సమస్యకు మూలం అదే!
ABN , First Publish Date - 2020-05-15T05:30:00+05:30 IST
ఈ కరోనా కాలంలో ఎన్నెన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ‘మనం ఈ విపత్తు నుంచి కోలుకోవడం ఎలా?’ సాధారణంగా అందరూ అడుగుతున్న ప్రశ్న ఇది. ఎందుకంటే ఈ ఉపద్రవం వల్ల చాలా మందికి ఉద్యోగాలు...
ఈ కరోనా కాలంలో ఎన్నెన్నో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ‘మనం ఈ విపత్తు నుంచి కోలుకోవడం ఎలా?’ సాధారణంగా అందరూ అడుగుతున్న ప్రశ్న ఇది. ఎందుకంటే ఈ ఉపద్రవం వల్ల చాలా మందికి ఉద్యోగాలు పోతాయి. జీతాలు తగ్గిపోతాయి. మన జీవనశైలి మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అందరికీ ఆర్థికపరంగా ఎంతో నష్టం ఉంటుంది. ప్రతీ ఒక్కరికీ ఈ దెబ్బ ఏదో మేరకు తగలకుండా ఉండదు. నేను కొన్ని విశ్వవిద్యాలయాల ఉప కులపతులతో, ఇతరులతో మాట్లాడాను. ‘‘ఇప్పటి నుంచి ప్రపంచాన్ని ‘బీసీ’, ‘ఏసీ’ అనాలి’’ అని వారు అంటున్నారు. ‘బీసీ’ అంటే ‘బిఫోర్ కరోనా’... ‘ఏసీ’ అంటే ‘ఆఫ్టర్ కరోనా’!
గుర్తించాల్సిందేమిటంటే, మనం చాలాకాలం ప్రపంచాన్ని సరి చెయ్యాలని చూస్తూ గడిపేశాం. ‘సరిచేయడం’ అంటే ‘మెరుగుపరచడం’ అని అర్థం. ఇంతకు ముందు ఏదైతే పని చెయ్యడం లేదో దాన్ని పని చేసేలా చెయ్యడం! కానీ మనం ప్రపంచం వినాశనం వైపు దారి తీసేలా ‘సరి’ చేశాం. ఇదే ధోరణి కొనసాగిస్తే ఏమవుతుంది?
కరోనా, లాక్‌డౌన్ అనేవి రాకముందు మనం అనుసరించిన పద్ధతులనే అనుసరిస్తూ వెళితే మరో ఇరవై లేదా ముప్ఫై ఏళ్ళలో ఒక పెద్ద వినాశనం జరుగుతుంది. అందులో సందేహమే లేదు. పర్యావరణంలో ప్రతికూల మార్పులు పెరిగే చర్యలను మనం కొనసాగిస్తూ వెళుతున్న దశలో... ఈ కరోనా వైరస్ ఒక ‘పాజ్’ బటన్ నొక్కింది. అది ‘స్టాప్’ కాదు... ‘పాజ్’ మాత్రమే!
‘‘దాదాపు ఇరవయ్యేళ్ళ తరువాత పంజాబ్ నుంచి హిమాలయాలను చూడగలుగుతున్నాం’’ అనీ, ఢిల్లీలో కూడా గాలి స్వచ్ఛంగా ఉందని ప్రజలు అంటున్నారు. ఇది కొనసాగాలంటే లాక్‌డౌన్ తరువాత ఏం చేయాలి, ఏది చేయకూడదు? ఏది అవసరం? ఏది అనవసరం? మనం కొంచెం తగ్గి, కాలుష్యాన్ని కొంచెం తగ్గించి జీవించగలమా? ఇవీ ప్రశ్నలు. ప్రస్తుతం ఈ వైరస్ ఎటూ మనల్ని బలవంతపెడుతోంది. ఈ పరిస్థితిని మనం ఉపయోగించుకోవాలి. మనకన్నా ముందు ఎవరో పరుగెత్తి పోతారన్న భయం మనకు ఉంది. ఈ పోటీకి నియంత్రణ ఉండాలి. కానీ ప్రతి దేశం కలిసి వస్తే తప్ప అది జరిగే పని కాదు. అలాగే మనం అంతులేని అవసరాలు సృష్టించుకున్నాం. వాటికి పరిమితి విధించుకోవాలి. ఇదంతా జరగాలంటే మన విద్యా విధానాలను సమూలంగా మార్చాలి. పర్యావరణానికి అనుకూలమైన పనులు చేయాలంటే జరగాల్సింది అదే! ఎందుకంటే ఈ సమస్యకు మూలం అక్కడే ఉంది.
-సద్గురు జగ్గీవాసుదేవ్