సహజ పద్ధతిలో పిల్లల్ని కనలేమా..?
ABN , First Publish Date - 2020-06-02T17:29:40+05:30 IST
డాక్టర్! నాకు 28 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లు. ఏడాది నుంచి నాకు మధుమేహం ఉంది. అయితే నాకు స్ఖలనం అవుతున్నా, వీర్యం బయటకు రావడం లేదు
ఆంధ్రజ్యోతి(02-06-2020)
ప్రశ్న: డాక్టర్! నాకు 28 ఏళ్లు. పెళ్లయి నాలుగేళ్లు. ఏడాది నుంచి నాకు మధుమేహం ఉంది. అయితే నాకు స్ఖలనం అవుతున్నా, వీర్యం బయటకు రావడం లేదు. ఇలాగైతే మాకు పిల్లలు పుట్టేదెలా? వైద్యులు ఐ.వి.ఎఫ్ ద్వారా పిల్లలను కనమని సూచిస్తున్నారు. మేం సహజసిద్ధంగా పిల్లలను కనలేమా?
- ఓ సోదరుడు, మిర్యాలగూడ
డాక్టర్ సమాధానం: మధుమేహం ఉన్న వారిలో ఇది సాధారణ సమస్యే. దీన్ని ‘రిట్రోగ్రేడ్ ఎజాక్యులేషన్’ అంటారు. ఈ సమస్య ఉన్నవారిలో వీర్యం విడుదల అవుతున్నా, అది బయటకు రాకుండా మూత్రాశయంలోకి చేరుకుని, మూత్రవిసర్జన సమయంలో బయటకు వెళ్లిపోతూ ఉంటుంది. ఈ సమస్యను మందులతో నయం చేయవచ్చు. 80ు మందిలో మందులతోనే సమస్య సమసిపోతుంది. అయితే కొంతమందికి మందులు వాడినంత కాలమే స్ఖలనంతో పాటు వీర్యం బయటకు వస్తూ, మందులు వాడడం ఆపగానే తిరిగి సమస్య తిరగబెడుతుంది. కాబట్టి మందులు వాడుతూ, పిల్లల కోసం ప్రయత్నం చేయవచ్చు. అయితే మందులు వాడడం మొదలుపెట్టిన వెంటనే వీర్య పరీక్ష కూడా చేయించుకుంటే, వీర్యం నాణ్యత కూడా తెలుస్తుంది. దాన్ని బట్టి సహజసిద్ధంగా పిల్లలను కనే ప్రయత్నం చేయవచ్చు. ఒకవేళ వీర్యం నాణ్యత తక్కువగా ఉంటే, ఐ.వి.ఎఫ్ (ఇన్‌విట్రో ఫర్టిలైజేషన్)కు బదులుగా, ఐ.యు.ఐ (ఇంట్రా యుటెరిన్ ఇన్‌సెమినైజేషన్) ద్వారా పిల్లలను కనే ప్రయత్నం చేయాలి. ఐ.వి.ఎ్‌ఫతో పోల్చుకుంటే ఐ.యు.ఐ తక్కువ ఖర్చు కాబట్టి వీర్యం నాణ్యత తక్కువగా ఉన్నా, మొదట ఐ.యు.ఐ ప్రయత్నించాలి. ఒకవేళ వీర్యకణాలు మరీ తక్కువగా ఉన్నా, మందులతో వీర్యం బయటకు రాకపోయినా ఐ.వి.ఎ్‌ఫను ఆశ్రయించక తప్పదు. కాబట్టి మందులు వాడి, వీర్యం స్ఖలనంతో బయటకు తెప్పించే ప్రయత్నం చేయాలి. అదే సమయంలో వీర్య పరీక్ష కూడా చేయించుకుని అవసరాన్ని బట్టి ఐ.యు.ఐ లేదంటే ఐ.వి.ఎఫ్ ఎంచుకోవాలి.
-డాక్టర్ రాహుల్ రెడ్డి, ఆండ్రాలజిస్ట్
జూబ్లీహిల్స్, హైదరాబాద్
8332850090 (కన్సల్టేషన్ కోసం)