రెండు మెట్లు దిగి వైసీపీలో చేరా

ABN , First Publish Date - 2020-02-07T17:17:37+05:30 IST

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో ఉన్న చనువు, అధికార పార్టీ వైఫల్యాలపై పోరాడేందుకు వైసీపీయే ప్రత్యామ్నాయం అనుకున్నా..

రెండు మెట్లు దిగి వైసీపీలో చేరా

కొందరి తప్పులకు కాంగ్రెస్‌ మూల్యం చెల్లించింది

గవర్నర్‌ నాకెందుకులే అనుకుంటున్నారు

రేవంత్‌ నిర్దోషినని నిరూపించుకోవాలి

60 రోజులుగా సమస్యలను పట్టించుకోవట్లేదు

అందుకే బాబును రాజీనామా చేయమన్నాం: బొత్స


వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో ఉన్న చనువు, అధికార పార్టీ వైఫల్యాలపై పోరాడేందుకు వైసీపీయే ప్రత్యామ్నాయం అనుకున్నా. ప్రజలు, నన్ను నమ్ముకున్న వారి కోసమే ఓ రెండు మెట్లు దిగి జగన్‌ పార్టీలో చేరాను. ముడుపుల వ్యవహారంలో నిర్దోషినని రేవంత్‌ నిరూపించుకోవాలి. చంద్రబాబు సీబీఐ విచారణ చేయించుకోవాలి. ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ఆయన్ను రాజీనామా చేయమన్నాం. కేసీఆర్‌, జగన్‌ కుమ్మక్కయ్యారని ఏ కోణంలో చెబుతారు’’ అని అంటున్న పీసీసీ మాజీ చీఫ్‌, వైసీపీ నేత బొత్స సత్యనారాయణతో 22-6-15న ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ చేసిన ఓపెన్‌హార్ట్‌ విత్‌ ఆర్కేలో పంచుకున్న విశేషాలు..


కొత్త రాష్ట్రం.. కొత్త పార్టీ ఇప్పుడెలా ఉంది మీ ప్రయాణం?

కొత్త రాష్ట్రం అప్పుడే ఒక ఏడాది అయిపోయిందనుకోండి. కానీ కొత్త పార్టీ పదిరోజులే అవుతోంది. మన కమిట్‌మెంట్‌.. ఆలోచనా విధానం బట్టే అన్నీ వస్తుంటాయి. నన్ను నమ్ముకున్న వారు, నా ప్రజలు, రాష్ట్ర ఆలోచన గురించి చేరాను అంతే.


ఆ పార్టీనే (వైసీపీ) ఎందుకు ఎంపిక చేసుకున్నారు?

ఎందుకంటే.. కాంగ్రెస్‌లో ఉండి ఏడాది పాటు ఎన్నో పోరాటాలు చేశాను. అయినా ప్రజల నుంచి తగినంత స్పందన కనిపించలేదు. కాంగ్రె్‌సను ప్రజలు నమ్మడం లేదు అనేకంటే.. వారికి ఆ పార్టీపై కోపం తగ్గలేదు. అలా అని అధికారం కోసం నేను పార్టీ మారలేదు. బాధ్యత గల వ్యక్తిగా, రాజకీయాల్లో పరిణతి గల వ్యక్తిగా మన ఉద్దేశాలు చెప్పకపోతే సమంజసం కాదనే ఈ నిర్ణయం తీసుకున్నాను. పూర్వం రాజశేఖర్‌రెడ్డితో నాకున్న చనువు, సాన్నిహిత్యం వల్ల.. వైసీపీ తప్ప మరొకటి లేదు అనుకున్నాను.


పీసీసీ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు జగన్‌పై పోరాటం చేశారు.. ఆయనది లక్ష కోట్ల అవినీతి అని తిట్టేవారు కదా?

