పునర్నవాస!

ABN , First Publish Date - 2020-11-10T17:02:04+05:30 IST

ఆయుర్వేద వైద్యవిధానంలో మూత్రసంబంధ వ్యాధులు, శరీరం నీరు పట్టడం, తద్వారా తలెత్తే ఆరోగ్య సమస్యలకు పునర్నవాస బాగా ఉపయోగపడుతుంది. దీని తయారీ, ఉపయోగాల

పునర్నవాస!

ఆంధ్రజ్యోతి(10-11-2020)

ఆయుర్వేద వైద్యవిధానంలో మూత్రసంబంధ వ్యాధులు, శరీరం నీరు పట్టడం, తద్వారా తలెత్తే ఆరోగ్య సమస్యలకు పునర్నవాస బాగా ఉపయోగపడుతుంది. దీని తయారీ, ఉపయోగాల గురించి భైషజ్య రత్నావళీ గ్రంథంలోని శూథరోగాధి చికిత్సా ప్రకరణ్‌ అధ్యాయంలో చెప్పబడింది. ఆయుర్వేద వైద్యవిధానంలో శోథ (ఇన్‌ఫ్లమేషన్‌), ఉదర (అబ్డామిన్‌) రోగాలకు ఈ ఔషధం సూచించబడింది.


దీన్లో ప్రధానంగా వాడే మూలిక పునర్వ. దీన్ని తెలుగులో గలిజేరు, గంజి కాడ అని కూడా అంటారు. ఇది తెల్ల గజినేరు, ఎర్ర గజినేరు అనే రెండు రూపాల్లో దొరుకుతుంది. వీటినే సంస్కృతంలో పునర్వ, రక్త పునర్వ అంటారు. తెల్ల గజినేరు ఎక్కువ ఔషధ విలువలు కలిగి ఉంటుంది.


దీన్ని తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఆకుకూరగా వంటల్లో వాడతారు. పునర్వవాసలో పునర్వతో పాటు త్రికటు, దారు హరిద్ర, బృహతి, కటుక రోహిణి వంటి 23 మూలికల సంకలనంతో ఆసవ విధానంలో తయారుచేస్తారు. అంటే.. మూలికలన్నీ నీటిలో కలిపి ఆసవ పాత్రలో మాసం రోజులు ఉంచి తయారుచేస్తారు. 


పలు ఆరోగ్య సమస్యల్లో....

పునర్నవాస రక్తవృద్ధి, రక్తశుద్ధి, శరీరం నీరు పట్టడం, కాళ్ల వాపులు తగ్గించడానికి, కాళ్ల వాపులతో వచ్చే నొప్పులు తగ్గించడానికి విశేషంగా ఉపయోగపడుతుంది. కిడ్నీలో రాళ్లను కరిగించడానికి ఉపయోగపడుతుంది. పాము కాటుకు అందించే వైద్యంలో ఇతర మందులతో దీన్ని కలిపి ఇస్తారు. శరీరం నీరు పట్టడం, దాన్ని ఆశ్రయించి ఉండే ఇన్‌ఫెక్షన్లు, ముఖ్యంగా రక్తంలో ఉండే ఇన్‌ఫెక్షన్‌ తగ్గించడానికి విశేషంగా ఉపయోగపడుతుంది.


ఉపయోగించే మోతాదు!

పెద్దలు 10 మిల్లీ లీటర్లు, పిల్లలు 5 మిల్లీ లీటర్లు ఉదయం, సాయంత్రం లేదా వైద్యుల సూచన మేరకు వాడాలి. ప్రస్తుతం ధూత్‌ పాపేశ్వర్‌, బైద్యనాధ్‌, వైద్యరత్న, డాబర్‌ వంటి ఆయుర్వేద మందుల సంస్థలు దీన్ని తయారు చేస్తున్నాయి.


శశిధర్‌, 

అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు,

సనాతన జీవన్‌ ట్రస్ట్‌, కొత్తపేట, చీరాల.

Updated Date - 2020-11-10T17:02:04+05:30 IST