బాబ్రీని కూల్చివేయకుంటే.. ముంబై పేలుళ్లు, దాడులు జరిగేవి కావు

ABN , First Publish Date - 2020-02-07T16:06:05+05:30 IST

లండన్‌లో చదువుకుని.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేత మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. రాజకీయాధికారమే ముస్లింలు, దళితుల పరిస్థితిని..

బాబ్రీని కూల్చివేయకుంటే.. ముంబై పేలుళ్లు, దాడులు జరిగేవి కావు

బాబు సమర్థ నేత.. ఇది కాదనలేని సత్యం

సీఎం కిరణ్‌కు రాజకీయ జ్ఞానం తక్కువ

మద్దతు ఉపసంహరించుకున్న నెలకే అరెస్టులు

జగన్ జస్ట్‌ ఫ్రెండే .. అక్బర్‌ ప్రసంగాన్ని వక్రీకరించారు

ఓపెన్ హార్ట్‌ విత్ ఆర్కేలో మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ


లండన్‌లో చదువుకుని.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న నేత మజ్లిస్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ. రాజకీయాధికారమే ముస్లింలు, దళితుల పరిస్థితిని మెరుగుపరుస్తుందంటున్న ఆయనతో జరిగిన ‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ కార్యక్రమం 17-02-2013న ఏబీఎన్ ఛానెల్‌లో ప్రసారమయింది.. ఆ వివరాలు... 


సీఎం కిరణ్‌తో తగాదా ఎందుకొచ్చింది?

ఆదోని, సంగారెడ్డిల్లో జరిగినటువంటి మతపరమైన వివాదాలపై గత రెండేళ్లలో ఎన్నో సార్లు సీఎంకు ఫిర్యాదు చేశాం. కానీ, పట్టించుకోలేదు. మేం పద్నాలుగేళ్లుగా మద్దతిస్తున్న ప్రభుత్వమే.. ఇలా వ్యవహరించడం నచ్చలేదు. దీనిని సోనియా దృష్టికి కూడా తీసుకెళ్లాం. ఆమెతో ఎంత మంచి సంబంధాలున్నా.. అవి సీఎం కిరణ్‌కన్నా ఎక్కువ కాదుకదా! అంతేకాదు.. చంద్రబాబు అత్యంత సమర్థుడైన నేత. ఆయన బీజేపీకి మద్దతిచ్చారనే ఏకైక కారణం వల్ల మేం ఆయనను సమర్థించలేక పోయాం. అలాంటి ఆయనను అధికారం నుంచి దించేయడం సాధారణ విషయం కాదు. ఆ విషయంలో కాంగ్రెస్‌కు ఎంతో సహకరించాం. ఇటీవల అవిశ్వాస తీర్మానం సమయంలోనూ మా మద్దతు కోరారు. దీనిని వాళ్లు గుర్తించలేదు. చార్మినార్‌ వద్ద భాగ్యలక్ష్మి ఆలయం విషయంగా.. సీఎంపై ఎంతో ఒత్తిడి తెచ్చాం. లాభం లేకపోవడంతో మద్దతు ఉపసంహరించుకున్నాం. మాకు ఏడు సీట్లు రావడానికి కారణం కాంగ్రెస్‌ అని సీఎం కిరణ్‌ అన్నారు. కానీ, ఆయనకు రాజకీయ జ్ఞానం తక్కువ!


మీ అరెస్టుల వెనుక సీఎం ఉన్నారని భావిస్తున్నారా?

మేం ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత కేవలం నెల రోజులకే అక్బర్‌ అరెస్టు కావడం, కొద్ది రోజులకే నన్నూ అరెస్టు చేయడం జరిగింది. మరి దీని వెనుక భావం ఏమిటో ప్రజలు అర్థం చేసుకోగలరు. అంతేకాదు.. ఇలాంటి విషయాన్ని రాష్ట్రం పరిధిలోనే ఉంచుకోవాలి. కానీ, దీన్ని మహారాష్ట్ర, కర్ణాటకలకూ విస్తరించింది. దీనివల్ల నష్టం ఎవరికో వారే గుర్తించాలి!


దళిత ముఖ్యమంత్రి డిమాండ్‌కు కారణం?

ముస్లింలు, దళితుల పరిస్థితి రాష్ట్రంలో ఒకేలా ఉంది. వారి ఆర్థిక, సామాజిక స్థితులూ, వివక్షా ఒకేలా ఉన్నాయి. వీటన్నింటినీ అధిగమించడానికి రాజకీయాధికారమే ముఖ్యం. అందుకోసమే మేం పోరాడుతున్నాం. నాకు మాత్రం ముఖ్యమంత్రి కావాలనే ఆశ లేదు. నేను ఎప్పుడూ కింది స్థాయి సైనికుడినే!