అది పార్టీ పాలసీ. ఆరోజు మాకు తెలుగుదేశం, వైసీపీ అన్ని ప్రతిపక్షాలే. అన్నీ సమానమే అని చెప్పా. కానీ, జగన్‌ను ఎప్పుడూ నేను అలా తిట్టలేదు. నేను ఒక్కటే చెప్పాను. చట్టాలున్నాయి. ఏవైనా ఉంటే చట్టం ప్రకారం మీ నిర్దోషిత్వం నిరూపించుకోవాలని అన్నాను. రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో నేను మంత్రిగా పనిచేశాను. దురదృష్టవశాత్తు ఆయన మమ్మల్ని వదిలి వెళ్లారు.


మీరు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి బొత్స అంటే కాంగ్రెస్‌. ఒక సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థి. అలాంటి వ్యక్తి సడన్‌గా పార్టీ మారారనగానే ఒకరకమైన దిగ్ర్భాంతి కలిగించింది?

నిజమే. అయితే.. ముఖ్యమంత్రి అభ్యర్థి అని, మరోస్థాయి అని కూర్చోవడం నాకు నచ్చదు. నన్ను నమ్ముకున్న వారు, ప్రజలు, రాష్ట్ర సమస్యల కోసం అవసరాన్ని బట్టి వెళ్తాను. బెట్టుకట్టుకొని ‘నేను కిందకు దిగను. నా స్థాయి ఇదే’ అనుకొనే తత్వం నాది కాదు. వైసీపీలో చేరినప్పుడు కూడా ‘‘నా స్థాయి నుంచి ఒకటి-రెండు మెట్లు దిగివచ్చి ఈ నిర్ణయం తీసుకున్నా’’ అని ప్రకటించా.



దిగ్విజయ్‌ సింగ్‌ లాంటి వారు మీకు ఫోన్‌చేశారు కదా?

చేస్తుంటారు. కానీ అంతకుముందే చెప్పాను. పరిస్థితులు బాగోలేవని. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని. రాష్ట్ర విభజన చేయడం తప్పు అయితే కావచ్చు కానీ.. దానిని ప్రేరేపించిన వాళ్లంతా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు చట్టంలో ఉన్నవి సాధించడంలో నాపాత్రా ఉంది. అయితే కొందరు నాయకులు చేసిన తప్పిదానికి పార్టీ మూల్యం చెల్లించుకుంది. అధిష్ఠానం ఈ విషయంలో చాలా క్లియర్‌గా ఉంది.


ఇప్పుడు ఇటు మహబూబ్‌నగర్‌కు న్యాయం జరగాలి.. కానీ, రాయలసీమకు అన్యాయం జరగకూడదు. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉన్నాయి. మరి వాటిని ఎలా పరిష్కరించొచ్చు అని ఆలోచించొచ్చు కదా?

అసలు ఇద్దరు ముఖ్యమంత్రులు రాష్ట్ర విభజన తర్వాత కూర్చుని మాట్లాడుకుంటే బాగుండేది. ఇద్దరు సీఎంలు భేషజాలకు పోకుండా ఏదైనా అంశంపై సమస్య వచ్చినప్పుడు కూర్చుని లేదంటే ఓ మధ్యవర్తిని పెట్టుకుని చర్చించుకుంటే ఈ సమస్యలు ఉండవు కదా.


విభజనప్పుడే ఓ చట్టబద్ధమైన సంస్థ (స్టాట్యూటరీ బాడీ)ని ఏర్పాటు చేసుంటే ఈ గొడవలు ఉండేవి కాదు కదా?

