భారత్‌ బంద్‌

ABN , First Publish Date - 2020-12-08T07:32:24+05:30 IST

మూడు సాగు చట్టాల్ని నిరసిస్తూ రైతాంగం గత 12 రోజులుగా చేస్తున్న పోరు మంగళవారం భారత్‌ బంద్‌తో ఉధృతం కానుంది.

భారత్‌ బంద్‌

ఉదయం 11 నుంచి 3 గంటల వరకు

విపక్షాలు, కార్మిక సంఘాల బాసట అదే బాటలో రవాణా, 

బీఎస్‌ఎన్‌ఎల్‌, బ్యాంకు సిబ్బంది

 రైల్వే సర్వీసులకూ ఆటంకం!

మారని ప్రభుత్వ తీరు ఉధృతం కానున్న పోరు

రైతుల పక్షాన ఫ్రీగా వాదిస్తా

సుప్రీం బార్‌ చీఫ్‌ దవే


కేంద్రం తెచ్చిన సాగు చట్టాలు అక్రమం, రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు దుష్యంత్‌ దవే అన్నారు. వీటిని సవాలు చేస్తూ రైతులెవరైనా కోర్టులో పోరాడదలిస్తే వారి పక్షాన ఉచితంగా వాదనలు వినిపించడానికి తాను, మరికొందరు లాయర్లు సిద్ధమని ఆయన ప్రకటించారు. దేశ హితం దృష్ట్యా ఈ చట్టాల అమలు నిలిపేస్తూ కేంద్రం ఓ నోటిఫికేషన్‌ జారీ చేయడం మంచిదని ఆయన హితవు పలికారు. 


న్యూఢిల్లీ, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): మూడు సాగు చట్టాల్ని నిరసిస్తూ  రైతాంగం గత 12 రోజులుగా చేస్తున్న పోరు మంగళవారం భారత్‌ బంద్‌తో ఉధృతం కానుంది. ఢిల్లీ పొలిమేర్లలో కదం తొక్కిన లక్షల మంది రైతులు ప్రభుత్వ తీరుకు నిరసనగా చేపట్టిన బంద్‌ను ఉదయం నుంచి సాయంత్రం దాకా జరపాలని  తొలుత భావించారు. అయితే.. ప్రజలకు ఇబ్బంది కలగరాదన్న ఉద్దేశంతో - లాంఛనప్రాయంగా ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకూ మాత్రమే నిర్వహిస్తామని రైతు నేతలు తాజాగా ప్రకటించారు. ఇప్పటివరకూ అయిదు సార్లు ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం కావడంతో రైతులు బంద్‌కు పిలుపివ్వాల్సి వచ్చింది.  రైతు సంఘాల నేతలతో బుధవారం కేంద్ర ప్రభుత్వం మరో దఫా చర్చలు జరపనుంది.  రైతుల డిమాండ్లను ప్రభుత్వం ఇంతవరకూ తిరస్కరిస్తూ వచ్చింది. రైతులు సూచించిన సవరణలను చేస్తామని, రద్దు అసాధ్యమని చర్చల్లో పాల్గొన్న కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. 


9వ తేదీ చర్చల్లో గనక ప్రభుత్వ తీరు మారకపోతే ఈ ఉద్యమం తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ప్రతిపక్షాల ద్వంద్వ ప్రమాణాలను ఎండగడుతూ సోమవారం విమర్శలు గుప్పించడంతో  ప్రభుత్వం వెనక్కి తగ్గుతున్న సంకేతాలు కనిపించడం లేదు. రైతాంగ పోరాటం ఇప్పటికే జాతీయ స్థాయిలో ప్రకంపనలు సృష్టించింది. దీంతో మంగళవారం దేశంలో నిత్యావసర సేవలు పూర్తిగా స్తంభించిపోయే అవకాశాలు కనిిపిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌కు చెందిన 23 రైతు సంఘాలు కూడా బంద్‌కు మద్దతు ప్రకటించాయి. ప్రజలంతా స్వచ్ఛందంగా తమ ఆందోళనకు మద్దతివ్వాలని కోరిన రైతు నేతలు- తామెవ్వరం బలవంతంగా షాపులు మూసేయించడం, రహదారులను దిగ్బంధించడం వంటి పనులకు దిగబోమని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌, తృణమూల్‌, టీఆర్‌ఎస్‌, డీఎంకే, ఎస్పీ సహా 14 ప్రతిపక్షాలు ఈ బంద్‌కు మద్దతిస్తున్నట్లు తెలిపాయి.