తెలంగాణను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

మేం సమైక్యాంధ్రకు అనుకూలమని స్పష్టంగా చెప్పాం. ఒక వేళ విడదీయాల్సి వస్తే.. రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలి. కానీ, హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోం. రాష్ట్ర విభజనకు సంబంధించి హైదరాబాద్‌తో ఎలాంటి సమస్య లేదు. ఉన్నదల్లా నీటి సమస్యే. ఒక వేళ తెలంగాణ ఏర్పడితే.. టీడీపీ అక్కడ గెలవలేదు. టీఆర్‌ఎస్‌ కూడా పూర్తిగా ఆధిక్యత చూపలేదు. మిగతా పక్షాలు అధికారంలోకి రాలేవు. మొత్తంగా ఈ పరిస్థితి బీజేపీకి అనుకూలించి, బలపడుతుంది. అందువల్ల తెలంగాణకు మేం ఒప్పుకోం. ఈ విషయం మీద నా ప్రశ్నలకు ఎవరూ జవాబు చెప్పలేకపోతున్నారు. అదే రాయల తెలంగాణ ఏర్పడితే.. కొంతైనా రాజకీయ సమతౌల్యం వస్తుంది. అయినా.. తెలంగాణపై నిర్ణయం ఇప్పటికే చాలా ఆలస్యమైంది.


తెలుగు రాకుండా ఏపీలో ఎలా నెగ్గుకు రాగలుగుతున్నారు..?

తెలుగు మాట్లాడలేకపోవడం మాకు పెద్ద లోపం. అసలు మా భావం ఏమిటనేది ప్రజలకు అంతగా చేరడం లేదు. అందుకే ఒక సంవత్సరంలోగా తెలుగు నేర్చుకుని, స్పష్టంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాను. తెలుగు నేర్చుకోవడం కోసం ఒక ట్యూటర్‌ను కూడా పెట్టుకున్నాను. అంతేకాదు.. ముస్లింలతో పాటు దళితులు, ఓబీసీలను చేర్చుకోవాలనేది మా ఉద్దేశం. ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ రాషా్ట్రల్లోలా రాజకీయ పరిస్థితులను ఆంధ్రప్రదేశ్‌లో సృష్టించాల్సి ఉంది. ఎందుకంటే.. ఈ వర్గాలు వెనుకబడటానికి కారణం వారికి రాజకీయ అధికారం లేకపోవడమే!


జగన్‌కు దగ్గరయ్యారనే ప్రచారం?
ఒక వ్యక్తిగా జగన్‌తో స్నేహం ఉంది. అంతేగానీ రాజకీయంగా ఆయన పార్టీతో ఏ సంబంధం లేదు. భవిష్యత్తులో పరిణామాలను బట్టి ఏ పార్టీతో పొత్తు ఉండేదీ నిర్ణయించుకుంటాం. అది టీడీపీ, టీఆర్‌ఎస్‌లతో కూడా కావచ్చు. ఇలాంటి విషయంలో మీ ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ సర్వే బాగుంటుంది. దానిని మేం అనుసరిస్తాం. 

జాతీయ ఎన్నికల్లో మీ విధానం?
ఎన్డీయే మాత్రం మళ్లీ అధికారంలోకి రాకూడదు. మేం చంద్రబాబుతో కలిసినా సరే.. జగన్‌తోనో, కాంగ్రెస్‌తోనో కలిసినా సరే. మోడీ ప్రధాని కాకూడదు. సెక్యూలర్‌ పార్టీలు కూడా ఇదే కోరుకుంటున్నాయి. ఒక రాజకీయ పార్టీగా ఎన్డీయేకు అధికారం దక్కకుండా వీలైనంతగా ప్రయత్నిస్తాం. కాంగ్రెస్‌ సెక్యూలర్‌ పార్టీ కాదనలేం. కానీ, బాబ్రీ కూల్చివేతకు పీవీ నరసింహారావుకు సంబంధం లేదని చెప్పలేం. అసలు బాబ్రీ కూల్చివేతకు గురికాకుండా ఉండాల్సింది. అలాగైతే.. ముంబై పేలుళ్లు, దాడులు వంటివేవీ జరిగేవి కాదు. అయితే.. ప్రస్తుతం మాత్రం కాంగ్రెస్‌ అధ్యక్షురాలిపై గౌరవం ఉంది. 2014లో ఎలాంటి ఫలితాలు వస్తాయనే దానిపై స్పష్టత లేదు. కానీ, ఎన్డీయే రాకూడదు. మోడీ ప్రధాని కాకూడదు.