అలాంటి సంస్థను ఏర్పాటు చేశాం కాబట్టే.. మొన్న నాగార్జున సాగర్‌పై పోలీసుల గొడవను తీర్చగలిగారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రాజెక్టుపై పోలీసులను మోహరించినపుడు కేంద్రం ఫోన్‌ చేయగానే బలగాలను వెనక్కు తెప్పించుకున్నారు. ఆ మర్నాడే కూర్చుని చర్చించుకున్నారు. గవర్నర్‌ ముందు కూర్చుని ఆ వ్యవహారాన్ని తీర్చారు కదా. విద్యపై పెట్టిన 371 డీ గురించి గానీ, ఇప్పుడు సెక్షన్‌ 8 అయినా గానీ రాజ్యాంగం ప్రకారం విధించినవే. సెక్షన్‌ 8 చెల్లదని ఆయన (కేసీఆర్‌) అనొచ్చు. కానీ, చట్టంలో ఉన్న అంశాన్ని చెల్లదంటే ఎవరు ఒప్పుకొంటారు. దానిని నిర్ణయించాల్సింది కేంద్ర ప్రభుత్వం, సుప్రీం కోర్టు. పన్నుల విషయాన్ని తీసుకుంటే.. తెలంగాణకు వచ్చిన వాహనాలకు పన్ను వేస్తామంటే ఓకే గానీ, హైదరాబాద్‌కు వచ్చిన వాహనానికి వేస్తామంటే అది తప్పు కదా. కానీ, హైదరాబాద్‌ 10 ఏళ్లు ఉమ్మడి రాజధానిగా ఉంది. అది నా సొంతరాష్ట్రమవుతుంది. అప్పుడు ఇక్కడికి వచ్చే వాటికీ పన్ను వేస్తామంటే ఎలా? దానిపై పిటిషన్‌ వేసినా తప్పవుతుంది.


కానీ, మీ పార్టీ వాళ్లు చంద్రబాబు రాజీనామా చేయాలని అంటున్నారు.?

అవును నైతిక బాధ్యత వహించి చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 60 రోజులుగా అసలు సమస్యలను వదిలిపెట్టి.. ఇదే సమస్యను పట్టుకు కూర్చున్నారు. దీంతో అవి మూలకు పడుతున్నాయి. కాబట్టే పదవికి రాజీనమా చేసి ఓ పార్టీ పెద్దగా కేసు వ్యవహారం చూడమంటున్నాం. సీఎంగా వేరొకరిని పెట్టి రాష్ట్ర వ్యవహారాలు చూసుకోమంటున్నాం.. వాళ్ల తప్పులేనప్పుడు సీబిఐ విచారణకు వాళ్లే డిమాండ్‌ చేయొచ్చు కదా.. అసలు ఆ సమయంలో రేవంత రెడ్డి అక్కడెందుకున్నాడు.. తాను నిర్ధోషినని రేవంత్ నిరూపించుకోవాలి...


జగన్‌, కేసీఆర్‌ కుమ్మక్కయ్యారనే ప్రచారం జరుగుతోంది. అది ఎంత వరకు నిజం?

ఏ కోణంలో అది నిజమని చెబుతారు చెప్పండి.


అంటే ఇద్దరికీ ఒకే శత్రువు చంద్రబాబు కదా?

ఇప్పుడు ఆ పార్టీకి వ్యతిరేకంగా సీపీఐ, సీపీఎంలు, కాంగ్రె్‌సలు ఏదో ఒకకరకంగా పోరాడుతూనే ఉన్నాయి. అలా అని ఆ పార్టీలు కేసీఆర్‌తో కుమ్మక్కయయ్యాయి అని అంటారా చెప్పండి. అలాంటిదేమీ లేదు.


గవర్నర్‌ తెలంగాణ పక్షపాతి అని చాలా మంది విమర్శిస్తున్నారు? మీకేమనిపిస్తోంది?

ఆయన మీద రాజ్యాంగ పరంగా కామెంట్‌ చేయడానికి లేదు. అయితే ఏంటంటే.. నాకెందుకులే అని అనుకుంటున్నారు. ఏదొచ్చినా పైకి.. లేదంటే కిందకు తోసేయటం. ఆయన స్థాయిలో ఆయన నిర్ణయించినా ఎవరూ ఒప్పుకోరు. రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్నప్పుడు ఆయన పరిధిలో ఉన్న అంశాలపై అవునో..కాదో తేల్చేయాలి. కానీ, అలా చేయట్లేదు. ప్రస్తుతం సెక్షన్‌8పై గొడవ జరుగుతోంది. మరి రెండు రాష్ట్రాల వాళ్లు వెళ్లారు. ఎవరి వాదన వారు వినిపించారు. అప్పుడు ఇది మేం పరిశీలిస్తున్నాం.. అవసరమైన సమయంలో నిర్ణయాన్ని ప్రకటిస్తాం అనైనా చెప్పాలి కదా!

Updated Date - 2020-02-07T17:17:37+05:30 IST