ఎన్సీపీ నేత మాజీ వ్యవసాయమంత్రి శరద్‌ పవార్‌ నేతృత్వంలో కొందరు విపక్ష నేతల బృందం బుధవారం రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను కలిసి ఆయన జోక్యాన్ని కోరనుంది. 10 ప్రధాన కార్మిక సంఘాలు ఈ బంద్‌లో పాల్గొంటున్నట్లు ప్రకటించాయి. ఇప్పటికే కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఈ సంఘాలు రైతులకు బాసట తెలిపాయి. అంటే దేశంలోని అనేక చిన్న , మధ్యతరహా పరిశ్రమల కార్యకలాపాలు స్తంభించిపోనున్నాయి. పెద్ద పరిశ్రమలపైన కూడా గట్టి ప్రభావం పడనుంది.  కొన్ని ఆటోలు, టాక్సీ సంఘాలు, యాప్‌ ద్వారా నడిచే సంస్థలు కూడా బంద్లో చేరడం వల్ల సాధారణ సేవలు కూడా సాగే పరిస్థితులు కనిపించడం లేదు. 


గళం కలిపిన రైల్వే, బీఎ్‌సఎన్‌ఎల్‌

దేశంలో రైల్వే సిబ్బందికి ప్రాతినిథ్యం వహిస్తున్న రెండు పెద్ద రైల్వే యూనియన్లు-- ఆలిండియా రైల్వేమెన్‌ ఫెడరేషన్‌(ఏఐఆర్‌ఎఫ్‌), నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేమెన్‌(ఎన్‌ఎ్‌ఫఐఆర్‌) రైతుల డిమాండ్లకు మద్దతు ప్రకటించాయి. రైతులకు సంఘీభావంగా ప్రదర్శనలు చేయలని ఈ యూనియన్లు రాష్ట్రాల యూనిట్లకు పిలుపిచ్చాయి. దీనితో రైల్వే సర్వీసులకు కూడా ఆటంకం కలగవచ్చు.    అటు లక్షల మంది సిబ్బంది ఉన్న బీఎ్‌సఎన్‌ఎల్‌ కూడా రైతులకు బాసటగా నిలుస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఇటీవలే తాము సార్వత్రిక సమ్మె చేసినందున తమ సిబ్బంది ఎవరూ రోజువారీ పనిని నిలిపేయబోరని ఫెడరేషన్‌ నేత అభిమన్యు చెప్పారు.


బ్యాంకుల సిబ్బం ది(ఆఫీసర్లు, ఉద్యోగులు) కూడా మద్దతు తెలిపారు ఆఫీసు పనిని బాయ్‌కాట్‌ చేసేది లేదని వెల్లడించారు. అనేక ప్రభుత్వ ప్రైవేటు సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు కూడా రైతుల డిమాండ్లకు శ్రుతి పలికాయి. బంద్‌కు మొట్టమొదట మద్దతు పలికినది అఖిల భారత మోటారు ట్రాన్స్‌పోర్ట్‌ కాంగ్రెస్‌. దేశంలో దాదాపు 95 లక్షల ట్రక్కుల యజమానులకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఈ సంఘం మంగళవారం దేశమంతటా ఆపరేషన్స్‌ను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. 


సరిహద్దు మార్గాల మూసివేత

హరియాణా నుంచి ఢిల్లీ వచ్చే మార్గంలో సింఘు, ఔచండి, పియావో, మనియారీ, మంగేశ్‌, తిక్రి, ఝరోడా సరిహద్దు ప్రాంతాలను ఢిల్లీ ట్రాఫిక్‌ పోలీసులు ఇప్పటికే మూసివేశారు. ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌, పంజాబ్‌, హరియాణాల మీదుగా వెళ్లే జాతీయ రహదారి-44ను ఢిల్లీకి అటూ ఇటూ మూసివేశారు. లాంపూర్‌ , సఫియాబాద్‌, సబోలీ సరిహద్దుల గుండా ఢిల్లీలోకి ప్రవేశించేందుకు వీలు కల్పించారు.


సంఘూ సరిహద్దుకు కేజ్రీవాల్‌

ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ సోమవారంనాడు తన కేబినెట్‌ సహచరులతో కలిసి సంఘూ సరిహద్దు పాయింట్‌ వద్దకు వెళ్లి అక్కడి రైతులతో మాట్లాడారు. వారున్న పరిస్థితులను తెలుసుకుని- అక్కడ ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఏర్పాట్లపై ఆదేశాలిచ్చారు. ముఖ్యంగా సామూహికంగా రైతులు ధర్నా చేస్తున్నందున కొవిడ్‌ వ్యాప్తి నిరోధానికి ఏర్పాట్లను, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని కోరారు. రైతులకు మద్దతు పలుకుతున్న ఆప్‌ సర్కార్‌ మంగళవారంనాటి బంధ్‌కు కూడా మద్దతిచ్చింది.

Updated Date - 2020-12-08T07:32:24+05:30 IST