ప్రముఖ దర్శకుడు, నటుడు విసు మృతి
ABN , First Publish Date - 2020-03-23T06:30:59+05:30 IST
ప్రముఖ తమిళ సినీ నటుడు, దర్శకుడు విసు ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. కొంతకాలంగా..
చెన్నై, మార్చి 22(ఆంధ్రజ్యోతి): ప్రముఖ తమిళ సినీ నటుడు, దర్శకుడు విసు ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆయన వయస్సు 72 సంవత్సరాలు. కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆదివారం తుదిశ్వాస విడిచారు. తమిళ రంగస్థలంలో నటుడిగా ప్రవేశించిన విసు కుటుంబ కథలను నాటకాలుగా మలిచి ప్రదర్శించి పేరుగాంచారు. తర్వాత ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరారు. బాలచందర్ దర్శకత్వంలో రజనీ నటించిన ‘తిల్లుముల్లు’ చిత్రంలో విసు నటుడిగా తమిళ చిత్రసీమకు పరిచయమయ్యారు. విసు నాటకాలన్నీ కుటుంబ కథా చలన చిత్రాలుగా మారడం విశేషం. వాటిలో ‘సంసారం అదు మిన్‌సారం (తెలుగులో.. సంసారం చదరంగం) సూపర్‌హిట్టయ్యింది. ‘ఆడదే ఆధారం’ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సినిమాలో నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించారు. విసు చివరగా దర్శకత్వం వహించి నటించిన చిత్రం ‘తంగమణి రంగమణి’. విసుకు ముగ్గురు కుమార్తెలు. విసు అంత్యక్రియలు చెన్నై తురైపాకంలో సోమవారం నిర్వహిస్తామని కుటుంబీకులు తెలిపారు.