కోవిడ్-19పై పోరు : ‘యుక్తి’ ఈ-పోర్టల్ ఆవిష్కరణ

ABN , First Publish Date - 2020-04-12T23:03:18+05:30 IST

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆదివారం

కోవిడ్-19పై పోరు : ‘యుక్తి’ ఈ-పోర్టల్ ఆవిష్కరణ

న్యూఢిల్లీ : కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ఆదివారం ‘యుక్తి’ వెబ్-పోర్టల్‌ను ప్రారంభించారు. కరోనా వైరస్ మహమ్మారి వేధిస్తున్న నేపథ్యంలో ఈ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను దీనిలో ప్రచురిస్తారు. విద్యా సంస్థలు, విద్యార్థులకు కోవిడ్-19పై సమాచారం అందజేసేందుకు ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది.


యుక్తి -వైయుకేటీఐ - యంగ్ ఇండియా కంబాటింగ్ కోవిడ్ విత్ నాలెడ్జ్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్. విజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం, నవ కల్పనలతో కోవిడ్‌పై పోరాడుతున్న యువ భారతం అనే అర్థం వచ్చే విధంగా ఈ పోర్టల్ పేరును రూపొందించారు. 


కోవిడ్-19 నేపథ్యంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ చేపడుతున్న చర్యలు, నిర్వహిస్తున్న కృషిని ‘యుక్తి’లో వివరిస్తారని పోఖ్రియాల్ చెప్పారు. ఈ కార్యక్రమాలను పర్యవేక్షించేందుకు కూడా దీనిని వినియోగిస్తామన్నారు. కోవిడ్-19 విసురుతున్న సవాళ్ళను అత్యంత సమగ్ర విధానంలో వివరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇది ప్రభుత్వానికి, విద్యా సంస్థలకు, విద్యార్థులకు మధ్య వారథిగా ఉపయోగపడుతుందన్నారు. 


విద్యా రంగంలోనివారినందరినీ శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేలా చూడటమే తమ ప్రథమ కర్తవ్యమని తెలిపారు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన అభ్యసన వాతావరణాన్ని అందుబాటులో ఉంచాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ప్రస్తుత కష్టకాలంలో ఈ లక్ష్యాన్ని సాధించేందుకు మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కృషి చేస్తోందన్నారు. విద్యా రంగంలోని వివిధ సంస్థలు కోవిడ్-19 విషయంలో చేపడుతున్న కార్యకలాపాలను దీనిలో వివరిస్తామన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను కూడా వివరిస్తామన్నారు. 


కోవిడ్-19 విసురుతున్న సవాళ్ళను ఎదుర్కొనడానికి అనుసరించవలసిన వ్యూహాలను వివిధ సంస్థలు పంచుకోవచ్చునని, ఆ వివరాలను ఈ పోర్టల్‌లో ప్రచురిస్తామని చెప్పారు.


Updated Date - 2020-04-12T23:03:18+05:30 IST