మొట్టమొదటి జన్యు మార్పిడి మేకపోతు

ABN , First Publish Date - 2020-09-17T08:05:20+05:30 IST

ఈ ఫొటోలో కనిపిస్తున్న మేకపోతుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇది ప్రపంచంలోనే మొదటిసారిగా జన్యు మార్పిడి (జీన్‌ ఎడిటింగ్‌) ద్వారా సృష్టించిన జీవాల్లో ఒకటి...

మొట్టమొదటి జన్యు మార్పిడి మేకపోతు

  • సృష్టించిన అమెరికా శాస్త్రవేత్తలు


న్యూఢిల్లీ, సెప్టెంబరు 16 : ఈ ఫొటోలో కనిపిస్తున్న మేకపోతుకు ఓ ప్రత్యేకత ఉంది. ఇది ప్రపంచంలోనే మొదటిసారిగా జన్యు మార్పిడి (జీన్‌ ఎడిటింగ్‌) ద్వారా సృష్టించిన జీవాల్లో ఒకటి. మేకపోతులతో పాటు మగ పందులు, ఆవులు, గేదెలు, ఎలుకలకూ ఇలాగే జన్యు మార్పిడి చేశామని అమెరికాలోని వాషింగ్టన్‌ స్టేట్‌ యూనివర్సిటీ (డబ్ల్యూఎ్‌సయూ) ప్రత్యుత్పత్తి విభాగం శాస్త్రవేత్తలు ప్రకటించారు. వీటన్నింటిలోనూ సంతానోత్పత్తి సామర్థ్యానికి సంబంధించిన ‘నానోఎస్‌2’ అనే జన్యువు లోపించిందన్నారు. అయినప్పటికీ ఇతర జంతువుల నుంచి వీర్యాన్ని ఉత్పత్తి చేసే మూలకణాల(స్టెమ్‌ సెల్స్‌)ను సేకరించి వీటిలోకి ప్రవేశపెడితే.. సంతానోత్పత్తి సామర్థ్యాన్ని తిరిగి సంతరించుకోగలవని తెలిపారు.


ప్రస్తుతానికైతే జన్యుమార్పులు చేసిన మగ ఎలుకలు వీర్యాన్ని ఉత్పత్తి చేసి, సంతానోత్పత్తి చేయగలిగాయని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ పశు వంగడాల జన్యు విలువలను మేళవించి భవిష్యత్తులో మరింత మెరుగైన జీవాలను వృద్ధి చేసేందుకు జన్యు మార్పిడి బాటలు వేస్తుందన్నారు. తక్కువ నీరు, తక్కువ మేత, అతి తక్కువ మందులతో పెంపకం చేసేందుకు అనువుగా.. అధిక మాంసాన్ని అందించేలా ‘జన్యు మార్పిడి’ పశువులు ఉంటాయని పేర్కొన్నారు. అంతరించిపోతున్న జంతుజాతుల పరిరక్షణకూ ఈ పరిజ్ఞానం ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

Updated Date - 2020-09-17T08:05:20+05:30 IST