మతం విషయంగా ప్రజల్లో లేని వైరుధ్యాలు.. కేవలం నేతల వల్లే వస్తున్నాయి?
సచార్‌ కమిటీ, రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌, జాతీయ శాంపిల్‌ సర్వేల సమాచారాన్ని బట్టి ముస్లింలు చాలా వెనుకబడి ఉన్నారని తేలింది. విద్య, ఉద్యోగాలు, ఆర్థికపరంగా వారి పరిస్థితి దారుణంగా ఉంది. ముస్లింలు రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి, ములాయం సింగ్‌ ఇలా అందరికీ ఓట్లు వేశారు. మరి వారి పరిస్థితిపై బాధ్యత ఎవరిది? మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటకల్లో మొత్తంగా 116 లోక్‌సభ స్థానాలుంటే.. కేవలం ఒకే ఒక్క ముస్లిం ఎంపీగా నేను ఉన్నాను. రాష్ట్రంలో 294 అసెంబ్లీ స్థానాల్లో ముస్లింలు ఎంతమంది ఎమ్మెల్యేలుగా ఉన్నారు? దీనికి కారణం ఏమిటి? రాజకీయ అధికారం ఇచ్చేవరకూ.. ముస్లింల పరిస్థితులు బాగుపడవు. అదే మేం కోరుతున్నాం!

అక్బర్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా?
ఆ వ్యాఖ్యల విషయాన్ని కోర్టులు తేలుస్తాయి. ఆధారాలు, వాస్తవాలను అక్బర్‌ కోర్టు ముందు ఉంచుతారు. నిర్దోషిగా బయటపడతారు. అల్లా మాకు న్యాయం చేస్తాడు. ఎవరైనా ఇతర మతాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదు. అదే వీహెచ్‌పీ నేత ప్రవీణ్‌ తొగాడియా, బాల్‌ఠాక్రే లాంటివారు ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మరి వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. ఔరంగాబాద్‌లో పరిస్థితులు బాగా లేవని నన్ను అక్కడికి రానివ్వలేదు. మరి తొగాడియాను ఎలా రానిచ్చారు. నరేంద్ర మోడీ కూడా ఎన్నో వ్యాఖ్యలు చేశారు. ఇలా వ్యవస్థలను పక్షపాతంతో ఉపయోగించుకోవడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదు.

చదువుకున్నవారుగా మీ సోదరులకు ప్రత్యేకమైన గౌరవం ఉంది? మరి నిర్మల్‌లో అలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశారు?
‘ఇఫ్‌ యూ డోంట్‌ వర్షిప్‌ గాడ్‌.. యూ ఆర్‌ ఏ ఫూల్‌ (దేవుడిని పూజించకపోతే.. నువ్వొక మూర్ఖుడివి)’ అనే వాక్యం ఉంది. మరి దానినే.. ‘ఇఫ్‌యూ డోంట్‌ వర్షిప్‌.. గాడ్‌ యూఆర్‌ ఏ ఫూల్‌ (పూజించకపోతే.. దేవుడా నువ్వొక మూర్ఖుడివి)’గా పలికితే!? దేవుడిని తిట్టినట్లా? ఇలాగే అక్బర్‌ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించారు. నిజామాబాద్‌, నిర్మల్‌లలో ప్రసంగించిన తర్వాత కేసు నమోదు చేయడానికి ప్రభుత్వానికి అంత సమయం ఎందుకు పట్టింది. దీని వెనుక బీజేపీ, సంఘ్‌ పరివార్‌ హస్తం ఉంది. అయితే.. దీనిపై కోర్టులే నిజా నిజాలు తేలుస్తాయి. మేం కేవలం రాజకీయ, ఆర్థిక సమానత్వం కోసమే పోరాడుతున్నాం.

హైదరాబాద్‌లో పాతబస్తీ ప్రాంతం ఎందుకు అభివృద్ధి కావడం లేదు?
ఆ మాట ఎవరన్నారు? ఎన్నో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. వైఎస్‌ హయాంలో పాతబస్తీ అభివృద్ధి కోసం 500 కోట్లు కేటాయించారు. కానీ, తర్వాత ఆ నిధులను నిలిపేశారు. మజ్లిస్‌ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు తమ నిధులన్నింటినీ అభివృద్ధికే వినియోగిస్తున్నారు. ముస్లిం కుటుంబాల్లో జనాభా ఎక్కువగా ఉండడం వల్లే ఆర్థికంగా అభివృద్ధి చెందడం లేదనే దానితో నేను ఏకీభవించను. మానవ వనరులే అభివృద్ధికి కారణమనే చైనా మోడల్‌ను మనం పరిగణనలోకి తీసుకోవాలి.

Updated Date - 2020-02-07T16:06:05+05:30 IST