అర్జునారిష్ట
ABN , First Publish Date - 2020-11-03T17:27:02+05:30 IST
సనాతన భారతీయ వైద్యవిధానంలోని హృదయ సంబంధిత రోగాలలో అర్జునారిష్ట గురించి వివరించి ఉంది. దీన్నే ‘పార్థారిష్ఠ’ అని కూడా అంటారు. అర్జునారిష్ట ఔషధంలో ముఖ్యంగా ఉండేది
ఆంధ్రజ్యోతి(03-11-2020)
సనాతన భారతీయ వైద్యవిధానంలోని హృదయ సంబంధిత రోగాలలో అర్జునారిష్ట గురించి వివరించి ఉంది. దీన్నే ‘పార్థారిష్ఠ’ అని కూడా అంటారు. అర్జునారిష్ట ఔషధంలో ముఖ్యంగా ఉండేది తెల్లమద్ది బెరడు. ఈ ఔషధం తయారీ, వాడే విధానం గురించి ‘బైషజ్యరత్నావళి’ గ్రంథంలో హృద్రోగ అధికారం అనే అధ్యాయంలో, ‘ఆయర్వేదిక్ ఫార్ములేటరీ ఆఫ్ ఇండియా’ (ఏపీఐ), ‘ఆయుర్వేదిక్ ఫార్మకోఫియా ఆఫ్ ఇండియా’ (ఏపీఐ)ల్లో ఉంది.
అర్జునారిష్ట ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో చెప్పినట్టుగా అరిష్టా విధానంలో తయారు చేస్తారు. ఇందులో ప్రధాన మూలిక తెల్లమద్ది. దీన్నే సంస్కృతంలో ‘అర్జున’ అంటారు. బొటానికల్ నేమ్ ‘టెర్మినలియా అర్జున’. చరకసంహితలో కూడా దీని ప్రస్తావన ఉంది. ఇది పెద్ద వృక్షజాతిలోనిది. భారత దేశంలో విస్తారంగా, ముఖ్యంగా అడవి ప్రాంతాల్లో ఎక్కువగా కనబడుతుంది. గట్టిగా ఉండే ఈ చెట్టు కలపను వ్యవసాయ, గృహోపకరాణాలకు ఉపయోగిస్తారు. గులాబీ రంగులోని దీని బెరడు విశేష ఔషధంగా పనిచేస్తుంది. దీంతోపాటుగా ఎండు ద్రాక్ష, మధువు, ఆరె తదితర ఆరు రకాల మూలికల మిశ్రమంతో అర్జునారిష్ట తయారు చేస్తారు. ఈ ఔషధాన్ని అన్ని రకాల హృదయ సంబంధిత రోగాలకు విశేషంగా వాడుతున్నారు. రక్తనాళాలు బలహీనంగా ఉన్నప్పుడు, వాటిల్లోని అడ్డంకులు (క్లాట్స్) తొలగించడానికి, రక్త సరఫరా మెరుగ్గా జరగడానికి ప్రధానంగా దీన్ని వాడతారు. పెద్దలకు వయసురీత్యా వచ్చే హృదయ సంబంధిత సమస్యలకు బాగా పనిచేస్తుంది. క్రమం తప్పకుండా వాడితే రక్త ప్రసరణ సరిగా లేకపోవడం వల్ల వచ్చే తిమ్మిరులను తగ్గిస్తుంది.
మోతాదు: ఈ ఔషధాన్ని పెద్దలు 10 మిల్లీలీటర్లు, పిల్లలు 5 మిల్లీలీటర్లు ఉదయం, సాయంత్రం... లేదా వైద్యుల సూచన ప్రకారం వాడాలి. ప్రస్తుతం ధూత్ పాపేశ్వర్, బైద్యనాథ్, వైద్యరత్న తదితర ఆయుర్వేద ఔషధ సంస్థలు దీన్ని తయారుచేస్తున్నాయి.
- శశిధర్,
అనువంశిక ఆయుర్వేద వైద్య నిపుణులు
సనాతన జీవన్ ట్రస్ట్,
చీరాల