కేసుల కంటే రికవరీలే ఎక్కువ

ABN , First Publish Date - 2020-12-15T07:58:14+05:30 IST

దేశంలో గత 17 రోజులుగా కొత్త కరోనా కేసుల కంటే.. దాని నుంచి కోలుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా నమోదవుతోంది.

కేసుల కంటే రికవరీలే ఎక్కువ

కొత్త కేసులు 27,071 

కోలుకున్న వారు 30,695 మంది  


న్యూఢిల్లీ/జొహన్నె్‌సబర్గ్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి) : దేశంలో గత 17 రోజులుగా కొత్త కరోనా కేసుల కంటే.. దాని నుంచి కోలుకుంటున్న వారి సంఖ్యే ఎక్కువగా నమోదవుతోంది. గడిచిన 24 గంటల్లోనూ దేశవ్యాప్తంగా 27,071 ‘పాజిటివ్‌’ కేసులు నమోదవగా, ఇదే వ్యవధిలో 30,695 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. ఇక క్రియాశీల కేసుల సంఖ్య సైతం 149 రోజుల కనిష్ఠానికి తగ్గింది. చివరగా జూలై 18న 3,58,692 కొవిడ్‌ కేసులు నమోదవగా, మళ్లీ సోమవారం అదే స్థాయి (3,52,586) నమోదైంది. దేశంలో మొత్తం కొవిడ్‌-19 కేసుల సంఖ్య 98.84 లక్షలు దాటగా.. ఇప్పటివరకు 93.88 లక్షల (95 శాతం) మంది రికవరీ అయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కొత్త కేసులు ఎక్కువగా నమోదైన రాష్ట్రాల్లో  కేరళ  (4,698), మహారాష్ట్ర (3,717), పశ్చిమబెంగాల్‌ (2,580), ఢిల్లీ (1,984), ఉత్తరప్రదేశ్‌ (1,424), రాజస్థాన్‌ (1,290) ఉన్నాయి.


గత ఇరవై నాలుగు గంటల్లో ఎక్కువ కరోనా రికవరీలు నమోదైన రాష్ట్రాల్లోనూ కేరళ (5,258), మహారాష్ట్ర (3,083), పశ్చిమబెంగాల్‌ (2,994), ఢిల్లీ (2,539) ఉన్నాయి. మరో 336 మంది ఇన్ఫెక్షన్‌తో మృతిచెందడంతో దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 1.43 లక్షలు దాటింది. కాగా, ఐఐటీ మద్రా్‌సలో 104 మంది విద్యార్థులు, సిబ్బందికి కరోనా ‘పాజిటివ్‌’ నిర్ధారణ అయ్యింది. ఐఐటీని తాత్కాలికంగా షట్‌ డౌన్‌ చేశారు. 


కరోనాతో ఎస్వతిని దేశ ప్రధాని మృతి

ఎస్వతిని దేశ ప్రధాని ఆంబ్రోస్‌ డ్లామినిని కరోనా బలిగొంది. ఆయన వయసు 52 సంవత్సరాలు. 2018లో ప్రధాని పదవి చేపట్టిన ఆయన గత నెలలో కరోనా బారిన పడ్డారు. అప్పటి నుంచి పొరుగునున్న దక్షిణాఫ్రికా దేశంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన మరణవార్తను ఎస్వతిని ప్రభుత్వం సోమవారం ట్విటర్‌లో ప్రకటించింది. దక్షిణాఫ్రికాకు ఈశాన్య దిక్కున ఉన్న చిన్న దేశం ఇది. 11.4 లక్షల జనాభా ఉన్న ఈ దేశంలో ఇప్పటికి 7,000 మంది కరోనా బారిన పడ్డారు. వారిలో 127 మంది మరణించారు.

Updated Date - 2020-12-15T07:58:14+05:30 IST