రేపు చర్చలకు రండి!
ABN , First Publish Date - 2020-12-29T09:19:46+05:30 IST
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలిచింది. డిసెంబరు 30వ తేదీన చర్చలకు
40 రైతు సంఘాలకు కేంద్రం ఆహ్వానం
సరేనన్న సంఘాలు... అజెండాకు డిమాండ్
కౌశిక్ బసు ప్లేటు ఫిరాయించడం శోచనీయం
ఇలాంటి ధోరణులతో ఆర్థిక వ్యవస్థకు నష్టం
నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, డిసెంబరు 28: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతు సంఘాలను కేంద్ర ప్రభుత్వం చర్చలకు పిలిచింది. డిసెంబరు 30వ తేదీన చర్చలకు రావాలని 40 సంఘాలకు ఆహ్వానం పంపింది. డిసెంబరు 29న చర్చలకు సిద్ధంగా ఉన్నామని రైతు సంఘాలు ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆహ్వానం పలికింది. మధ్యాహ్నం 2 గంటలకు విజ్ఞాన్ భవన్‌లో చర్చలు జరుగుతాయని వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ రైతు సంఘాలకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆహ్వానానికి రైతు సంఘాలు సానుకూలంగా స్పందించాయి.
అయితే, సమావేశం అజెండాను ప్రకటించాలని డిమాండ్ చేశాయి. తాము చెప్పిన తేదీ కాకుండా ప్రభుత్వం మరో తేదీని నిర్ణయించడం ఆధిపత్య ధోరణికి నిదర్వనమన్నాయి. ఇప్పటి వరకు ప్రభుత్వానికి, రైతులకు మధ్య జరిగిన 5 దఫాల చర్చల్లో ఫలితం వెలువడలేదు. డిసెంబరు 5న చివరిసారి చర్చల్లో ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాల్లో 7-8 మార్పులకు సిద్ధమైంది. కనీస మద్దతు ధరపై రాత పూర్వక హామీ ఇస్తానని చెప్పింది. రైతు సంఘాల నేతలు మాత్రం మూడు చట్టాల ఉపసంహరణపై ఒక్క మాటలో చెప్పాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. దీంతో ప్రతిష్ఠంభన నెలకొంది. పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌కు చెందిన వేల మంది రైతులు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించాలంటూ ఢిల్లీని నెల రోజులుగా ముట్టడించాయి.
తప్పుడు ప్రచారంతో రైతులకే నష్టం
వ్యవసాయ చట్టాలపై తప్పుడు ప్రచారంతో రైతుల ప్రయోజనాలకే దెబ్బ తగులుతుందని నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు కౌశిక్‌బసు లాంటి ఆర్థిక నిపుణులు కూడా వ్యవసాయ చట్టాలపై మాట మార్చడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మూడు చట్టాలను రద్దు చేసి, కొత్త చట్టాలను రూపొందించాలని కౌశిక్ బసు ఒక వ్యాసంలో సూచించారు. కౌశిక్ బసు కేంద్ర ప్రభుత్వ సలహాదారు హోదాలో (2009-12) ప్రస్తుత చట్టాల్లో పేర్కొన్న వ్యవసాయ విధానాలను సమర్థించి, ఇప్పుడు వ్యతిరేకించడం శోచనీయమన్నారు. రైతులతో చర్చలు తప్ప ప్రభుత్వం దగ్గర వేరే మార్గం లేదన్నారు. అన్ని పంటలకు ప్రభు త్వం కనీస మద్దతు ధర ఇస్తున్నపుడు కార్పొరేట్లు రైతులను దోచుకుంటాయన్న వాదనలో అర్థం లేదని చెప్పారు. వ్యవసాయ చట్టాల చుట్టూ విపక్షాలు పేర్చిన అబద్దాల గోడ త్వరలో కూలిపోతుందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రైతుల ఉద్యమాన్ని ప్రభుత్వం సీరియ్‌సగా తీసుకోవాలని ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ సూచించారు. మరోపక్క రైతులను కాపాడండి, దేశాన్ని కాపాడండి అంటూ రాహుల్‌గాంధీ ట్వీట్ చేశారు.
నిరాహార దీక్ష చేస్తా: అన్నాహజారే
రైతు సమస్యలపై తనడిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం జనవరి నెలాఖరులోగా తలొగ్గకపోతే నిరవధిక నిరాహార దీక్ష చేస్తానని ప్రముఖ సంఘ సేవకుడు అన్నా హజారే హెచ్చరించారు. ప్రభుత్వం అసలు సమస్య లు వదిలి రైతులకు ఉత్తుత్తి హామీలిస్తోందని ఆరోపించారు. స్వామినాథన్ కమిటీ నివేదికను అమలు చేయకుంటే ఆమరణ దీక్ష చేస్తానంటూ ఈ నెల 14న అన్నాహజారే కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌కు లేఖ రాశారు. మంత్రి నెల రోజుల సమయం అడిగారని, అందుకే జనవరి నెలాఖరు వరకు చూస్తానన్నారు. ఇది తాను చేయబోయే చివరి నిరాహార దీక్ష అని 83 ఏళ్ల హజారే ప్రకటించారు. మరోవైపు కేంద్ర వ్యవసాయ బిల్లులపై చర్చించి తీర్మానం చేసేందుకు ఒకరోజు అసెంబ్లీని సమావేశ పరచాలన్న కేరళ సర్కారు విజ్ఞప్తిపై గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ సానుకూలంగా స్పందించారు. డిసెంబరు 31న సమావేశానికి ఆదేశించారు. డిసెంబరు 23న సమావేశానికి కేరళ సర్కారు ప్రయ త్నించినా గతంలో ఆయన తిరస్కరించారు.
బీజేపీ నాయకులకు చెప్పుల దండలేస్తాం
రైతు చట్టాలపై ఆగ్రహంతో ఉన్న హరియాణాలోని పలు గ్రామాల ప్రజలు బీజేపీ, రాష్ట్రంలో ఆ పార్టీకి మద్దతిస్తున్న జన్‌నాయక్ జనతా పార్టీ(జేజేపీ) నేతలపై నిషేధం విధించారు. సీఎం, డిప్యూటీ సీఎంలకు కూడా ఈ నిషేధం వర్తిస్తుందని గ్రామ పంచాయతీల్లో తీర్మానించారు. ‘‘బీజేపీ నాయకులారా.. మా గ్రామానికి వస్తే చెప్పుల దండలేస్తాం’’ అని పొలిమేరల్లో బోర్డు పెట్టారు.