుర్వేదంలో బహుళ ప్రాచుర్యంలో ఉన్న ఔషధం అశ్వగంధ. అశ్వగంధ ప్రధాన మూలికగా అనేక ఔషధ యోగాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది అశ్వగంధారిష్ట. దీన్ని
ఆంధ్రజ్యోతి(15-12-2020)
భారతీయ వైద్యశాస్త్రమైన ఆయుర్వేదంలో బహుళ ప్రాచుర్యంలో ఉన్న ఔషధం అశ్వగంధ. అశ్వగంధ ప్రధాన మూలికగా అనేక ఔషధ యోగాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది అశ్వగంధారిష్ట. దీన్ని ద్రవరూపంలో అరిష్టవిధానంలో తయారు చేయడం వల్ల శరీరం తేలికగా గ్రహించగలుగుతుంది. తద్వారా త్వరగా ఉపశమనం కలుగుతుంది. దీని తయారీ, ఉపయోగాల గురించి ఆయుర్వేద శాస్త్రగ్రంథమైన బైషజ్య రత్నావళిలో చెప్పబడింది.
అశ్వగంధను తెలుగులో పెన్నేరుగడ్డ అంటారు. ఇది చిన్న మొక్క జాతికి చెందినది. దీని వేరుతో ఏర్పడే దుంపను ఎక్కువగా ఔషధాలలో ఉపయోగిస్తారు. ఈ దుంప వాసన గుర్రపు వాసనలా ఉంటుంది. కాబట్టే దీనికి అశ్వగంధ అని పేరు. దీన్ని శుద్ధి చేయకుండా వాడితే విపరీతమైన ఫలితాలు కలుగుతాయి. అశ్వగంధారిష్ట తయారీలో శుద్ధి చేసిన అశ్వగంధతో పాటు మంజిష్ఠ, శ్రీగంధం, అతిమధురము, వస, చిత్రమూలము మొదలైన 23 మూలికల సంకలనంతో అరిష్ట విధానంలో తయారుచేస్తారు.
అశ్వగంధ ఉపయోగించడం వల్ల మూర్ఛ, అపస్మారకం, ఉన్మాద, ఆర్శిసులు, మందాగ్ని, వాత రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చు. అశ్వగంధారిష్ట గురించి మా అనుభవంలో తెలిసిన విశేషాలు.... తీవ్రమైన శారీరక అలసట, ఆందోళన, తీవ్రమైన చలిని తట్టుకోలేని పరిసితుల్లో ఉన్నప్పుడు అశ్వగంధారిష్టను వాడడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతూ వేరే ఏ ఔషధం శరీరం గ్రహించలేకుండా, పనిచేయకుండా ఉన్నప్పుడు అశ్వగంధారిష్ట అనుపానంగా ఇవ్వడం వల్ల ఉపయోగం కలుగుతుందని మా అనుభవంలో తెలిసింది.
ఉపయోగించే మోతాదు: పెద్దలు 10 మిల్లీ లీటర్లు, పిల్లలు 5 మిల్లీ లీటర్లు జీదయం, సాయంత్రం లేదా వైద్యుల సూచనమేరకు వాడాలి. ప్రస్తుతం ధూద్‌పాపేశ్వర్, బైద్యనాధ్, వైద్యరత్న మొదలైన ఆయుర్వేద మందుల సంస్థలు దీన్ని తయారుచేస్తున్నాయి.
శశిధర్,
అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,
సనాతన జీవన్‌ట్రస్ట్,
కొత్తపేట, చీరాల.