సోమరులుగా మారొద్దు!

ABN , First Publish Date - 2020-05-15T05:30:00+05:30 IST

ఈ కరోనా వేళ ‘లాక్‌డౌన్‌’ అంటే అర్థం ‘పనులు మానుకోండి’ అని కాదు. ‘పరుగులు మానుకోండి’ అని! ‘అందరూ ఇళ్ళలోనే ఉండండి’ అంటే ‘తిని పడుకోండి’ అని కానే కాదు. ‘ఇంటినే ఇండస్ట్రీగా మార్చుకోండి’ అని కూడా! ఇంటిని ఒక పరిశ్రమగా...

సోమరులుగా మారొద్దు!

ఈ కరోనా వేళ ‘లాక్‌డౌన్‌’ అంటే అర్థం ‘పనులు మానుకోండి’ అని కాదు. ‘పరుగులు మానుకోండి’ అని! ‘అందరూ ఇళ్ళలోనే ఉండండి’ అంటే ‘తిని పడుకోండి’ అని కానే కాదు. ‘ఇంటినే ఇండస్ట్రీగా మార్చుకోండి’ అని కూడా! ఇంటిని ఒక పరిశ్రమగా, పాఠశాలగా, గ్రంథాలయంగా, ఇండోర్‌ స్టేడియంగా మార్చుకుంటే లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఇల్లే ఒక లోకంగా దర్శనమిస్తుంది. ప్రతి ఇల్లూ ఆనందాల నందనవనమై పరిమళిస్తుంది.


ఇలాంటి అవాంతరాలు వచ్చినప్పుడు ప్రతికూల అంశాలను అనుకూలంగా మార్చుకోవాలి. అలా మార్చుకోవడం వల్లనే మనిషి మనుగడ నడుస్తోంది. ‘ఇలాంటి పరిస్థితుల్లో చేసేదేమీ లేదు కదా!’ అని పనీ, పాటూ మాని సోమరితనాన్ని అలవాటు చేసుకుంటే అదే మన నెత్తిన గుదిబండై కూర్చుంటుంది. ఇలాంటి సోమరితనాన్ని వీడాలని బౌద్ధం చెప్పే గొప్ప సందేశాత్మక కథ ఇది. 

ఒక జ్యోతిష్కుడు ఒక గ్రామానికి వచ్చాడు. ‘‘ఇక ఈ ప్రాంతంలో పుష్కరకాలం వర్షాలు పడవు’’ అని చెప్పి వెళ్ళిపోయాడు. 

అప్పుడు ఆ గ్రామ ప్రజలు కొందరు ‘‘ఈ ఊరు వదలి వెళ్ళిపోదాం’’ అనుకున్నారు. మరికొందరు ‘‘మన దగ్గర ధాన్యం ఉంది. వచ్చినంతవరకూ తింటూ ఉందాం. ఇల్లు వదలి బయటకు పనుల కోసం పోనవసరం లేదు. హాయిగా తిని కూర్చోవచ్చు’’ అనుకున్నారు. వాళ్ళు అలాగే తింటూ, ఒళ్ళు పెంచుకున్నారు. సోమరులైపోయారు.

కానీ, ఆ ఊరిలో ఒక రైతు అలా ఆలోచించలేదు. ఉదయాన్నే లేచి, పొలం వెళ్ళేవాడు. దున్నేవాడు. దుగిలి ఏరేవాడు. గట్లు నరికి, శుభ్రం చేసేవాడు. 

ఒక రోజు అతను నాగలి దున్నుతున్నాడు. ఆ సమయంలో ఆకాశంలోంచి వెళ్తున్న మేఘాలు ఈ రైతును చూసి, ఆశ్చర్యపోయాయి. వెంటనే కిందికి వచ్చి, రైతు ముందు వాలి-

‘‘ఓయీ! నువ్వొక మూర్ఖునిలా ఉన్నావే? మేము పన్నెండేళ్ళు వర్షించం అని తెలుసు కదా! తెలిసి కూడా ఈ పిచ్చి పని ఏమిటి? ఈ పొలం పనులు ఎందుకు?’’ అని హేళన చేస్తూ అడిగాయి.

‘‘మేఘాల్లారా! మీరు వర్షించరని నాకు తెలుసు. నేనూ అందరిలా ఇంట్లో కూర్చొని తినగలను. కానీ, అలా ఉంటే ఈ పన్నెండేళ్ళలో నా పనులను నేనే మరచిపోతాను. సోమరితనం పేరుకుపోతుంది. అప్పుడు మీరు వర్షించినా నేను ఏం చేయగలను? నాకు ఉపయోగం ఏముంది? అందుకని మీరు వర్షించినా, వర్షించకపోయినా నా పని మాత్రం నేను మానను’’ అన్నాడు. 

ఆ రైతు మాట వినగానే మేఘాలు భయపడ్డాయి. ఆలోచనలో పడ్డాయి.

‘‘అవును! పన్నేండేళ్ళు కురవడం మానేస్తే... అప్పుడు మన పని మనం మరిచేపోతాం. సోమరులవుతాం. వద్దు, వద్దు. అలా కావొద్దు’’ అనుకుంటూ ఆకాశానికి లేచాయి. వెంటనే వర్షించాయి.

పొలాన్ని దున్ని, సిద్ధం చేసిన ఆ రైతు వెంటనే విత్తనాలు నాటాడు.

-బొర్రా గోవర్ధన్


Updated Date - 2020-05-15T05:30:00+05:30 IST